‘పునాదిరాళ్లు’ చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ మృతిచెందారు.

మెగాస్టార్ చిరంజీవి ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిత్ర దర్శకుడు గుడిపాటి రాజ్ కుమార్ శనివారం ఉదయం మృతిచెందారు. ‘పునాదిరాళ్లు’ చిత్రం ద్వారా చిరంజీవితో పాటు దర్శకుడిగా పరిచయం అయిన రాజ్ కుమార్ తన తొలి చిత్రానికే ఏకంగా ఐదు నంది అవార్డులు దక్కించుకుని అప్పటిలో సంచలనం సృష్టించారు.
అయితే అనంతర కాలంలో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్నా అవకాశాలు తగ్గటంతో తిరిగి తన స్వగ్రామానికి వెళ్లి పోయారు. అడపా దడప చెన్నైలో, హైదరాబాద్‌లలో తన పరిచయస్తులతో కాలం గడుపుతున్న ఆయన ఆ మధ్య తన పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో వారి ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చుకావటంతో ఆస్తులు కరిగిపోయాయి. దీంతో ఒంటరివాడు అయిన రాజ్ కుమార్ సంపాదన లేక అద్దె ఇంట్లో చిన్న కుమారుడు ఉంటున్నారు.
ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్నఆయన విషయంపై ఆరాలు తీసిన మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రి లో వైద్య పరీక్షలు నిర్వహించి సహకరించారు. అయితే మానసికంగా బాధపడుతున్నరాజ్కుమార్లో అనారోగ్యం తగ్గించేలా ఆతని శరీరం సహకరించక పోవటం, వయసు మీద నడటం తదితరాలతో ఆయన శనివారం ఉదయం మృతి చెందారని ఆయన చిన్న కుమారుడు మీడియాకు చెప్పారు. విజయవాడ సమీపంలోని తమ స్వగ్రామమైన ఉయ్యూరులో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.