కట్నం కోసం కోడలికి నిప్పు పెట్టిన అత్త

వరకట్న వేధింపులకు ఓ చిన్నారి పెళ్లికూతురు బలైంది. పెళ్లైన రెండు నెలలకే అత్తింటి వారు కట్నం తేవాలని డిమాండ్ చేసి, చివరకు కోపంతో పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దారుణం త్రిపుర రాష్ట్రంలోని శాంతిర్‌బజార్ సబ్ డివిజన్ లోని RK గంజ్ లో జరిగింది.
శాంతిర్‌బజార్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖోవాయి జిల్లా కళ్యాణ్‌పూర్‌ కు చెందిన సుప్రియా చౌదరి(17) ఒక పెళ్లిలో పరిచయమైన అజయ్ రుద్రపాల్ (23) ప్రేమలో పడింది. ప్రేమ మైకంలో ఇంటి నుంచి పారిపోయి అక్టోబర్ 26 న అతన్ని వివాహం చేసుకుంది. తమ కూతురి ఇష్టమే తమ ఇష్టమనుకొని సుప్రియా తల్లిదండ్రులు.. అజయ్ తల్లిదండ్రులతో మాట్లాడారు. డిసెంబర్ 11 న వారి మ్యారేజ్ రిసెప్షన్ కూడా గ్రాండ్ గా ఏర్పాటు చేద్దామని అనుకున్నారు.
ఈ క్రమంలో అజయ్ తల్లి అనిమా రుద్రపాల్ తన కొడుకుకు కట్నంగా రూ.5 లక్షలు ఇవ్వాలని సుప్రియా కుటుంబాన్ని అడగ్గా.. వారు రూ .15 వేలు కంటే ఎక్కువ ఇవ్వలేమని చెప్పారు. అప్పటి నుండి అత్తతో పాటు.. ప్రేమించిన వ్యక్తి కూడా కట్నం కావాలని సుప్రియా ను వేధించడం మొదలుపెట్టారు. తాము అడిగినంత కట్నం ఇవ్వనందుకు ఈ నెల 6 న కోపంతో అత్త, భర్త సుప్రియా పై కిరోసిన్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన సుప్రియా అగర్తల లోని జీబీపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచింది.
కాళ్ల పారాణి కూడా ఆరక ముందే తమ కూతర్ని అజయ్, అతని తల్లి అనిమా దారుణంగా చంపేశారని, కట్నం ఇవ్వనందుకే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లిదండ్రులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతిర్‌బజార్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ నారాయణ సాహా ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.