దేనికైనా రె’డీ’ … చంద్రబాబు ! సంకట స్థితి లో జగన్

దీ తెగువంటే.. ఇదీ నిజాయితీపై నమ్మకమంటే. ఇదీ తనపై తనకున్న విశ్వాసమంటే? అవును… విచారణ అన్న పదం ఆయనకు కొత్తకాదు. చేసిన తప్పులేదు. నిలిచిన కేసు లేదు. సరే కొన్ని సార్లు కేసుల నమోదులో జరిగే బలమైన అంశాలు కూడా తోడైనా, చరిత్రకు నిజం తెలుసు. నిజానికి, నిప్పుకు చెదపట్టదు అన్నట్లు చంద్రబాబు విసిరిన సవాలు ఇప్పుడు సంచనలంగా మారింది. కేసులంటే వెనక్కిపోతామా? మీరు తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేస్తామంటే చూస్తూ పోవాలా? అని చంద్రబాబు ప్రశ్నల్లో కూడా నిజాయితీ కనిపించిందని చాలా మంది అంటున్నారు. అమరావతిలో అవకతవకలు జరిగాయన్న దానిపై ప్రభుత్వం సిబిఐ విచారణ అనగానే ప్రతిపక్షం భయపడుతుందని, నయానో, భయానో దారిలోకి తెచ్చుకోవాలని అధికార పక్షం చూసింది. కాని ప్రతిపక్షం ఆ సవాలుకు స్వాగతం అన్నది. పైగా మామీద సరే, మరీ విశాఖ విషయంలో వస్తున్న ఆరోపణలపై కూడా విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా అన్నారు.
విచారణ మూడు నెలల్లో పూర్తి చేసి, దోషులుగా ఎవరు తేలినా, శిక్షించండి అన్నారు చంద్రబాబు. అయినా కక్ష్య సాధింపు అన్నదే ప్రధానమైనప్పుడు, రాజకీయాలు మాత్రమే చేయాలి. కాని భవిష్యత్తు తరాల భవిష్యత్తు ముడిపడి వున్న అంశాలను తెరమీదకు లాక్కొచ్చి, కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. ఏడు నెలలుగా తవ్వుతున్నారు. ఏం బైటకు తీశారని ప్రతిపక్ష నేత ప్రశ్నించినప్పుడే ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోయింది. ఇదిలావుంటే కమిటీల ఏర్పాటు, అవి నివేదికలు ఇవ్వకముందే వాటిలోని అంశాలు లీకు చేయడం, అంటే ఇంత ఆతృత కేవలం చంద్రబాబును కక్ష్య సాధింపుకుతప్ప మరొకటి కాదన్నది సుస్పష్టం. పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి ఏది చెబితే అది చిలక పలికినట్లు పలికితే సరిపోదు. అమరావతిలో పెట్టిన పెట్టుబడి డెడ్‌ ఇన్‌వెస్టుమెంటు అని ప్రభుత్వ పెద్దలు ప్రకటించడం సరైంది కాదు. ఎందుకంటే అక్కడి ప్రజల మనోభావాలే కాదు, వారి జీవితాలపై కూడా దెబ్బకొట్టినట్లే అవుతుంది. వారి ఆశల మీద కూడా నీళ్లు చల్లినట్లే… పైగా మీడియాను కూడా అడ్డం పెట్టుకొని, రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయించడం కూడా సరైందికాదు.
నిజానికి అమరావతి రాజధాని అన్న సందర్భంలో అన్ని ప్రాంతాల ప్రజలు జైకొట్టారే…కాని మా ప్రాంతానికి కావాలని ఎవరూ ప్రత్యేకించి కోరిన సందర్భంలేదు. ఎందుకంటే అమరావతి అన్ని ప్రాంతాలకు సమానమైన దూరంతోపాటు, రెండు అభివృద్ధి చెందిన పట్టణాల మధ్య నెలకొని వుండడం ఇక్కడ ప్రతిష్టాత్మకమైంది. రెండు మహానగరాల మధ్య రాజధాని ఏర్పాటైతే, దేశంలోనే అత్యంత విశాలమైన, విస్తారమైన నూతన రాజధాని నగర ఆవిష్కరణ జరుగుతుందన్నది అందరి నమ్మకం. అదే అమరావతిపై ప్రజలకు అంత మమకారం

