మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల‌లో శివాల‌యాల‌కు భ‌క్తులు


శుక్ర‌వారం  రాత్రి 11.30 స‌మ‌యంలో లింగోద్భ‌వ స‌మ‌యం కావ‌టంతో  శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో భక్తులు బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం   భక్తులు  వేలాదిగా వ‌చ్చేయ‌టంతో క్యూలైన్లు కిట‌కిట‌లాడాయి.  వేకువ‌ఝామువ‌ర‌కు జాగారాలు చేసి, పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు.

మహాశివరాత్రి సందర్భంగా   అటు యాగంటి, మహానంది, కాలేశ్వ‌రం, యాదాద్రి, ఏటికొప్పాక‌,  కాల్వబుగ్గ, ఓంకార క్షేత్రాల‌తో పాటు శ్రీ‌కాళ‌హ‌స్తి, విజ‌య‌వాడ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామి ఆల‌యాల‌లో శ‌నివారం కూడా భక్తుల రద్దీ అధికంగా క‌నిపిస్తోంది. ఇక పంచారామాల‌ను వేలాదిగా భ‌క్తులు సంద‌ర్శించారు. భ‌క్తుల కోసం ఆర్టీసీ ఏర్పాటు చేసిన బ‌స్సులు చాల‌క పోవ‌టంతో ప్ర‌యివేటు వాహ‌నాల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. 

అలాగే దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. . రాత్రి 11.30 గంటలకు గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివరాత్రి నేపథ్యంలో దాదాపు అన్ని ఆల‌యాల‌లో ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి. శ‌నివారం కూడా భ‌క్తులు త‌ర‌లి వ‌స్తుండ‌టంతో ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్ర‌తి ఏడాదిక‌న్నా ఈ సారి శివాల‌యాల‌న్ని భ‌క్త‌జ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాయి. ప‌రీక్ష‌ల సీజ‌న్ కావ‌టం, వ‌రుస మూడు రోజులు సెల‌వులు రావ‌టంతో వేలాదిగా విద్యార్ధులు శివాల‌యాల‌ని సంద‌ర్శించారు. ఇరు రాష్ట్రాల‌లోని శివాల‌యాలు ఈ ప‌ర్యాయం హుండీల‌లో భారీగానే విరాళాలు ప‌డిన‌ట్టు క‌నిపించింది. 

Leave a Reply

Your email address will not be published.