సైకో పోలీస్‌ని ఎదుర్కొన్న సీబీఐ కథ?!

ఈ శాడిజం అక్కడ లేదు! – నిర్మాత గోపినాథ్ ఆచంట
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇమైక్క నోడిగల్ తమిళంలో బ్లాక్బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో అంజలి సిబిఐ పేరుతో విడుదల చేశారు. ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ మూవీలో నయనతార సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించగా అథర్వ, రాశీఖన్నా కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా సక్సెస్ నేపథ్య ంలో తెలుగు వెర్షన్ నిర్మాత గోపినాథ్ ఆచంట చెప్పిన సంగతులివి…

14 వయసులోనే సినిమా ఆసక్తి:
14, 15 వయసులోనే నాటకం అంటే ఇష్టం.. నటన ఇష్టం.. సినిమా ఇష్టం. ఆ ఇష్టంతోనే సినిమా రంగం వైపు వచ్చాను. అయితే అప్పట్లో సినిమా ప్రపంచం ఎలా ఉంటుందో దగ్గరగా చూశాక.. ఇక్కడ బాగా డబ్బున్న వాడిగా వెళ్లాలి .. మామూలుగా వెళితే కష్టం అని అర్థమైంది.

రాజేంద్రునితో పయనం
ఆ క్రమంలోనే ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ చిత్రంతో నిర్మాతను అయ్యాను. ఆ చిత్రాన్ని భాగస్వాములతో కలిసి చేశాను.  రాజేంద్ర ప్రసాద్ – దివ్య వాణి జంటా రేలంగి నరసింహారావు దర్శకత్వ ంలో చేశాం. రాజేంద్ర ప్రసాద్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. పరిశ్రమలో సక్సెస్ వస్తే ఆ తర్వాత పని చాలా సులువు అయిపోతుంది. అలా మా జర్నీ మొదలై దిగ్విజయంగా సాగింది.

దాసరి .. ఈవీవీతో..
రెండో సినిమా దాసరి నారాయణరావుతో .. మూడో సినిమా ఈవీవీతో జంబలకిడి పంబ చేశాం. అప్పట్లో భగవాన్ – దానయ్య ఆడియో క్యాసెట్లు అమ్ముకునే వారు. వాళ్లు ఇంటికెళుతూ మా ఆఫీస్ లో కలిసేవారు. సినిమా నిర్మాణంలో భాగస్వామ్య ం అడిగారు. ఆ తర్వాత భాగస్వామ్యంలో ఈవీవీ తో సినిమా చేశాం. వారితో కలిసి ట్రావెల్ అయ్యాను.

బాలయ్య.. జగపతిబాబుతో..
బాలకృష్ణ – సౌందర్య జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వ ంలో టాప్ హీరో చిత్రం చేశాం. రవిరాజ పినిశెట్టి తో దేవుళ్లు, జగపతిబాబు గారితో నాలో ఉన్న ప్రేమ చిత్రం తీశాను. ఈ చిత్రానికి భాగస్వాములు ఉన్నారు. అంజలి సిబిఐ చిత్రం కంటే ముందు నాలో ఉన్న ప్రేమ చిత్రం తీశాం.

రానాతో చేస్తున్నాం:
ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలనుకున్నాం. ఈలోగానే రానాతోనూ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాం. రానా తో మంచి స్క్రిప్టుతో తెలుగులో చేస్తున్నాం. ఇది పూర్తిగా కొత్త పంథా లో ఉంటుంది.
హాథీ మేరా సాథీ మార్చి చివరి నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత రానాతో సినిమా చేస్తాం.

అంజలి సీబీఐ ఇదీ కథ
నయనతార అంజలి సీబీఐ తమిళ వెర్షన్ పెద్ద హిట్టయ్యింది. అదే తీరుగా తెలుగులోనూ మెప్పు పొందింది. ఈ సినిమా వసూళ్లు బావున్నాయి. ఏపీ, నైజాంలో  చక్కని వసూళ్లు తెస్తోంది. సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవరెన్ని కామెంట్లు చేసినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అలా ఒకటి రెండు రోజుల్లో చక్కని వసూళ్లు సాధించింది. డబ్బింగ్ కి ఖర్చు చేసిన 2కోట్లు ప్లస్ మొత్తాన్ని తిరిగి రాబట్టడం కష్టమేమీ కాదు. శాటిలైట్ పరంగానూ మంచి డిమాండ్ నెలకొంది. ఇక బావున్న సినిమా నెమ్మదిగా టేకాఫ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. బిచ్చగాడు అందుకు ఓ ఎగ్జాంపుల్. సినిమాకి ప్రేక్షకుడే జడ్జి. రాజకీయాలకు ఓటరు ఎలానో సినిమాకి ప్రేక్షకుడే జడ్జి. ఒక పోలీసాఫీసర్.. ఒక సీబీఐ ఆఫీసర్ మధ్య ఈగో సమస్యపై సినిమా ఇది. తనకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు పోవడంతో సదరు పోలీసాఫీసర్ సైకోగా మారతాడు. ఇందులో రుద్ర పాత్ర హైలైట్. అద్భుతమైన స్క్రీన్ ప్లే కుదిరింది. సెకండాఫ్ లో ట్విస్టులు, మలుపులు ఉత్క ంఠ కలిగిస్తాయి.

టాలీవుడ్ లో శాడిజం:
మద్రాసులో ఉన్నప్పుడు శాడిజం లేదు! సినిమా సక్సెసైతే ఆనందించేవారు. శుభకాంక్షలు చెప్పేవారు. బావుండాలని కోరుకునేవారు. కానీ ఇక్కడ శాడిజం ఉంది. సక్సెసైనా ఎందుకు అవ్వాలి? ఆడు అయిపోయాడా.. ఈడు అయిపోయాడా? అంటూ మట్లాడుకుంటున్నారు.  ఈ ఆలోచనా విధానం మారాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.