భీష్మ మూవీ రివ్యూ,


ఛలో చిత్రంతో సక్సెస్‌ను సొంతం చేసుకొన్న దర్శకుడు వెంకీ కుడుముల భీష్మ చిత్రంతో ద్వితీయ విఘ్నాన్ని దాటేసిన‌ట్టే క‌నిపిస్తోంది. వ‌రుస ఫ్లాపుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న హీరో నితిన్  సరైన విజయం కోసం ఎదురుచూస్తుంటే, వెంకీకి తోడుగా  లక్కీ ఛార్మ్ రష్మిక మందన్న జతకలిసిన చిత్రం భీష్మ. సినిమాలోని పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. విడుదలకు ముందే మంచి పాజిటివ్ టాక్‌తో పాటు, ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్గానిక్ ఫార్మింగ్ కథా నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.  

భీష్మ కథ
 భీష్మ (నితిన్) ఎలాంటి లక్ష్యం లేకుండా డిగ్రీని సగంలోనే ఆపేసి ఖాళీగా తిరుగుతూ జీవితంలో ఒక్క అమ్మాయి ప్రేమలోనైనా పడాలనే కోరికతో పలు రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చైత్ర (రష్మిక మందన్న) భీష్మ ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఓ సందర్భంలో చైత్రతో భీష్మ పరిచయం అవుతుంది. ఆమె వెంట పడుతూ ఆమెను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే, భీష్మ(నితిన్) స్టేటస్ వల్ల రష్మిక తండ్రి (సంపత్) వాళ్ళ ప్రేమను ఒప్పుకోడు. 

మ‌రోవైపు వ్యవసాయ రంగానికి చెందిన “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ భీష్మ (అనంత్ నాగ్) , ఫీల్డ్ సైన్స్ రెండు కంపెనీతో పోటీ వైరం ఉంటుంది. ఫీల్డ్ సైన్స్ గ్రూప్ ఓనర్ అయిన రాఘవన్ (జిషు సేన్ గుప్తా) మాత్రం ఆరోగ్యం దెబ్బ తీసే పురుగు మందులు కనిపెట్టి వాటితో ఎక్కువ దిగుబడి సాధించి బిజినెస్‌లో భీష్మ ఆర్గానిక్స్‌ను తొక్కేయాల  కుట్ర పన్నుతుంటాడు. ఆ క్రమంలో భీష్మ కంపెనీ అధినేత భీష్మ తనకు వయసు పైబడటంతో తన వారసుడి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాడు

 కనీసం డిగ్రీ పాస్ కానీ భీష్మ (నితిన్‌)‌ను కంపెనీ సీఈవోగా నియమిస్తాడు. 30 రోజుల్లో ప్రతిభను నిరూపించుకోవాలని సూచిస్తాడు. భీష్మ సినిమాలో ట్విస్టులు ఎలాంటి అర్హతలు లేని భీష్మ (నితిన్)ను సీఈవోగా నియమించడానికి కారణాలు ఏమిటి? ఈ 30 రోజుల్లో రాఘవన్ పన్నిన కుట్రల నుండి సీఈఓ అయిన భీష్మ ఎలా తన కంపెనీని కాపాడుకున్నాడు?, చైత్రతో తన ప్రేమకథను ఎలా సుఖాంతం చేసుకున్నాడు   భీష్మ అంటేనే ఓ రకమైన అయిష్టాన్ని చైత్ర ఎందుకు పెంచుకొన్నది. చివరకు చైత్ర ప్రేమను ఎలా పొందాడు? అనే ప్రశ్నలకు సమాధానమే భీష్మ సినిమా కథ. 

