శంకరాభరణం ..పేరు వింటేనే ..ఆ.. ఆ.. సినిమానా…!

శంకరాభరణం ..పేరు వింటేనే ..ఆ.. ఆ.. సినిమానా…! 
సాహసం – తెగింపు – పిచ్చి – లేదు లేదు – ఇంతకన్నా పెద్ద పదాలేవన్నా ఉన్నాయేమో వెతకాలి నిఘంటువులో …
మాసు కథలతో – ఐటం సాంగులతో మూడు బూతులు ఆరు రేపులుగా సాగిపోతున్న సినీ ప్రవాహానికి ఓ వంతెన కట్టాలని ఆలోచన తెచ్చిన వారెవరు …??
ఇలాంటి కథలు అక్షర రూపంలోచదువుకుని – శాలువాల క్రింద నలిపేయటానికే తప్ప వెండి తెరపైకి పనికిరావనే భావజాలాన్ని నేల కేసి కొట్టిన ధైర్యం ఎవరు …??
ప్రోడ్యూసరుకి ఎంత గుండె ధైర్యం ఉండాలి – దర్శకుడికి ఎంత తెలివి ఉండాలి. 
ఈ సినీమా వచ్చిన నాటి నుండి నేటి వరకూ అందరూ సంగీతాన్ని ఉద్ధరించిన సినీమాగానే గుర్తించారు గానీ – సమాజాన్ని ఉద్ధరించే సినీమాగా గుర్తించలేదు …
రాంగోపాల్ వర్మ – సారీ … శంకరాభరణం గురించి మాట్లాడుతూ మధ్యలో రామూ పేరు ప్రస్తావించటం పరమ బూతులా అనిపించొచ్చు కొందరికి …
కానీ – తాను తీసిన అప్పలరాజు సినీమా చూసినపుడు నాకు శంకరాభరణం – సప్తపదిల్లాంటి పిక్చర్లే గుర్తొచ్చాయి …
అందుకే – ఆ జీన్సేసుకుని మందుకొట్టే వేదాంతిని తలుచుకోవలసి వచ్చింది. 
ఎందుకంటే – చాలా చాలా గొప్ప సినీమాల్లో దర్శకుడు చూపించాలనుకున్న దానికంటే మరోకటేదో జనాలకి చేరి కూర్చుంటుంది…
అప్పలరాజు సినీమాలో బకెట్ల కొద్ది కన్నీళ్ళు తెప్పించే ఒక సీరియస్ సెంటుమెంటు కథ అనుకుని సినీమా మొదలెడితే చివరికి దానికి బెస్ట్ కామెడీ అవార్డు వచ్చినట్టు …
ఇది కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది.
శంకరాభరణం – సప్తపదులు చూసాక సమాజం పైన – కులమతాల పైన – ఆచార వ్యవహారాల పైన ఒక సదాభిప్రాయం కలిగింది …
నాకు మనిషిని మనిషిగానే చూడాలనీ – ఉన్న దాంట్లో వీలైనంత పక్కోడికి ఇవ్వాలనీ నేర్పిన సినీమాలివి …
సోకాల్డు బ్రాహ్మణ సాహిత్య సంగీతాలని బ్యాక్ డ్రాప్ గా తీసుకున్నా ఫక్తు కమ్యూనిస్టు భావాలున్న సినీమా …
ఇక్కడ సోకాల్డు బ్రాహ్మణ సాహిత్యం అని ఎందుకు ప్రస్తావించానంటే – ఈ మధ్య కొందరు సోకాల్డు పెద్దలు సాహిత్యాన్ని కూడా కులపరంగా – మత పరంగా విభజించి సాహితీ సభల్లో ప్రస్తావించటం చూసాక – ఇలా చెబితేనే అర్థమవుతుందేమోనని …
నిజానికి అక్షరాలకి – సరిగమలకీ – కళలకీ కులమతాలంటగట్టటం ఏంటి …?? మహేషు బాబులా మొహం పగలగొట్టేవాడు లేకపోతే సరి …
భౌగోళికంగా ప్రాంతాన్ని బట్టి యాస భాష ఉంటాయేమో గానీ – కులమతాలని బట్టి ఉండటం ఏమిటి..??
ఆచార వ్యవహారలనేవి మనుషులని క్రమ శిక్షణలో పెట్టడానికే గానీ – కులమతాల పేరుతో దూరం చేస్కోటానికి కాదని పాత్రల తో చెప్పించిన సంగతి ఎంతమందికీ గుర్తుంటుంది …??
సంగీతం అనేది అనంత సముద్రం – దానికి బేధాలేమిటి …?? అనే మాట ఎందరికి గుర్తుంటుంది…??
కులమతాలనేవి గుణాలబట్టే గానీ – పుట్టుకకి సంబంధించినవి కావని ఎంతమంది ఒప్పుకుంటారు…??
మనిషి జీవితంలో డబ్బుకి అడ్డంరాని కులం – మతం మిగిలిన అన్ని అంశాలలోనూ ఎందుకు అడ్డం పడుతోంది…?? 
హద్దులు లేని సమాజంలో గీతలు గీసినదెవడు – ఇప్పుడా గీతలని గోడలుగా మారుస్తున్నదెవడు ..?? 
నేడు సమాజం – దేశం ఇలా తగలడ్డానికి కారణం అందరికీ అందవలసిన విద్యని కొందరికే పరిమితం చేయటం కాదా…??
ఇప్పటికీ అక్షరాలకి వెలకట్టి అంగట్లో అమ్ముకోవటం కాదా…??
సమాజంలో ఉన్న అసమానతలపై తమ కున్న కోపాన్ని – అసహ్యాన్నీ పరోక్షంగానో – ప్రత్యక్షంగానో చూపించే ప్రయత్నం చేసారు ఇలాంటి దర్శకనిర్మాతలు …
కానీ – జనం మాత్రం షరామామూలుగా – వారిక్కాలసిన పంచు డైలాగులని మాత్రమే సంచిలో వేసుకొస్తారు – 
చెరుకు రసాన్ని థియేటరులోనే వదిలేసి – పిప్పిని జేబులో వేసుకుని వస్తారు …!!
మరో వంద శంకరాభరణాలొచ్చినా సమాజం మారుతుందా …?? లోలోపల గుండెల్లో దాగిన బాధనంతటినీ ఒక్క ఈల రూపంలో థియేటర్లో వేసేసి రావటం తప్ప – మనం మాత్రం చేయగలిగేదేం ఉంది…???

Leave a Reply

Your email address will not be published.