ఇద్దరు తలార్లు కావలెను!!!

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఇద్దరు తలార్లను సమకూర్చాలని తీహార్ జైలు అధికారులు ఉత్తరప్రదేశ్ జైళ్ల అధికారులకు వర్తమానం పంపించారు. నిర్భయ దోషులు తీహార్ జైలులో ఉన్నారు. వీరిని వచ్చే వారం ఎప్పుడైనా ఉరితీయవచ్చునని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బీహార్‌లోని బక్సర్ జైలు అధికారులకు సరైన ఉరితాళ్ల కోసం వర్తమానం పంపించారు. ఇప్పుడు ఇద్దరు తలార్లను తమ వద్దకు పంపించాలని తీహార్ జైలు నుంచి ఇటీవలే తమకు ఒక నోట్ అందినట్లు యుపి జైళ్ల శాఖ ఉన్నతాధికారి ఆనంద్ కుమార్  తెలిపారు. అవసరమైనప్పుడు తమ వద్దకు తలార్లను పంపించాలని ఈ నోట్‌లో తెలిపారని వివరించారు.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉరిశిక్షల అమలుకు తలార్లు లేరు. తలార్లను తీహార్ జైలుకుపంపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యుపి జైళ్ల అధికారి ఆనంద్‌కుమార్ తెలిపారు. మరణశిక్ష తీర్పు వెలువడి జైలులో ఉన్న వారికి సంబంధించి శిక్షల అమలు నిలిపివేతకు సంబంధించి రాజ్యాంగ, చట్టపరమైన మార్గాలన్ని మూసుకుపోయినప్పుడు ఉరిశిక్ష అమలు జరగాల్సిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికైతే తీహార్ జైలులో తలార్లు అందుబాటులో లేరని ఈ అధికారి తెలిపారు. అత్యవసరమైనప్పుడు తలార్లు కావాలని తమకు ఫాక్స్ ద్వారా ఈ నెల 9వ తేదీన సమాచారం అందిందని వివరించారు. తీహార్ జైలులోని కొందరు ఖైదీలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. అయితే ఎవరెవరికి శిక్షలు అమలు కానున్నాయనేది ఇందులో తెలియచేయలేదని అధికారులు తెలిపారు.
నిర్భయ కేసులో దోషులుగా ప్రకటితులైన నలుగురు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్, వినయ్ శర్మలపై రెండేళ్లుగా ఉరిశిక్ష అమలు వాయిదాపడుతూ వస్తోంది. ఉత్తరప్రదేశ్ జైళ్ల అధికార యంత్రాంగం వద్ద ఉన్న జాబితాలో ఇద్దరు తలార్ల పేర్లు ఉన్నాయి. వీరిలో ఒకరు లక్నోకు చెందిన వారు. మరొకరు మీరట్‌వాసి. ఈ ఇద్దరే చట్టపరంగా ఇక వచ్చే కొద్దిరోజులలో ఎప్పుడైనా నిర్భయ ఉదంతంలో దోషులకు ఉరిబిగించే బాధ్యతలను తీసుకుంటారని వెల్లడైంది.
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో 23 ఏండ్ల పారామెడికల్ విద్యార్థినిపై సామూహిక పైశాచిక అత్యాచారం జరిగింది. ఆ తరువాత ఈ యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసిన ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై విచారణ జరిగింది. వీరిని దోషులుగా ఖరారు చేశారు. వీరిలో ఒకడు మైనర్ కావడంతో బాలల పునరావాస కేంద్రానికి పంపించారు. మరొక దోషి రామ్‌సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మిగిలిన నలుగురు దోషుల ఉరికొయ్యలతో విషాదాంతానికి దగ్గరవుతున్నారు. దోషులలో ఒకరైన వినయ్ శర్మ తరఫున రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ అందిందని గత వారం ప్రచారం జరిగింది. అయితే దీనికి తన సమ్మతి లేదని, దీనిని తిరస్కరించాలని శర్మ తెలియచేసుకున్నట్లు వెల్లడైంది.
నిర్భయ ఉదంతం జరిగిన డిసెంబర్ 16వ తేదీనే జైలులో ఉన్న దోషులకు ఉరిశిక్ష అమలు అవుతుందని ప్రచారం జరుగుతోంది. జైలు అధికారులు ఓ వైపు తలార్ల కోసం లేఖలు పంపిస్తున్న దశలోనే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ దోషులను ఉరితీసేందుకు తలార్లమవుతామనే సంసిద్ధతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 15 లేఖలు ఇప్పటికే తీహార్ జైలు అధికారులకు వివిధ ప్రాంతాల నుంచి లేఖలు అందాయి. ఇద్దరు విదేశీయులు కూడా ఈ దోషులను ఉరితీసే అవకాశం తమకు కల్పించాలని లేఖలు రాశారు. తగు విధంగా శిక్షణ పొందామని, కరడుగట్టిన ఆ నేరస్తులకు ఉరిబిగించే అవకాశం తమకు కల్పించాలని పలువురు లేఖలు రాస్తున్నట్లు వెల్లడైంది.


Leave a Reply

Your email address will not be published.