టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు…రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. విజయవాడలోని మురళి ఫార్చ్యూన్‌ హోటల్‌లో బీజేపీ నేతలతో కీలక భేటీ ముగిసిన అనంతరం పవన్‌ మాట్లాడారు. పొత్తు అంశంపై బీజేపీ పెద్దలతో గత కొన్నాళ్లుగా చర్చలు జరుపుతూ వచ్చినట్లు చెప్పారు. రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుంటామని వెల్లడించారు. బీజేపీతో గతంలో ఏర్పడిన అంతరాలను తొలగించుకుంటామన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజధానిని ఏకపక్షంగా తరలిస్తారని అనుకోనని చెప్పారు. కులతత్వం, కుటుంబపాలనతో నిండిన రాజకీయ వ్యవస్థను మా కూటమితో ప్రక్షాళన చేస్తామన్నారు. అంతపెద్ద రాజధాని సాధ్యం కాదని అప్పుడే చెప్పినట్లు గుర్తుచేశారు. 33వేల ఎకరాలు ఎందుకని అడిగా. ఇప్పుడు అవే అనుమానాలు నిజమయ్యాయన్నారు. రాజధానిని తరలిస్తే రోడ్లపైకి రావడమే కాదు.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా గురించి 22 మంది ఎంపీలున్న వైసీపీనే అడగాలని పవన్‌ వ్యాఖ్యానించారు. సీఏఏపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు.


Leave a Reply

Your email address will not be published.