‘యువర్ సీట్’ యాప్ ఇంటర్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం

 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేప‌ట్టిన త‌రువాత విద్యా వ్య‌వ‌స్థ‌లో అనేక మార్పులు తీసుకువ‌చ్చార‌ని, ప‌రీక్ష‌లు రాసే విద్యార్దుల‌పై   ఎలాంటి ఒత్తిడి లేకుండా చూడాల‌న్న ఆదేశాల‌తో  క్షేత్రస్థాయిలో మార్పులు చేసినట్లు   బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ రామకృష్ణ  పేర్కొన్నారు.  బుధ‌వారం ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాలో మాట్లాడుతూ హాల్ టికెట్ పేరుతో  చివరి నిమిషం వ‌ర‌కు కళాశాల యాజమాన్యాలు వేధించ‌డాన్ని దృష్టిలో ఉంచుకుని, ప‌రీక్ష‌లు రాసే విద్యార్దుల‌లో ఎలాంటి ఆందోళ‌నా లేకుండా వారే నేరుగా  ఆన్లైన్‌లో డౌన్లోడ్ చేసుకునే విధానాన్నిఇంటర్‌ బోర్డు తీసుకొచ్చిందన్నారు. 

ఇంటర్ పరీక్షలకు 10.65 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని  వీరిలో ఇప్ప‌టికే చాలా మంది హాల్ టిక్కెట్లు పొందార‌ని వివ‌రించారు. రేప‌టి నుంచి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు  జ‌రుగుతాయ‌ని, విద్యార్దులు ముందుగా త‌మ ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకోవ‌టం మంచింద‌ని సూచించారు.  ప‌రీక్షా కేంద్రాల‌లోనికి  అరగంట ముందు విద్యార్దుల‌ను అనుమతించనున్నట్లు, అంత‌ర్జాలం నుంచి తీసుకున్న హాల్ టికెట్‌పై కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా పరీక్ష కేంద్రంలోకి  అనుమతించాల‌ని అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసిన‌ట్టు చెప్పారు.  ఇప్ప‌టికీ హాల్ టిక్కెట్ తీసుకోని వారు క్యూఆర్‌ కోడ్‌తో హాల్ టికెట్స్ నేరుగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉందని, అలాగే ‘యువర్ సీట్’ పేరుతో ప్రత్యేక యాప్ రూపొందించామ‌ని దీని ద్వారా  పరీక్ష కేంద్రాలు, ఇంటర్ బోర్డ్ తొలిసారిగా పరీక్షలు రాసే గది వివరాలు  తెలుసుకోవ‌చ్చని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1411  కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నామ‌ని,  పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షించనున్నామ‌ని తెలిపారు. పరీక్షలకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామ‌ని వీటి ద్వారా త‌గిన స‌మాచారం అందుకోవ‌చ్చ‌ని తెలిపారాయ‌న‌.  

Leave a Reply

Your email address will not be published.