స‌మ‌ర్ధ‌వంతంగా ఏడాది పూర్తితెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కల్వకుంట్ల తారకరామారావు బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఏడాదిలో ఎన్నో ఒడిదుడుకులను కేటీఆర్ ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలో వచ్చిన వారం రోజులకే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తనయునికి పార్టీ బాధ్యతలను అప్పగించారు. కేసీఆర్ తన ప్రభుత్వంలో కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు కు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. అప్పట్లో దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు పలు చర్చలు, రకరకాల ఊహగానాలు చేశారు. త్వరలోనే కేటీఆర్ ను సీఎం పదవి వరిస్తుందని పలు కథనాలు వచ్చాయి. అన్నింటిని పటా పంచలు చేస్తూ కేసీఆర్ తనయునికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.  పార్టీకి వారసుడు కేటీఆర్ అనే సందేశాన్ని ప్రజల్లోకి కేసీఆర్ పంపించారు. అధికారంలోకి వచ్చిన ఊపులో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తొలిసారి ఎన్నికలకు సారథ్యం వహించారు. రాష్ట్రంలో 3వ వంతు గ్రామ పంచాయతీలను కైవసం చేసుకొని శభాష్ అనిపించుకున్నారు.
 ప్రతిజిల్లా కేంద్రంలో పార్టీకి సొంత భవనాలను ఏర్పాటు చేసుకునేందుకు దృష్టి కేంద్రీకరించారు. దీంట్లో భాగంగానే జిల్లా కేంద్రాల్లో పార్టీ భవనాల నిర్మాణాలను స్థలాలను ఎంపిక చేయాలని అయా జిల్లా పార్టీ నాయకత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే 88 మంది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి 100 మంది ఎమ్మెల్యేలకు సంఖ్య పెరిగింది. (ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు). భారీ మెజార్టీతో ఉన్న ప్రభుత్వాన్ని పార్లమెంటు ఎన్నికలు నల్లేరుపై నడకలాగా తలపించింది. దీంతో కేటీఆర్ నేతృత్వంలో పార్లమెంటు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్దమైంది. సారూ..కారు..పదహారు.. సర్కార్ అనే నినాదంతో పార్లమెంటు ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో ఆపార్టీ ఊహాలకు గండిపడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. సోదరి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. దాంతో పాటు సారూ.. కారు.. పదహారు… సర్కార్  నినాదం చతికిల పడింది. టీఆర్ఎస్ పార్టీ 8 పార్లమెంటు సీట్లను మాత్రమే గెలుచుకోగల్గింది. భారీ మెజార్టీతో అసెంబ్లీలో గెలుపొందిన పార్టీకి భారీషాక్ తగిలింది. కేటీఆర్ నాయకత్వంపై పలు కథనాలు ప్రచురితమయ్యారు.  పైగా ఒక్క సీటుతో పరిమితమైన బీజేపీ ఏకంగా 4 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంపై టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మింగుడు పడలేదు. పైగా ఉద్యమం నుంచి బలంగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలను కోల్పోవడం మింగుడుపడలేదు. దీంతో పార్టీలోని కేడర్ నిరాశకు లోనయ్యింది.  
స్థానిక సంస్థల ఎన్నికల్లో జయకేతనం
పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. 32 జిల్లా పరిషత్ లు, 90శాతం ఎంపీపీలను కైవసం చేసుకున్నది. కాంగ్రెస్, బీజేపీలు చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లతోనే సరిపెట్టుకున్నాయి.  దీంతో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ పార్టీ కసి తీర్చుకున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టింది. ఈ ఎన్నికల్లో కేటీఆర్ తన నాయకత్వం బేష్ అని నిరూపించుకున్నారు.
కాంగ్రెస్ కంచుకోటలో టీఆర్ఎస్ పాగ
కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ అసెంబ్లీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది.  నల్గొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానం నుంచి ఆరుసార్లు గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోయారు. ఎన్నికల ముందే కాంగ్రెస్ లోని ప్రధాన కేడర్ టీఆర్ఎస్ లోకి తీసుకురావడంతో కేటీఆర్ కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. దీంతో హుజూర్ నగర్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచేందుకు దోహదపడింది. ఈ ఎన్నికల్లో కేటీఆర్ తొలుత రోడ్‌షో నిర్వహించారు. ప్రతి రోజు నాయకులు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్సుల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, కార్యకర్తలకు సూచనలు చేస్తూ ముందుకు నడిపించడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిచారు.


పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డు
టీఆర్ఎస్ పార్టీ ఈ ఏడాదిలో చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వం నమోదు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాకుండా సభ్యత్వం చేసిన ప్రతి కార్యకర్తకు రూ. 2లక్షలు బీమాను వర్తింపజేసేందుకు చర్యలు తీసుకున్నది. దేశంలోనే తక్కువ సమయంలో ఎక్కువ సభ్యత్వాన్ని నమోదుచేసిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను కేటీఆర్ నిలిపారు. పోలింగ్‌బూత్, గ్రామ, వార్డు, డివిజన్, మండలస్థాయి కమిటీలను పూర్తిచేయించి పార్టీకి పటిష్ట నిర్మాణం చేసేందుకు పూనుకున్నారు. త్వరలోనే సంస్థాగత ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు దృష్టి కేంద్రీకరించారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తమ కేడర్ కు దిశా నిర్ధేశం చేశారు.దీని కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
కేంద్రంపై ఒత్తిడికి ఎంపీలకు దిశా నిర్ధేశం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అంశాలపై ఎంపీలను దిశా నిర్ధేశం చేశారు. పార్లమెంటులో వివిధ బిల్లులు, రిజర్వేషన్లపై పాటించాల్సిన ఎత్తుగడలను ఎంపీలను సన్నద్ధం చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలు, వాటిపై రాష్ట్ర ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను వివరిస్తూ సమాచారాన్ని ఎంపీలకు కేటీఆర్ అందించారు.
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం
మున్సిపల్ ఎన్నికల పార్టీ కేడర్ ను సన్నద్ధం చేసే పనిలో కేటీఆర్ నిమగ్నమయ్యారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించేలా పార్టీ కేడర్ ను దిశా నిర్ధేశం చేస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా పార్టీ ఇంఛార్జీలను నియమించారు. ఫిబ్రవరిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు సన్నద్ధం చేస్తున్నారు.  పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి తరుచు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలు, విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టేలా నాయకులకు సూచనలు ఇస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.