క్రొత్త బ్రాండ్ల తో కిక్ ఎవరికీ ?

దేశంలో ఎక్క‌డా వినిపించ‌ని క‌నిపించ‌ని కొత్త కొత్త మ‌ద్యం బ్రాండ్లను ఏపి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మిస్తున్నారని దీని వ‌ల్ల  త‌మ ఆరోగ్యం పాడ‌వుతోంద‌న్న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  చీప్ లిక్క‌ర్‌నే  భారీ రేట్ల‌కు అమ్ముకుంటున్నార‌ని దీంతో కష్టపడి సంపాదించిందంతా దానికే తగలెయ్యాల్సి వస్తుందని మందుబాబులు ఆవేద‌న చెందుతున్నారు.  మ‌ద్య నిషేదం మాటున   మ‌ద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా రేట్లు పెంచుతామ‌ని  ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన‌ జ‌గ‌న్‌, తాగేవాడికి షాక్ కొట్టేట‌ట్టు చేసి, త‌యారు దారుల‌కు, నేత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  

ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల పేరుతో ఎక్సైజ్‌శాఖ‌ను డ‌మ్మీని చేసి సీఎంఓ నుంచి దందా జ‌రుగుతోంద‌న్న‌ది విప‌క్షాల ఆరోప‌ణ‌. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న త‌ర‌హాలో ప్ర‌భుత్వ పెద్ద వ‌ద్ద‌కే క‌మీష‌న్లు ప‌థ‌కం ప్రారంభించారని,  ఒక్కో మ‌ద్యం కేసుకు స‌గ‌టున 150 రూపాయ‌లు క‌మిష‌న్ చెల్లించే వారి బ్రాండుల‌నే మ‌ద్యం దుఖానాల‌లో వుంచుతున్నార‌ని, దీంతో క‌నీవినీ ఎరుగ‌ని పేర్ల‌తో మ‌ద్యం పేద‌ల ఒళ్లుగుల్ల చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  
చంద్ర‌బాబు మ‌ద్యాంధ్ర ప్ర‌దేశ్ గా రాష్ట్రాన్ని మార్చేసాడ‌ని, మేమే స్వ‌ర్ణాంధ్ర ప్ర‌దేశ్‌గా మారుస్తామంటూ అధికారంలోకి వ‌చ్చాక ఆంధ్రాగోల్డ్ పేరుతో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ఆరంభించార‌ని.  మ‌ద్యం   కంపెనీలు నేరుగా సీఎంవోలో ఒక కీల‌క అధికారితో మంత‌నాలు జ‌రుపుతు దేశంలో ప్ర‌ఖ్యాతిగాంచిన బ్రాండ్ల స్ధానంలోకి  క‌మిష‌న్ చెల్లించి  త‌మ‌ బ్రాండ్లు ఉండేలా చూస్తున్నార‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.  కొత్త మ‌ద్యం పాల‌సీ వ‌చ్చాక 264 లక్షలు కేసుల మ‌ద్యం అమ్మ‌కాలు అయ్యాయి. అంటే ఒక్కో కేసుకు 150 రూపాయ‌ల లెక్క‌న‌ 396 కోట్లు అధికారిక పెద్ద‌ల‌కు కమిష‌న్‌గా ముట్టిందని  ప్రతిపక్షం తెలుగుదేశం ఆరోపణ.  మ‌రి దీనిలో నిజమెంతో , అబ‌ద్ద‌మెంతో చెప్ప‌లేం గానీ, మద్యం దుకాణాలలో మాత్రం రోజుకో కొత్త బ్రాండ్ ప్రత్యక్షమవుతుండడం మాత్రం వాస్త‌వం.  వీటితో పాటు  ఒక్కో కేసుకు 150 రూపాయ‌ల లెక్కన 195 లక్షల బీరు కేసులకు  292 కోట్ల రూపాయ‌లు లోట‌స్‌పాండ్‌కి జ‌మ‌య్యాయన్నది మ‌రో ఆరోప‌ణ‌.  
అయితే  ఇంత‌ క‌మిష‌న్లు చెల్లించి మ‌రీ త‌మ బ్రాండ్ల‌ను అమ్ముకుంటున్న త‌యారీదారుల‌కూ ప్ర‌భుత్వం నుంచి చెల్లించాల్సిన 1533 కోట్లు  చెల్లింపుల‌నూ ఆపేసి షాకిచ్చింది ఏపి ప్ర‌భుత్వం అని వినిపిస్తోంది.  ఇందులో క‌నీసం స‌గమైనా చెల్లిస్తే కానీ తాము మ‌ద్యం ఉత్ప‌త్తి చేసే స్థితిలో లేమ‌ని అసోసియేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ ఇటీవ‌ల సిఎం జ‌గ‌న్‌ని క‌ల‌సి విన్న‌వించుకున్నా… మందు, ముందు పంపండి. త‌రువాత చూద్దామ‌ని చెప్పారు మిన‌హా చెల్లింపుల విష‌యం మాత్రం మాట మాత్రంగా ప్ర‌స్తావించ‌లేద‌న్న‌ది స‌భ్యుల మాట‌. తామంతా పెట్టుబ‌డులు పెట్టి, క‌మీష‌న్లు చెల్లించి మ‌ద్యం స‌ర‌ఫ‌రా చేస్తుంటే ఆమ్ముకుంటున్న ప్ర‌భుత్వం అమ్ముడైన సొమ్ముల‌లోంచి త‌మ‌కు రావాల్సిన‌ది చెల్లించ‌డం లేదు స‌రి క‌దా కోట్ల‌లో బ‌కాయిలు ఉంచ‌డంతో త‌మ కంపెనీల నిర్వ‌హ‌ణ ఇబ్బంది అవుతుంద‌ని, ఇదే తీరు కొన‌సాగితే మ‌ద్యం స‌ర‌ఫ‌రా నిల‌చిపోయే ఆస్కారం ఉంద‌ని అంటున్నారు త‌యారీదారులు.  
