జగన్ ప్రభుత్వానికి ముద్రగడ అండ..! మండిపడుతున్న కాపు రైతులు

అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని. ఇందుకుకి గత ప్రభుత్వ హయాంలో భూములిచ్చిన రైతులలోఅనేక సామాజిక వర్గాలున్నాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మొత్తం భూమి అంతా ఓ సామాజిక వర్గానిదే అన్న తీరుగా వ్యవహరిస్తూ, మొత్తానికి రాజధానికే ఎసరు పెట్టిందన్న ఆరోపణలు బోలెడు వినిపిస్తున్నాయి. వేలాది ఎకరాలు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపనలు గుప్పించిన వైసిపి నేతలు, మంత్రులు, చివరకి ముఖ్యమంత్రి సైతం చివరకి ఓ ఇన్సైడ్ ట్రేడింగ్ లో నాలుగు వేల ఎకరాలున్నట్టు లెక్కలు తేల్చారు. మరి లెక్కలు తెలిసినప్పుడు చర్యలు తీసుకోవలసింది పోయి, మరో విచారణ కమిటీని ఏర్పాటు చేయటం అంటే కాలయాపన, విమర్శలకు మరింత ఛాన్స్ అందుకోవటమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అమరావతి భూములే కాదు , గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని నిర్ణయాలపైనా విచారణలకు ఓ సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దానికి నిర్ధిష్ట కాలపరిమితి మాత్రం నిర్ణయించలేదు సరికదా వివిధ నిర్ణయాలతో సంబంధాలున్న అధికారులతో సహా ఎవరినైనా పిలిపించుకుని విచారణ చేయవచ్చంటూ ఓ ఆదేశం కూడా జారీ చేసేసారు. దీంతో ఇక మాజీ మంత్రులు, గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన అధికారుల మెడకు ఏదోలా ఓ చుట్టు చుట్టే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటివరకు తాము ఆరోపిస్తున్నంశాలపై తమ వద్ద ఉన్న ఆధారాలను ఎన్ని విచారణల కమిటీల ముందు ఉంచారో తెలియదు కానీ, నేటికీవిమర్శల పరంపర కొనసాగిస్తునే ఉన్నారు అధికార పెద్దలు.
ఇక రాజధానికి భూములు ఇచ్చిన వ్యవహారంలో అధికార పార్టీ ఆరోపించిన సామాజిక వర్గాలను ఓ సారి విశ్లేషిస్తే, దాదాపు వారు 5-7 శాతం మాత్రమే. మిగిలిన 90 శాతం పైచిలుకు అంతా బడుగు, బలహీన వర్గాలతో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన కొంతమంది రైతులు ఉన్నారన్నది వాస్తవం. . అయితే కాపులకు నిజమైన ప్రతినిధి గా అంతాభావించే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇక్కడ జరుగుతున్న పోరుకు మద్దతు గా నిలవాల్సిన ఉన్నా… అమరావతి రైతులు తన సామాజికవర్గం అని చెప్పి చంద్రబాబు భుజాన వేసుకుంటున్నారంటూ మరోవివాదానికి తెరలేపారు. గతంలో నిరసన, ధర్నాలు చేస్తున్న కాపు మహిళను చంద్రబాబు లాఠీలతో కొట్టించారుఅని వ్యాఖ్యానించటంపై కాపు రైతులు మండిపడుతున్నారు
అమరావతి రైతు మహిళలపై పోలీసులు లాఠీ ఛార్జి చేసినప్పుడు అన్ని రాజకీయ పార్టీల నేతలు ముక్త కంఠంతో ఖండించగా.. ముద్రగడ ఇలా స్పందించడం చూస్తుంటే మీకు ఇలా కావాల్సిందే బాబును భుజాలనేసుకున్నందుకు అన్న తరహాలో ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. రాజధాని లో కాపు రైతులు సైతం ముద్రగడ వ్యవహారశైలిని తప్పుబడుతున్నారు. జగన్‌కు ఆయన అమ్ముడు పోయారా…? జగన్ అంటే భయపడుతున్నారా అని వారు ప్రశ్నిస్తుండటం గమనార్హం.
గతంలో జరిగిన సంఘటనలను బూచిగా చూపిస్తున్న ముద్రగడ జగన్‌కు భయపడుతున్నారని తాజా వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని కాపు సామాజికవర్గనేతలు విమర్శిస్తున్నారు.
అమరావతి రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలలో అన్ని కులాలకు చెందిన రైతులు ఉన్నారని, కాపు సామాజికవర్గ రైతులు వందలాది ఎకరాలు భూములను ఇచ్చారని, ఈవిషయం తెలిసి కూడా ముద్రగడ కులాలను రెచ్చగొట్టడం ద్వారా జగన్ ప్రభుత్వానికి మళ్లీ సహకరించే ప్రయత్నంలో పడ్డట్టు కనిపిస్తోందని కాపు రైతులుముద్రగడ వైఖరిని తప్పుపట్టారు.
కాపు రిజర్వేషన్ వ్యవహారంలో గత ప్రభుత్వంపై, చంద్రబాబుపై పలు ఆరోపణలు చేసి, గత ఎన్నికలలోజగన్కు పూర్తిగా సహకారాన్ని అందించిన వ్యక్తి, జరుగుతున్న సంఘటనలకు అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా గతాలను పదే పదే తవ్వుతూ.. రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించటంపై రైతులు తప్పుబడుతున్నారు.
గతంలో చంద్రబాబుపై లేఖాస్త్రాలు పదే పదే సందించిన ముద్రగడ తాజాగా జరుగుతున్న పరిణామాలపై మౌనం వహించటంలో మర్మం ఏమిటన్న నిలదీతలు ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. ఎంత కాలం కులాన్ని అడ్డుపెట్టుకుని ఒక వర్గంపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తారు..? అని ప్రశ్నిస్తున్నారు. కాపు రిజర్వేషన్లు ఇవ్వలేమని గతంలోనే తేల్చి చెప్పిన జగన్, ఎన్నికల సందర్భంగా యూటర్న్ తీసుకున్న విషయాన్ని ముద్రగడకు గుర్తులేక కాదని, ఏదో వ్యవహారం జరుగుతున్నందునే రాజధాని రైతులకు మద్దతు ఇవ్వలేక పోతున్నారన్న ఆందోళన అమరావతిలో వినిపిస్తున్న మాట వాస్తవం.
ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానండి.. భూములు ఇచ్చిన కాపు రైతులకు మద్దతు ఇవ్వండి. లేకుంటే ఇంటికే పరిమితం కండి. అంతే కాని అమరావతిలో కుల చిచ్చు రగల్చవద్దని కాపు రైతులు ముద్రగడను వేడుకొంటూ మాట్లాడుతున్నారంటే వారిలో నాయకుడి మీద అభిమానం ఉన్నా, తమ పోరాటంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, రాజధాని తరలింపుపై కాకుండా ఇతరత్రా మాట్లాడటమే వారి ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం వేసిన సిట్, రాజధానిలో భూములిచ్చిన కాపు రైతులు ఎంతమంది? ప్రస్తుత వారి ఆర్ధిక పరిస్థితి ఏంటి? కాపు రిజర్వేషన్ వ్యవహారంపై కూడా విచారణ జరుపుతుందా? జరిపితే పరిస్థితి ఏంటి? అన్నది జవాబులేని ప్రశ్నలే. మరి ఏం జరగనుందో వేచి చూడాలి.