తిరుపతి కి ధీటైన మందిరం నిర్మిస్తారా …
అయోధ్య భూ వివాదం లెక్క తేలడంతో ఇప్పుడు రామ మందిర నిర్మాణం ఎలా ఉండబోతోందనే దానిపై చర్చ మొదలైంది. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సహకారంతో రామ జన్మభూమి న్యాస్.. గుడి నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ మేరకు ఏర్పాటైన మందిర నిర్మాణ కమిటీలోని 11 మందిలో విశ్వహిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతినిధులు మార్చి నెల 25 నుంచి ఏప్రిల్ రెండో తేదీలోగా ఈ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి ధీటుగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. రామాలయం ఎలా ఉండబోతుందనే కుతూహలం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మందిర నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నారని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేసి త్వరలోనే వివరాలు వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఈ రామాలయం 128 అడుగుల ఎత్తులో ఉండనుందని, 140 అడుగుల వెడల్పు, 270 అడుగుల పొడవు ఉంటుంది. 212 పిల్లర్లతో దేవాలయం నిర్మిస్తారని విశ్వహిందూ పరిషత్ నేతలు చెపుతున్నారు. పూర్తిగా భారతీయ ప్రజల భాగస్వామ్యంతో మందిరం నిర్మించాలని నిర్ణయించినట్టు చెపుతున్నారు. ఇదే అంశంపై వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ మీడియాలో మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తవుతాయో కచ్చితంగా చెప్పలేను. నిర్ధిష్టంగా 5 ఏళ్లు పడుతుందని మా అంచనా. కోర్టు తీర్పుకు అనుగుణంగా న్యాయ ప్రక్రియ పూర్తి అవుతున్నందున సాధ్యమైనంత త్వరగా గుడి కట్టేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.