బీజేపీ, జనసేన భేటీ పరిణామాలేమిటంటే…?

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంతో మారుతున్నాయి. బిజెపి అధినాయకత్వం సూచలతో తిరిగి ఆ పార్టీతో కలసి పనిచేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సై అనటంతో రాష్ట్రంలోనూ బిజెపి బలపడేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో . రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బిజెపి- జనసేనలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం విజయవాడలో హోటల్ మురళీ ఫార్చ్యూన్లో జనసేన, భాజపాకు చెందిన కీలక నేతల ఉమ్మడి భేటీ జరిగింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లతో పాటు మరికొందరు కీలక నేతలు, బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురందేశ్వరి, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెలసీ సోము వీర్రాజు లతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోధర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి రాజధాని అంశం ప్రధానంగా చర్చించిన వీరు స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన చేసేందుకు ప్రత్యేక ఉమ్మడి కమిటీ నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం.