ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఆర్.టి.సి కి వెయ్యికోట్లు కేటాయింపు …… మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఆర్.టి.సి ఉద్యోగులందరూ సమిష్టి బాధ్యత తో తమ విధులు నిర్వర్తించాలని తద్వారా రాబోయో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను లాభాల బాటలో తీసుకెళ్తామని రాష్ట్ర రవాణాశాఖామంత్రి
పువ్వాడ అజయకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆర్.టి.సి ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రకటించిన ప్రణాళిక సందర్భంగా సోమవారం ఖమ్మం ఆర్.టి.సి బస్ డిపోలో ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో
ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ
అజయ్ కుమార్ పాల్గొని ఉద్యోగస్తులనుద్దేశించి మాట్లాడారు. ఆర్.టి.సి సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు
సూపర్వైజర్ల, మెకానిక్, డిపో మేనేజర్ ఇతర సిబ్బంది అందరూ కుటుంబం గా పనిచేసి అర్.టి.సి కు
బంగారు బాట వేయాలని మంత్రి అన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ఆర్.టి.సి కి వెయ్యికోట్లు
కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారని అదేవిధంగా మహిళా ఉద్యోగస్తులకు సౌకర్యాల కల్పనలో భాగంగా
వారికి రెస్ట్ రూమ్, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదితో పాటు ప్రభుత్వ మహిళ సిబ్బంది మాదిరిగా చైల్డ్ లీప్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆ ర్.టి.సి ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ-ఇంబర్స్ మెంట్
సౌకర్యం, తల్లిదండ్రులకు హెల్త్ కార్డు, ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారని మంత్రి తెలిపారు. సింగరేణి, విద్యుత్ శాఖల మాదిరిగా భవిష్యత్తు ఆర్.టి.సిలో కూడా
ఉద్యోగస్తులు ఎక్కువ మొత్తంలో బోనస్ పొందే బంగారు భవిష్యత్తు ఉందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఆర్టీసీ డ్రెస్ వేసుకుని బస్సును నడపి, డిపోలో వున్న ఉద్యోగులు, డ్రైవర్ లతో ముచ్చటించారు. ఉద్యోగస్తులు మంత్రి గారికి స్వీట్ తినిపించి, నోట్స్ బుక్స్ అందించి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజు, నగర మేయర్ పాపాలాల్, నగర పాలక సంస్థ కార్పోరేటర్లు, ఆర్.టి.సి రీజనల్ మేనేజర్ కృష్ణమూర్తి డిపో మేనేజర్ శివకుమార్, డి.వి.ఎమ్ సుధాకర్ రావు, ఆర్.టి.సి ఉద్యోగస్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.