శీతాకాలంలో చూడ‌వ‌ల‌సిన రొమాంటిక్ అందాలు ఇవే…?

శీతాకాలంలో కొన్ని ప్ర‌దేశాలు చూడ‌డానికి చాలా బావుంటాయి. అంతేకాదు ఆ ప్ర‌కృతి అందాల‌కు ఫిదా అవ్వ‌ని వాళ్ళు ఎవ్వ‌రూ ఉండ‌రు. పొగ‌మంచుకొండ‌లు, చ‌ల్ల‌టి వాతావ‌ర‌ణం, చ‌క్క‌టి ప్ర‌దేశం, ప‌చ్చ‌టి చెట్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే వీట‌న్నిటిలో త‌మిళ‌నాడులో ఉన్న కొడైకెనాల్ చాలా బావుంటుంది. అంతేకాందు దీన్ని ప‌ర్వ‌త ప్రాంతాల రాణి అని కూడా అంటారు. ఇక్క‌డ ముఖ్యంగా ఓ స‌ర‌స్సు న‌క్ష‌త్ర‌పు ఆకారంలో ఉండి వీక్ష‌కుల‌ను ఆక‌ర్షిస్తుంది.  అద్భుతమైన జలపాతాలతో పాటు అనేక పర్యాటక ప్రదేశాలు ఇక్కడ టూరిస్టులను ఆకట్టుకుంటాయి. రాతి స్తంభాలు, బ్రయంట్ పార్క్, గ్రీన్ వ్యాలీ వ్యూ, బేర్ షోలా జలపాతాలు, డాల్ఫిన్స్ నోస్ వంటి ఎన్నో ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా వింటర్ సీజన్ లో కొడైకెనాల్ హనీమూన్ ట్రిప్ కు వెళ్లే జంటలు ఈ 7 రొమాంటిక్ పనులను అక్కడ తప్పకుండా చేసి తీరాలి. ఇవి మీ ప్రయాణంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను అందిస్తాయి.

వాటిలో మొద‌టిది కోకర్స్ వాక్ ప్రముఖమైనది. వాన్ అలెన్ ఆసుపత్రికి సమీపంలో ఉండే ఈ ప్రదేశం మీకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడి సూర్యోదయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీక్షించడం మర్చిపోకండి. టెలిస్కోప్ హౌస్ ద్వారా చుట్టు పక్కల ప్రకృతి అందాలను తనివితీరా వీక్షించవచ్చు. కొడైకెనాల్ కు వెళ్లే వారు తప్పకుండా ఇక్కడ కాసేపు నడిచి వెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు. మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం.

త‌ర్వాత‌ బస్టాండ్ కు సమీపంలో ఉన్న స‌ర‌స్సు ప‌చ్చ‌దనం నిండిన పరిసరాలు, స్వచ్చమైన నీటితో ఈ ప్రదేశం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ సరస్సు యొక్క అందాలను ఆస్వాదించాలంటే బోటింగ్ కు వెళ్లి తీరాల్సిందే. ఇది మిమ్మల్ని మరో లోకంలో విహరింపజేస్తుంది. శీతాకాలంలో మీరు కొడైకెనాల్ సందర్శనకు వెళ్లినట్లయితే మంచు దుప్పటిలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. ఈ అంద‌మైన ప్ర‌దేశాన్ని చూడ‌డానికి దీని చుట్టూ వాకింగ్, బైకింగ్, గుర్రపు స్వారీలకు కూడా వెళ్లవచ్చు.

కొడైకెనాల్ లో అత్యంత ఉత్కంఠభరితంగా అనిపించే ప్రదేశం గుణా గుహలు. దీనిని డెవిల్స్ కిచెన్ అని కూడా పిలుస్తారు. 19వ శతాబ్ధపు ప్రారంభంలో ఈ గుహలు అన్వేషించబడ్డాయి. పచ్చని ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు, పర్వతాల మధ్య ఉండే ఈ ప్రాంతం కొడైకెనాల్ లోని రొమాంటిక్ ప్రదేశాల్లో ఒకటి. వీటిని సందర్శించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం అవసరం. లేదంటే జారి పడే అవకాశం ఉంటుంది.

ఇక ఎన్నో రంగు రంగుల పూల మధ్య నూతనుత్తేజాన్ని పొందాలంటే బ్రయంట్ పార్క్ మీకు సరైన ఎంపిక. కొడైకెనాల్ లోని రొమాంటిక్ ప్రదేశాల్లో ఇది ఒకటి. వేలాది రకాల మొక్కలు, పువ్వులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పార్కు ఉత్తమ పిక్నిక్ స్పాట్ గానూ ప్రసిద్ధి చెందింది. గ్లాస్ హౌస్, అందమైన రోజ్ గార్డెన్ వంటి అనేక ప్రదేశాలు సందర్శకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి. వేసవిలో ఇక్కడ అద్భుతమైన ఫ్లవర్ షోలు జరుగుతాయి. ఈ పార్కులో నడకకు వెళ్లడం ఎంతో ఆహ్లాదభరితంగా అనిపిస్తుంది.

కొడైకెనాల్ లో చేయాల్సిన సాహసోపేత కార్యక్రమాల్లో డాల్ఫిన్స్ నోస్ ట్రెక్కింగ్ ఒకటి. పర్వతారోహణ చేయడం ఇష్టపడే వారికి ఇది ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మొదటి సారి వెళ్లే వారికి కాస్త క్లిష్టంగా అనిపించినా ఆసక్తికరంగా ఉంటుంది. దాదాపు 3 గంటల ట్రెక్కింగ్ తరువాత డాల్ఫిన్స్ నోస్ పాయింట్ కు చేరుకోవచ్చు. రొటీన్ ను భిన్నంగా చేసే ఇలాంటి పనులు మీరు ఎప్పుడూ నెమరు వేసుకుంటారు.

బెరిజం సరస్సు కొడైకెనాల్ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వచ్చమైన నీరు కలిగిన రిజర్వాయర్ గా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చేరుకునే ప్రయాణం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. బెరిజం సరస్సుకు చేరుకున్న తర్వాత అక్కడ నీటి కలువలు, వృక్షజాలం, ఔషధ మొక్కలు వంటి ఎన్నో ప్రత్యేకతలు ఆశ్చర్యపరుస్తాయి.

కురింజి అండవర్ ఆలయం కొడైకెనాల్ కు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 12 ఏళ్లకు ఓ సారి వికసించే కురింజి పూల కారణంగా ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. మరలా ఇక్కడ కురింజి పూలు 2030లో వికసిస్తాయి. 


Leave a Reply

Your email address will not be published.