నాన్నారింటికి దారేది అనిపించేలా అల వైకుంఠపురములో..షూటింగ్ ప్రారంభం నుంచి ప్రేక్ష‌కుల‌లో ఆసక్తిని రేకెత్తిస్తునే అంచ‌నాలు పెంచేసిన సినిమా త్రివిక్రమ్..అల్లు అర్జున్ ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా అల వైకుంఠపురములో.. ట్రైలర్లు..టీజర్లు..వీడియో సాంగ్స్ సినిమా హైప్‌ని పెంచేసాయి. తొలి ఆట నుంచే అభిమానగ‌ణం ఈల‌లు కేక‌ల‌తో ధియేట‌ర్లు హోరెత్తుతున్నాయి. సంక్రాంతి పండగ లో ప‌లు చిత్రాల‌పై పై చెయ్యి సాధించేందు వ‌చ్చేసిన ఈ వైకుంఠపురము లోకి వెళ్లి ఓ సారి తొంగి చూస్త‌…. ఇది త్రివిక్రమ్ మార్కు సినిమా… అంత‌కు మించి బ‌న్నీ మ‌రోమారు జ‌నాల‌ను హుషారెత్తించే సినిమా అని చెప్పాలి. సినిమా కథ, కథనం, సంగీతం, మాట‌లు, పాట‌లు, డాన్స్‌లు ఇలా స‌గ‌టు ప్రేక్ష‌కుడు ఏం కోరుకుంటాడో అవ‌న్నిక‌ల‌గ‌పి రూపొందించిన సినిమా.. ఇలా వరుస విశేషాల్లోకి వెళ్ళాల్సిందే! 

కథ 
టబు – రోహిణీలు డెలివరీకు అడ్మిట్ అవుతారు.అయితే వారి పిల్ల‌ల్ని మురళీ శర్మ మార్చేస్తారు. దీంతో వారు బంటూ (అల్లూ అర్జున్ ) మిడిల్ క్లాస్ ఇంట్లో – రాజుగా (సుశాంత్ ) ధ‌నికుల ఇంట్లో పెరుగుతుంటారు. జీవితం మీద విపరీతమైన ఆశలతో ఓ కంపెనీలో ఉద్యోగంలోకి చేరిన బంటూ బాస్ పూజా హెగ్డే ని చూసి ప్రేమ‌లో ప‌డిపోతాడు. సుశాంత్ తండ్రి రామచంద్ర (జయరాం) బంటు ప్రేమకి అడ్డుతగులుతుంటాడు. మ‌రోవైపు అప్పలనాయుడు (సముద్రఖ‌ని) జయరాం కంపెనీతో గొడవలు మూలంగా సమస్య వస్తుంది. దాంతో కథ మొత్తం రామచంద్ర – టబుల ‘అల వైకుంఠపురములో’ అనే ఇంట్లోకి కథ షిఫ్ట్ అవుతుంది. 
అవుతుంది. ఇక ఇక్కడ అన్ని సమస్యలకి సమాధానాలు, అన్ని పాత్రలకి క్లారిటీ రావడం మొదలవుతుంది. మ‌రి వైకుంఠపురము ఓ పెద్దింటి భవనం.. ఈ వైకుంఠపురము లోకి బంటు వెళతాడు. ఆ ఇంటికి బంటు కు సంబంధమేమిటి? ఆ ఇంట్లో ఉన్నవారి సమస్యలను ఎలా పరిష్కరించాడు? మ పూజ బంటు ప్రేమ చివరికి గెలిచిందా? లేదా? అసలు బంటు అల వైకుంఠపురంలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఎంటర్ అయిన పని పూర్తి చేశాడా? లేదా? అన్నదే కథ. వివ‌రాలు వెండితెర మీద చూడాలంతే…