ఏర్పడింది. దాన్ని కాదని విశాఖ కొత్త రాజదాని అని ప్రకటించిన తర్వాత ప్రాంతాల మధ్య విభేధాలకు తావిచ్చినట్లైంది. మరోసారి ప్రాంతీయ సమస్యలు తెరమీదకు వచ్చినంత పనైంది. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో రాజధానిగా మారిన కర్నూలులో రాజధాని కావాలని కోరిక మొదలైంది. హైకోర్టుతో వచ్చేదేముందన్న మాటలు వినిపిస్తున్నాయి. పైగా అమరావతినుంచి హైకోర్టు తరలింపును ఇక్కడ స్వాగతిండచంలేదు. కర్నూలు వాసులు సమ్మతించడంలేదు. మరి ఎందుకు ఈ వైరుథ్యమైన నిర్ణయాలు. అసలు అభివృద్ధి వికేంద్రీకరణకు, పాలన వికేంద్రీకరణలపై ఎవరి వాదనలు వారికున్నా, వాస్తవాలకు దగ్గరగా వుండాలే తప్ప ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వారి ఊహలు నిజం చేస్తామంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఒక్క ఆఫీసులోనే ఒక పనికోసం వచ్చిన వ్యక్తిని ఇక్కడ కాదు, అక్కడికెళ్లు అని అధికారులు చెప్పే సమాధానమే విసుగు తెస్తుంది. అలాంటిది ఇక్కడ కాదు, విశాఖకెళ్లు, కర్నూలుకెళ్లు అంటే ఎలా వుంటుందో అర్థంచేసుకోండి. నిజానికి పాలనాపరమైన అన్ని కార్యాలయాలు ఒకే చోట వుండడం వల్ల, ఫైళ్లకోసం అధికారులే, ఆ శాఖలోని ఇతర ఉద్యోగులు నానా యాతన పడాల్సివుంటుంది. ఒకే దగ్గర వుంటేనే ఇంత ఇబ్బందులుంటే, హెచ్‌ఓడిలను కూడా వికేంద్రీకరిస్తే, పాలన గాలిలో కలిసినట్లే. ఇప్పటికే జిల్లాలనుంచి ఫైళ్లు పట్టుకొని, పదేపదే తిరిగే ఉద్యోగులు, బాధితులు, ఇకపై ఒక జిల్లానుంచి మరో జిల్లాకు చక్కర్లు కొట్టాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఇక పనిచేసినట్లే. వారు ఫైళ్లు పట్టుకొని తిరగడానికి తప్ప మరెందుకు పనికిరారు. పైగా వారికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే చెల్లించాలి. వారికి వసతులు ఏర్పాటుకోసం ఏటా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సివస్తుంది. ఇది ఎవరూ గమనించడంలేదు.
జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మిగిలేవి ప్రశ్నలే తప్ప, సమాధానాలు వుండవన్నది స్పష్టమౌతోంది. దీనికి తోడు చంద్రబాబు కూడా అంతే ధీటుగా స్పందిస్తాడని జగన్‌ ఊహించి వుండడు. చంద్రబాబు రాజకీయంగా గగ్గోలుపెడతాడే తప్ప, ముందుకొచ్చి సవాలు చేస్తాడని అనుకోలేదు. దాంతో ఇప్పుడు జగన్‌ పరిస్థితి ముందునుయ్యి, వెనుక గొయ్యిలాగే వుంది.కాని ప్రభుత్వ నిర్ణయాలను, వారి ఆలోచనలు మోయడానికే వున్న మీడియా పాలకపక్షం డొల్లతనం బట్టబయలైతే తప్ప , బట్టలిప్పేందుకు సాహసం చేయదు. అందుకే ఇప్పుడు ప్రతిపక్షాన్ని ఎత్తిపొడిచే వార్తలే ప్రసారం చేస్తాయి. ప్రజలను గందరగోళం చేస్తుంటాయి. అయినా ఏ సైడు లేనప్పుడు, డిసైడ్‌ చేసుకోవడానికి ఏదారి కనిపించనప్పుడు, అనవసరంగా కెలికి, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు వీలులేనప్పుడే ఇలాంటి పిల్లిమొగ్గలు వేయాలి. తప్పదు.

Leave a Reply

Your email address will not be published.