మేజిస్ట్రేట్ ఆ కామాంధుడా..?
ప్రకాశం: అతడో మండల మేజిస్ట్రేట్. న్యాయంగా నడుచుకోవాల్సిన వాడు నీచంగా ప్రవర్తించాడు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’లాంటి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాల్సిన వాడే కామాంధుడిగా మారాడు. పవర్ ఉంది కదా? అని కీచకపర్వానికి దిగాడు. అతగాడి కామ బుద్ధిని పసిగట్టిన ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లో వెళ్తే..
కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన ఓ మహిళ వీఆర్ఏగా పనిచేస్తోంది. గత నెల 25న క్రిస్మస్ సందర్భంగా కురిచేడు తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకు పిలిచింది. సిబ్బంది అంతా హాజరు కాగా తహసీల్దార్ వరకుమార్ మాత్రం హాజరు కాలేదు. ఈ క్రమంలో గత శనివారం తహసీల్దార్ తన కార్యాలయంలో.. ‘క్రిస్మస్ విందుకు తాను హాజరు కాలేదని, నాకు కోడి కూరతో పాటు నీవు కావాలంటూ తనతో అసభ్యకరంగా మాట్లాడారని’ బాధితురాలు ఆరోపిస్తోంది. తండ్రి లాంటి వారు ఇలా మాట్లాడటం సరికాదని వారించినా.. తనను వెనక నుంచి వచ్చి కౌగలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే వీఆర్ఏ ఆరోపణలను తహసీల్దార్ వరకుమార్ కొట్టిపారేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కోరారు. మరోవైపు ఈ ఘటనపై దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.