టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా గ్రామ వాలంటీర్లు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా వినియోగించుకుంటామంటూ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన ప్రకటన తాజాగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగులను, అనుభవజ్ఞులను పక్కకు పెట్టి మరీ ప్రతి పనికి వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పలు పనులను అప్పచెప్పేందుకు ప్రభుత్వం ఉత్సాహపడటం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
అందునా పది, ఇంటర్ చదువుకున్న వారే వాలంటీర్లుగా ఎంపికైన తరుణంలో విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఈ పరీక్షల వ్యవహారంలో వారికి బాధ్యతలు అప్పజెప్పడమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇటు విద్యా రంగంలోనూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ వివాదస్పద నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. టెన్త్, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేషన్ అంటే ఆషామాషిగా ప్రభుత్వం తీసుకున్నట్టుందన్న విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. కేవలం.. విద్యార్ధులు కాపీ కొడుతున్నారో లేదో చూడటం వరకు మాత్రమే ఇన్విజిలేటర్ల పాత్ర పరిమితం అన్నట్టు మంత్రిగారు మాట్లాడుతున్న తీరు చూస్తే, తెలిసి మాట్లాడుతున్నారా? తెలియ చెపుతున్నారా? అన్న అనుమానం కలిగేలా ఉంది.
ఇప్పటికే పరీక్షా పత్రాల లీకుల వ్యవహారం విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్న సందర్భాలు చాలానే చూసాం. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు కళకళలాడుతున్న ప్రస్తుత తరుణంలో కాలంలో అరగంట ముందే ఇన్విజిలేటర్లకు అందే ప్రశ్నా పత్రాలను బయటకు పంపేయటం క్షణాలలో పని. వాలంటరీ వ్యవస్ధ నియామకాలలో అక్రమాలు జరిగాయని అధికార పార్టీకి చెందిన మంత్రాలయ శాసనసభ్యుడే ఆరోపనలు గుప్పించిన విషయం గమనార్హం. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఉద్యోగాలు కొనుక్కున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. మరి ఇలాంటి తరుణంలో పరీక్షా కేంద్రాలలో అవకతవకలు జరగవన్న గ్యారెంటీ లేదు. ఓ వేళ జరిగినా మహా అయితే ఐదువేల ఉద్యోగం పోయిందనుకుంటారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
వాస్తవానికి పరిక్షలలో ఇన్విజిలేషన్ పనుల్లో ఉండే వారు ఎంతో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రశ్నా పత్రాలు, జంబ్లింగ్ విధానంలలో ఓ క్రమ పద్దతిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే.. గతంలోనూ సిబ్బంది కొరత వచ్చినప్పుడు సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులను ఇన్విజిలేషన్‌కు ఉపయోగించుకునే వారు. అందునా పేపర్లు మారిపోకుండా.. గందరగోళం కాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో విద్యా సంబంధిత రంగంలో ఉన్న వారినే ఇప్పటి వరకూ ఇన్విజిలేటర్లుగా ఉపయోగించుకున్నారు కానీ.. బయట విభాగాలకు చెందిన వారికి పరీక్షలలో బాధ్యతలు ఇచ్చిన దాఖలాలూ మనకి కనిపించవు.
కానీ గ్రామ సచివాలయం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ బాధ్యతలు ఇవ్వాలనుకోవటం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండతో ఎంపికైన ఆ పార్టీ కార్యకర్తలు అక్రమాలకు పాల్పడితే బాధ్యత ఎవరు వహిస్తారన్న ప్రశ్న జవాబు దొరకనిది.
మరోవైపు వినిపిస్తున్న మాట ఏంటంటే…ఇప్పటికే అనేక బాధ్యతలతో నానా చాకిరీ చేస్తున్న వాలంటీర్లు ప్రభుత్వం పెట్టిన క్యాలెండర్ ప్రకారం.. సేవలు అందించడానికి సాధ్యం కాదని, పరీక్షలు జరిగినంత కాలం… వారు గ్రామ, వార్డు సచివాలయ విధులకు దూరం కావాల్సి రావటంతో, దాదాపు నెల రోజుల పాటు కార్యకలాపాలు ఆగిపోయే ప్రమాదం కూడా లేక పోలేదు. దీంతో ప్రజలకు సౌకర్యవంతం అనుకున్న వాలంటరీ వ్యవస్ధ పనిభారం పెరిగి క్రమంగా గుదిబండగా మారే ఆస్కారం ఉంది.
విద్యావ్యవస్థలోకి.. గ్రామ, వార్డు వాలంటీర్లను.. చొప్పించే ప్రయత్నం చేయడం అంటే తెలియని పనులలోకి చేతులు పెట్టడమేనని, ఎలాంటి అవగాహన, శిక్షణ లేకుండా చేసే ఈ పని కారణంగా ఏర్పడే పర్యావసానాలు, వచ్చే ఇబ్బందులన్నీ, విద్యార్థులే భరించాల్సి వస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యారంగంలో కలకలం రేపుతున్న ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా? లేక తను పట్టిన కుందేలుకు మూడే అన్న చందంగా ముందుకు వెళ్లి మరిన్ని వివాదాలు తెచ్చుకుంటుందో? చూడాలి.