ఖాళీ స్థలాల్లోనే మినీ థియేటర్లు
23 చోట్ల ఏర్పాటు, 33ఏళ్ల పాటు లీజు
మినీ థియేటర్లతో 3.11 కోట్ల రాబడిఃసునీల్శర్మ
బస్టాండ్లలో ఏర్పాటు చేయాలనుకున్న మినీ థియేటర్లను సంస్థకు సంబంధించిన ఖాళీ స్థలాల్లోనే నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు మినీ థియేటర్ల ఏర్పాటుకు 23 చోట్ల ఖాళీ స్థలాలను ఎంపిక చేసింది. వీటి కోసం ఎకరం నుంచి 5 ఎకరాల వరకు స్థలాలను లీజుకివ్వాలని నిర్ణయించింది. లీజుదారులను టెండర్ల పద్ధతిలో ఎంపిక చేయనుంది. ప్రయాణికుల కోసం బస్టాండ్ల పై మినీ థియేటర్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం రెండేళ్ల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆమేరకు రాష్ట్రంలోని 31 బస్టాండ్లను గుర్తించి టెండర్లను ఆహ్వానించింది. బస్టాండ్ల పైథియేటర్ స్క్రీన్ (తెర)కు అవసరమైన మేర వైశాల్యంతో స్థలం లేకపోవడం, ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండదన్న కారణాలతో టెండర్లు వేయడానికి కాంట్రాక్టు సంస్థలు ముందుకు రాలేదు. దీంతో ఖాళీ స్థలాల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించుకుంది. 15చోట్ల మినీ థియేటర్ల ఏర్పాటుకు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. మిగతా వాటికి టెండర్లు పిలిచి లీజుదారులకు అప్పగించాలని నిర్ణయించింది. 33 ఏళ్ల పాటు లీజుకిచ్చి, నెలవారిగా అద్దెను వసూలు చేయాలన్నది ఆర్టీసీ ఆలోచన. లీజుదారులే భవనాలను నిర్మించుకుని థియేటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఏపీఎస్ఆర్టీసీ ఇలాంటి మినీ థియేటర్‌ను విజయవాడలో ఏర్పాటు చేసింది. దాని పరిశీలన కోసం త్వరలో ఈడీ పురుషోత్తం నాయక్ ఆధ్వర్యంలోని ఆర్టీసీ బృందం అక్కడకు వెళ్లనుంది. సంస్థ ఆర్ధిక పరిపుష్టి కోసం 23 చోట్ల మినీ థియేటర్లను నిర్మించాలని నిర్ణయించినట్లు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి, ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బస్టాండ్లకు సమీపంలోని ఖాళీ స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయతలపెట్టామని పేర్కొన్నారు. మినీ థియేటర్ల ద్వారా రూ.311 కోట్ల వార్షిక ఆదాయం వస్తుందని అంచనా వేశామని వివరించారు.