ఇక  మ‌న భార‌తావినిలో మ‌ద్యం వినియోగాన్ని ఓ సారి ప‌రిశీలిస్తే….  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం  లిక్కర్ వినియోగంలో   10 శాతంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌రి ఇంత ఆదాయం వ‌స్తున్నా కాద‌ని, మ‌ద్యం ఆదాయ వ‌న‌రు కాద‌ని, మ‌ద్య‌నిషేధం మా మార్గ‌మ‌ని చెపుతున్న వారు అడ్డ‌గోలుగా రేట్లు పెంచి మ‌ద్య నిషేదం షురూ చేయ‌టం స‌బ‌బ‌నిపించినా.  ఓవైపు త‌మ‌కు క‌మిష‌న్లు ఇచ్చిన బ్రాండ్ల‌నే అమ్ముతూ సర్కారు మ‌ద్యం దందాకు తెర‌లేపిందన్న విమర్శ ఉంది.  గ‌త కొంత కాలంగా మ‌ద్యం అమ్మ‌కాలు త‌గ్గిన‌ట్టు గ‌ణాంకాలు చూపెడుతున్న ప్ర‌భుత్వ అధికారులు  మ‌ద్యం రేట్ల‌ని మాత్రం రెండింత‌లు పెంచేయ‌టం వ‌ల్ల  ఆదాయం కూడా  పెంచేసుకున్నామ‌ని చెపుతుండ‌టం విడ్డూరంగా ఉంది.  ఇది కాక‌ క‌మిష‌న్ల , మ‌ద్యం కంపెనీల‌కు ఎగ‌వేసిన  మొత్తం ఏతా వాతా  3 వేల కోట్లు పైచిలుకే అందిన‌ట్టు ఆరోప‌ణ‌ల‌కు జ‌వాబు మాత్రం దొర‌క‌టం లేదు.  
నూతన పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం రేట్లను భారీగా పెంచేయడంతో స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌లోని  గ్రామాలకు మద్యం ప్రియులు తరలిపోతున్నారు. దీనికి తోడు  ఏపీలోని వైన్‌షాపుల్లో పర్మిట్ రూములను తీసివేయడం, మ‌ద్యం షాపుల ముందే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో వేధింపులు ఆరంభించ‌డంతో  ప‌క్క‌రాష్ట్రాల‌ మద్యం దుకాణాలకు వెళ్లి అక్కడే తాగి , ఓరోజు గ‌డిపి మ‌రీ వస్తున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం  ఏపీలో చీప్‌ లిక్కర్‌ ధరకే తెలంగాణతో స‌హా స‌రిహ‌ద్దు రాష్ట్రాల‌లో బ్రాండ్‌ మద్యం లభిస్తోంది. వివిధ బ్రాండ్ల ధరలు తెలంగాణతో పోలిస్తే క్వార్టర్‌ బాటిల్‌కు రూ. 30, ఫుల్‌ బాటిల్‌కు రూ. 120 దాకా అధికంగా ధరలు ఉన్నాయి.  
ఏపి మ‌ద్యం ప్రియుల రాక‌తో తెలంగాణలోని సరిహద్దు గ్రామాలే కాకుండా ఏపీతో సరిహద్దు ఉన్న యానాం, తమిళనాడు గ్రామాలలోని మద్యం షాపులు  కళకళలాడుతున్నాయి.  పైగా ఇక్క‌డ నుంచే మ‌ద్యం భారీగా ఏపిలోకి వ‌స్తుండ‌టంతో  అధికారులు అప్రమత్తమయ్యారు సరిహద్దుల్లో  తెలంగాణ నుంచి పెద్దమొత్తంలో మందు కొనుగోలు చేస్తు ఏపిలోకి తీసుకు వ‌స్తుండ‌టంతో ఒక వ్యక్తి 2 ఫుల్‌ బాటిళ్లు, 6 క్వార్టర్లకు మించి మద్యం తీసుకెళ్లకుండా, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం ఏపీలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ వైసిపికి చెందిన నేత‌ల డోర్ డెలివ‌రీ మ‌ద్యం రాత్రి 8 గంట‌ల నుంచి తెల్ల‌వార్ల వ‌ర‌కు షురూ చేస్తున్నా… అటు వైపు క‌న్నెత్తి కూడా చూడంలేద‌న్న‌ది మ‌ద్య నియంత్ర‌ణ అధికారుల‌పై ఆరోపణ‌లున్నాయి.  ప్ర‌భుత్వ దుఖాణాల‌లో కొన్న మ‌ద్యంతో పాటు ఇత‌ర రాష్ట్రాల నుంచి తీసుకువ‌స్తున్న బ్రాండెడ్ మ‌ద్యాన్ని అధిక‌ధ‌ర‌ల‌కు అమ్ముకుంటూ రెండు చేతులా కాసుల సంపాద‌న‌లో మునిగి తేలారు.
రానున్న స్ధానిక ఎన్నిక‌ల‌లో మ‌ద్యం, డ‌బ్బుల పంప‌కాల‌పై ప్ర‌భుత్వం ఎన్ని ఆంక్ష‌లు విధించినా చాప‌కింద‌నీరులా ఈ పంప‌కాలు జ‌ర‌గ‌టం ఖాయ‌మ‌నిపిస్తోంది. రానున్న రోజుల‌లో మ‌ద్యం అమ్మ‌కాలు మ‌రింత పెరిగే ఆస్కారం ఉందనిపిస్తోంది. 

Leave a Reply

Your email address will not be published.