ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు ముఖ్య అతిధిగా పవన్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. గురువారం విజ్ఞాన భవన్లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం అందిన క్రమంలో ఆయన దేశరాజధానికి వెళ్తున్నారు. దేశానికి స్వచ్ఛ రాజకీయలు కావాలంటే యువ నాయకత్వాన్ని అందించడమే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో పవన్ ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన షార్ట్ ఫిలింను ప్రదర్శించనుండటం విశేషం.
కాగా మేఘాలయ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత సాగే ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా కూడా ప్రసంగిస్తారు. ఇందులో వక్తలు విద్యార్థులు దేశ రాజకీయాలపై అడిగే అనేక సందేహాలకు సమాధానాలు ఇవ్వనున్నారు.
అలాగే గురువారం ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి చేరుకుని సందర్శిస్తారు. ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ అమర సైనిక వీరుల కుటుంబాలకుప్రకటించిన కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో సైనికాధికారులకు అందచేస్తారు.
కాగా ఇటీవల కొద్ది రోజులుగా వైసిపి ఎన్డిఏ కూటమిలో చేరుతోందని వస్తున్న కథనాలని పవన్ కళ్యాణ్ కొట్టి పారేస్తున్నా, ప్రస్తుత పర్యటనలో ఢిల్లీ పెద్దలను ఎంతవరకు కలుస్తారన్నది అనుమానమే…