సినీ జనాలని , తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టించాలి …

రాష్ట్రం రెండుగా విడిపోయాక సినిమా వాళ్లను రెండు ప్రభుత్వాలూ కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే పద్మపురస్కారాలను పట్టించుకోవడం మానేశాయనే చెప్పాలి. అందుకే ఉత్తరాది వాళ్లకు పెద్ద పీట వేసి కేంద్ర సర్కారు దక్షిణాది వాళ్లకు, అందునా తెలుగు వాళ్లకు మొండిచేయి చూపించడం సర్వసాధారణమైన విషయమై పోయింది. ఈ సారి పద్మ అవార్డులకి దూరమైపోతున్న ప్రముఖులు చాలా మంది కళ్లముందు కదలాడుతున్నా… మనసులో తిట్టుకోవటం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అందునా మన తెలుగు రాష్ట్రాలలో సినీ జగత్తులో పద్మ పురస్కారాలకు అర్హులు చాలా మంది ఉన్నా కనీసం రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసులకు కూడా నోచుకోక పోవటం దురదృష్టకరం.
ఈ సారి పద్మపురస్కారం ఏక్తా కపూర్‌కి ఇవ్వడంపై విమర్శలు అప్పుడే అరంభమయ్యాయి. నిజమే తెలుగు ఇండస్ట్రీలో ఎందరో ప్రముఖులు, కళామతల్లి సేవలో తరించిన వారు ఉండగా . బాలీవుడ్లో బూతు సినిమాలకు ప్రతీకగా పేరుపడ్డ ఏక్తా కపూర్ కు పద్మ అవార్డు వరించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘రాగిణి ఎంఎంఎస్’ లాంటి ఎరోటిక్ సినిమాలు తీసి సొమ్ము చేసుకున్న ఈ అమ్మడు సినీ పరిశ్రమకు తెగ సేవలందించి చమటోడ్చినందుకు పద్మం ఇచ్చారంటే… బాలీవుడ్ అందునా ఉత్తరాది లాబియింగ్ పద్మ అవార్డులపై ఏ మేర ప్రభావం చూపిందన్నది చెప్పకనే చెపుతోంది.
అంతెందుకు మన వెండి తెరపై నవరస నట సార్వభౌముడిగా పెరొందిన కైకాల లాంటి దిగ్గజాలకు గౌరవం దక్కకుండా పోతోందన్న ఆవేదన వ్యక్తం చేసే మా అసోసిషియేషన్ ఏనాడు పద్మ అవార్డుల విషయంపై దృష్టి సారించలేదు. సరికదా, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకువెళ్లక పోవటం వల్లే అన్యాయం జరుగుతోందన్న వారూ లేకపోలేదు.
మన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుకు పద్మభూషణ్.. మరో నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వడం బాగానే ఉందని చంకలు గుద్దుకుంటున్న వారంతా అర్హులు ఎంతోమంది ఉన్నా, వారికి ఎందుకు పుస్కారాలు అందవని మాత్రం ప్రశ్నించుకోరు. ముందస్తుగా చేయాల్సిన తతంగాన్ని నిర్లక్ష్యం చేసి, తీరా ప్రకటించాక లబోదిబోమనటం సాధారజనమైపోయింది మన సినీ జనాలకి.
తెలుగు సినిమా చరిత్రలో నటుడు కైకాల సత్యనారాయణది ఓ ప్రత్యేక అధ్యాయం. వందలాది సినిమాల్లో తన మార్కు నటనతో ప్రేక్షకులను ఓలలాడించారు. ఆయన స్థాయికి ఆయన అందుకున్న అవార్డులు రివార్డులే కాదు ప్రతి ప్రేక్షకుడి మదిలో సుస్థిర స్ధానం అందుకోవటానికి చేసిన పాత్ర లే కారణం. హాస్య, విషాదం, విలనిజం ఏదైనా సరే కొట్టిన పిండి ఆయన ఇలాంటి నటుడికి ఇప్పటిదాకా పద్మ పురస్కారమే దక్కలేదంటే ఆశ్చర్యం కలగక మానదు.
స్థాయి లేని వాళ్లంతా పద్మశ్రీ అవార్డులు ఎగరేసుకుపోతుంటే, మన దగ్గర అన్ని అర్హతలూ ఉన్నా పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటంలేదంటే ఎక్కడ లోపం ఉందో, ఇప్పటికైనా సినీ జనాలని , తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.