ఆంధ్రప్రదేశ్ పోలీస్ లకు హైకోర్టు అక్షింతలు


ఎవరినీ అక్రమంగా నిర్బంధించ వద్దని, సూర్యాస్తమయం తర్వాత స్టేషన్‌లో ఎవరినీ ఉంచొద్దని పోలీసుల‌కు ఏపి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజధాని, విజయవాడ పరిధిలో 144 సెక్షన్‌, నిరసన ప్రదర్శనలకు అనుమతి నిరాక‌ర‌ణ‌పై దాఖ‌లైన 7 పిటిషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామస్తులు శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తుంటే 144 సెక్షన్‌ ఎందుకు ప్రయోగించారో చెప్పాల‌ని పోలీసుల‌ను హైకోర్టు నిల‌దీసింది. 

రాజధాని గ్రామాల్లో పోలీసులు మార్చ్‌ఫాస్ట్ ల‌ని ఎందుకు నిర్వ‌హిస్తున్నారో చెప్పాల‌ని అక్క‌డ కర్ఫ్యూ ఏమైనా విధించారా; అని ధర్మాసనం నిల దీసింది. రైతులు త‌మ నిర‌స‌న‌ల‌ను శాంతియుత ప్రదర్శన ద్వారా తెలియ జేయాల‌నుకున్న‌ప్పుడు అనుమతి ఎందుకు నిరాక‌రిస్తున్నార‌ని, వారికి అనుమతి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. గ్రామ‌స్తులు బైట‌కు రాకుండా ముళ్ల‌కంచెల‌ను ఏర్పాటు చేసి నిర్భందించిన‌దే కాకుండా వారి ఇళ్లలోకి వెళ్లి సోదాలు ఎందుకు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. 46 సీఆర్పీసీ కింద ఉన్న నిబంధనలు ఖ‌చ్చితంగా పాటించాలని, గుంటూరు రూరల్‌, అర్బన్‌ ఎస్పీ, విజయవాడ సీపీకి హైకోర్టు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. 

రైతాంగం చేస్తున్న ఉద్య‌మాల‌పై పోలీసులు చేసిన దాడుల‌పై పత్రికల్లో వార్తలు, ప్రసారమాధ్యమాల్లో వ‌స్తున్న క్లిప్పింగులను పరిశీలించిన ధర్మాసనం ఆందోళ‌న చేస్తున్న రైతుల‌పై పోలీసులు ఎందుకు దాడులు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఉన్నత న్యాయ స్థాన నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే విచారణ నిర్వహించాలని, న్యాయ, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల‌పై త‌క్ష‌ణ‌ చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వమే చికిత్స చేయించాల్సిందేన‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చింది. అరెస్ట‌యిన రైతుల‌లో చాలా మంది క‌నిపించ‌డంలేద‌ని, త‌మ‌ని అరెస్టు చేసి ఎక్క‌డెక్క‌డో తిప్పారంటూ కొంద‌రు మ‌హిళ‌లు మీడియాకి ఇచ్చిన వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్ట్‌ చేసిన వారి వివరాలను జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ల ముందు ఉంచాలని హైకోర్టు పోలీసుల‌కు ఆదేశాలిచ్చింది. 


Leave a Reply

Your email address will not be published.