ఎలా ఉందంటే 
మొదటి భాగం కామెడీతో స‌ర‌దా స‌ర‌దాగా సాగి పోతుంది. రెండో భాగంలో కామెడీ త‌గ్గి ఎమోషన్ త‌గ్గింది అనేక‌న్నా… ఇంటిల్లపాదీ హాయిగా పండగ చేసుకొనేలా ఉంది. సుతి మెత్తని మాటలు సునిశిత హాస్యాన్ని అందిస్తూ, త‌న‌దైన స్క్రీన్‌ప్లేతో కథనాన్ని నడిపించారు. అల్లు అర్జున్ మూసలో పోసిన త్రివిక్రమ్ ఫార్ములా సినిమా అనిపిస్తుంది. తండ్రీ కొడుకుల బంధం.. వాటి మధ్య భావోద్వేగం.. తన మటల మూటలలో బంధించి వాటిని తెరమీద విప్పి చూపించాడు త్రివిక్రమ్. స‌రదా సన్నివేశాలు.. వాటిలో ఉండే అనుబంధాల గుబాళింపులు. పాత్రకీ పాత్రకీ మధ్య త్రివిక్రమ్ వేసిన మాటల దారాలు.. వీటి మధ్యలో వచ్చే స్టైలిష్ పాటలు.. అక్కడక్కడ మెరిపించిన యాక్షన్. ఇంతే సినిమా. ఇంటిల్లపాదీ సరదాగా చూసేలా పాత సినిమాలలో ఉండే భావుకతను ఆధునికశైలిలో త్రివిక్రమ్ అల్లాడు. 

న‌టీ న‌టులు
బంటుగా అల్లూ అర్జున్ త‌న మార్క్ వేయించుకుంటూ అంతా తానై నిలిచాడు. తన కూల్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో స‌న్నివేశాల్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. పూజాహెగ్డే.. హీరోయిన్ గా చెప్పుకోదగ్గ పాత్ర దొరికింది. ఆట‌, పాల‌తో పాటు న‌టించేందుకు స్కోపున్న పాత్ర‌. బన్నీ తో రెండోసారి జతకట్టిన ఈ భామ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. త్రివిక్రం సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ల కోసం బలమైన పాత్ర‌లు సృష్టిస్తాడు… కానీ దీనిలో టాబును కేవ‌లం కాస్టింగ్ పెంచుకోవ‌టం కోసం తీసుకున్న‌ట్టుంది పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర ఎందుకొప్పుకుందో అర్ధం కాదు. సునీల్, సుశాంత్..ఇద్దరూ అక్కడక్కడ కొద్దిగా మెరుపులు మెరిపించారు. సీతారామ్ అనే పాత్ర ద్వారా సునీల్‌ను సరికొత్తగా క‌నిపించి త‌న‌దైన పంచ్‌లతో హైలైట్‌గా నిల‌చాడు. మరో ముఖ్య పాత్ర మురళీశర్మది. మధ్యతరగతి తండ్రిగా మురళీశర్మ చాలా బాగా చేశారు. మిగిలిన వారంతా సినిమాలో తమదైన శైలిలో అలరించారు

సాంకేతిక నిపుణులు
త్రివిక్రమ్ మాటల తూటాలకు సరిపడే కథనం ఇది. ఫస్ట్ హాఫ్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసిన త్రివిక్రమ్‌, సెకండ్‌ హాఫ్‌ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడ‌నిపిస్తుంది ద్వితీయార్థంలో వావ్‌ అనిపించే సన్నివేశాలు పెద్దగా లేకపోవటంతో పాటు ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం అభిమానుల‌ని, ప్రేక్ష‌కుల‌ని నిరాశకలిగించే అంశం. అయితే తెరంతా త్రివిక్ర‌మ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. బన్నీ ద‌ర్శ‌కుడు రాసిన‌ మాటల బలాన్ని తన నటనతో మరింత పదునుగా తెరమీద ఆవిష్కరించాడు. అదే ఈ అల వైకుంఠపురములో ప్రత్యేకత! తమన్ సంగీతం మొందే చెప్పుకున్నట్టు సినిమా పై ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అన్ని పాటలూ చాలా బావున్నాయి. ఇక వాటి చిత్రీకరణ.. మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. పాటలకు వేసిన సెట్స్, డ్యాన్స్ కంపోజింగ్ అసలు పాటలను మరింత పై స్థాయికి తీసుకు వెళ్లి అభిమానుల‌ను కుర్చీల నుంచి లేచేలా చేస్తాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ.. రాములో రాములా.. సామజవరగమనా.. ఈ పాటల్ని చూసే కొలదీ చూడాలనిపించేలా ఉండ‌టంతో రిపీట్ ఆడియ‌న్స్ ఖాయంగా ఉంది. సాంకేతికంగా అన్ని విధాలుగానూ సినిమా బానే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
అత్తారింటికి దారేది తీసిన త్రివిక్ర‌మ్ అల్లూ అర్జున్‌తో నాన్నారింటికి దారేది అనిపించేలా చేసాడ‌నిపించ‌క మాన‌దు.

-రివ్యూ బై స‌త్య‌గోపాల్‌


Leave a Reply

Your email address will not be published.