అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ముఖం చాటేస్తున్న వైసిపి నేత‌లు…

త‌న పాదయాత్రలో పదే పదే జగన్మోహనరెడ్డి  ఇచ్చిన హామీలు అన్నీ నెర‌వేర్చేసాం మంటూ మంత్రులు వైసిపి నేత‌లు తెగ ఊద‌ర‌గొడుతుంటారు. కానీ అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీ అమ‌లు  ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.  ఏడు రోజులే కాదు.. ఏడు నెలలు గడిచినా సిపిఎస్‌ రద్దు  విష‌యంపై ప్ర‌భుత్వ పెద్దులు ఎందుకు ఊసే ఎత్తడం లేదన్న నిల‌దీత‌లు ఆరంభ‌మ‌య్యాయి.  వారం రోజులన్న వారు  మళ్లీ కొత్త కమిటీలని ఎందుకు వేసారో? ఈ  కాల యాపన ఎందుకు చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేందుకు కూడా వైసిపి నేత‌లు ముఖం చాటేస్తున్నారు. 
అస‌లు సిపిఎస్‌ విధానాన్ని అసలు రద్దు చేసే ఉద్దేశం ప్ర‌భుత్వానికి ఉందా…  ఏడు నెలలు గడిచినా హ‌మీని ఎందుకు అమ‌లు చేయ‌రంటూ ఈ మ‌ధ్య మంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌రెడ్డి ని పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల నాయకులు క‌ల‌సి విన్న‌వించారు. అంతే బుగ్గ‌న ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై ఫైర్ అయ్యారు. మీరు మా మెడ మీద కత్తి పెడితే ఎలా? అని ఎదురు ప్ర‌శ్నించారు.  మా ఎన్నికల మ్యానిఫెస్టోలో సిపిఎస్‌ను రద్దు చేస్తామమని చెప్పాం… కానీ ఈ సమయానికి రద్దు చేస్తామని చెప్పలేదని తేల్చి చెప్పారు.. 
 మ‌రి జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇచ్చిన మాట సంగ‌తేంట‌ని ప్ర‌శ్నిస్తే…  మా ముఖ్యమంత్రి మడం తిప్పరు… మాట తప్పరు.. అని చెపుతూనే  సిపిఎస్‌ కమిటీ మార్చి మాసాంతానికి నివేదిక వస్తుంది. ఆ తరువాత మంత్రి వర్గంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బుగ్గన చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. సిపిఎస్‌ రద్దు విషయంలో ఆర్ధిక మంత్రి వేస్తున్న‌ కప్పదాటు వైఖరి త‌మ‌ని న‌ష్ట‌ప‌రుస్తోంద‌ని ఉద్యోగులు చెపుతుంటే…  విప‌క్షంతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఉద్యోగ సంఘాలు య‌త్నిస్తున్నాయ‌ని ఆర్దిక మంత్రి అంత ఎత్తున ఆవేశంతో ఎగిరిపడుతుండ‌టం ఎందుకో అర్ధం కావ‌టం లేద‌ని,  కమిటీల‌ నివేదిక ఇప్ప‌టివ‌ర‌కు ఎందుకు ఇవ్వ‌లేదో? ఎప్ప‌టికి ఇస్తుందో… లేక మరి కొంత సమయం పెంచే ఆస్కారం ఉందా? అన్న ప్ర‌శ్నలు ఉద్యోగ సంఘాల‌లో వినిపిస్తున్న డౌటానుమానాలు ప్ర‌స్తుతానికి నివృత్తి చేసే వాళ్లు కూడా లేరు. మ‌రి మంత్రిగారు చెప్పిన మార్చి నెలాఖ‌రు వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published.