భీష్మ అనాలిసిస్
ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీకి సీఈవోగా ఎవరిని ఎన్నుకోబోతున్నారనే పాయింట్‌తో  మూవీ ప్రారంభమవుతుంది. పనీ పాట లేకుండా అమ్మాయిల ప్రేమను పొందడానికి ప్రయత్నించే భీష్మగా నితిన్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. నితిన్ క్యారెక్టర్ తెరపైన మొదలైనప్పటి నుంచి వినోద ప్రధానంగా సాగే సన్నివేశాలు, వెన్నెల కిషోర్ కామెడీతో సరదాగా సాగిపోతుంది చైత్రగా రష్మిక క్యారెక్టర్ ఎంట్రీ , రొమాన్స్ అంశాలు కథలోకి చేరుతాయి. ఈ క్రమంలో ఓ విలేజ్‌లో జరిగే యాక్షన్ సీన్ కీలకంగా మారుతుంది. ఆ తర్వాత ఫీల్డ్ సైన్స్ ప్రతినిధుల కుట్రలను వాటిని ఎదురించేందుకు భీష్మ ఎంట్రీ ఇవ్వడం.. అదే ఊపులో ఇంట్రెస్టింగ్ బ్యాంగ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండాఫ్‌పై అంచనాలు పెరుగుతాయి. రెండో భాగంలో  వినోదంతోపాటు యాక్షన్ సీన్లు, ఎమోషన్ అంశాలతో కథ ఫీల్‌గుడ్‌గా సాగుతుంది. ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆర్గానిక్ ఫార్మింగ్, రైతుల కష్టాలు, దళారీల దోపిడి లాంటి అంశాలను ఎమోషనల్‌గా చెప్పడంలో దర్శకుడు ప్రతిభ చూపించడంతో భీష్మ సరైన ట్రాక్‌లోనే వెళ్తుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు భీష్మను సక్సెస్‌ఫుల్ ఫార్ములా సినిమాగా మార్చాయి. చివర్లో ప్రేక్షకుడు సంతృప్తి చెందేలా అజయ్ ఎపిసోడ్, అనంత నాగ్‌ పాత్ర ఇచ్చే ట్విస్టులు సినిమాకు ప్లస్‌గా మారాయని చెప్పవచ్చు.
దర్శకుడు వెంకీ కుడుముల గురించి
 రొటీన్ లవ్ స్టోరికి సేంద్రియ వ్యవసాయం పాయింట్‌ను క్లబ్ చేయడంలోనే దర్శకుడు వెంకీ కుడుముల సక్సెస్ అయ్యాడు. ఒక కమర్షియల్ సినిమా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో ఆయా అంశాలను మేళవిస్తూ, ఆద్యంతం వినోదాత్మకంగా ఉండేలా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకోవడంతోనే సగం సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ వెంకీ కుడుముల మరో మెట్టు ఎక్కడానిపిస్తుంది. అసలు కథలో అంతగా విషయం లేకపోయినా కూడా తన డైరెక్టింగ్ అండ్ రైటింగ్ ఎబిలిటీస్‌తో దాన్ని కప్పి పుచ్చి సెకండ్ హాఫ్‌లో కూడా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా  సినిమాని నడిపించాడు.  వెన్నెల కిషోర్‌తో సున్నితమైన హాస్యాన్ని పండిస్తూ.. మరోవైపు సీరియస్‌గా ఆర్గానిక్ ఫార్మింగ్‌ను సాధారణ ప్రేక్షకులకు అర్ధ‌మ‌య్యేలా తెరకెక్కించాడు. ఇక కమర్షియల్ విలువల కోసం లవ్ స్టోరీని, యాక్షన్ సీన్లను కామెడీని   సమపాళ్లలో చేయడం సినిమాకు  ప్లస్ పాయింట్‌. ఓవరాల్‌గా ఎలాంటి సాహసాలు చేయకుండా, తడబాటు లేకుండా సినిమాను ఫీల్‌గుడ్‌గా మలచడంలో వెంకీ కుడుముల పూర్తిస్థాయిలో సఫలమయ్యాడనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేసే ప్రయత్నం సులభంగా జరిగిపోయిందని చెప్పవచ్చు. 

నితిన్ ఫెర్ఫార్మెన్స్ గురించి 
వరుస వైఫల్యాల బారిన పడిన నితిన్‌కు భీష్మ పెద్ద ఊరట అనిచెప్పవచ్చు. నితిన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథ దొరకడంతో నితిన్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఇమిడి పోయి నటించాడు. చాలా కాలం తరువాత నితిన్‌లోని కామెడీ యాంగిల్‌ని పూర్తిగా ప్రొజెక్ట్ చేసిన సినిమా ఇదే ,   రొమాంటిక్ సీన్లలో రష్మికతో కెమిస్ట్రీని, ఫైట్స్‌, యాక్షన్ సీన్లలో కూడా మంచి ఈజ్‌ను ప్రదర్శించాడు.
 రష్మిక ఫెర్ఫార్మెన్స్
రష్మిక మందన్న చైత్రగా  ఇంపార్టంట్ రోల్ లో కనిపించి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో బాగా ఆకట్టుకుంది. సినిమాలో  అటు గ్లామర్‌తోను, ఇటు ఫెర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ చేస్తూ చైత్ర క్యారెక్టర్‌లో చాలా క్యూట్‌గా ఆకట్టుకొన్నది. ఫస్టాఫ్‌లో అల్లరి పిల్లలా కనిపించిన రష్మిక.. సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్లతో మెప్పించింది.  డ్యాన్సులతో ఇరుగదీసింది.  ప్రీ క్లైమాక్స్ ముందు నితిన్‌తో ఓ ఎమోషనల్ సీన్‌లో రష్మిక నటన భావోద్వేగానికి గురిచేస్తుంది. వరుస విజయాలను చేజిక్కించుకొంటున్న రష్మిక ఖాతాలో మరో విజయం చేరిందనే చెప్పాలి.  
మిగిలిన పాత్ర‌లు
మిగితా క్యారెక్టర్లలో భీష్మ కంపెనీ అధినేతగా భీష్మగా అనంత్ నాగ్ నటన చాలా బాగుంది. హావభావాలు, డైలాగ్ డెలివరీ చూస్తే భీష్మ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడనిపిస్తుంది. ఇక విలన్‌గా జిషు సేన్ గుప్తా క్లాస్ విలనిజం ఇంత తేలికగానా అన్నట్టు ఆ పాత్రలో దూరిపోయాడు. లుక్, స్టయిల్ చాలా బాగుంది. ఇక ఏసీపీగా, రష్మిక ఫాదర్‌గా సంపత్ రాజ్ తనదైన శైలిలో మెప్పించాడు. పలు సీన్లలో సీరియస్ లుక్స్‌తోపాటు పలు సన్నివేశాల్లో కామెడీని బ్రహ్మండంగా పండించాడు. 
చిన్న పాత్రలో మెరిసిన హెబ్బా పటేల్ కూడా కామెడీ మంత్రమే పటించేసింది.  కామెడీ బృందంలో వెన్నెల కిషోర్ అన్ని మార్కులు కొట్టేసేలా హాస్యాన్ని పండించాడు.  అలాగే నర్రా శ్రీనివాస్‌ సీరియస్‌ సీన్లలో అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. రఘుబాబు సందర్బోచితంగా డైలాగ్స్‌ను పేల్చాడు. అలాగే మిర్చి కిరణ్‌ను సమయం దొరికితే తనమార్కు కామెడీ డైలాగ్స్ అలరించాడు. వీకే నరేష్ ఎమోషనల్ , కామెడీలోఇరగదీశాడు. సుదర్శన్, బ్రహ్మాజీ లాంటి పాత్రలు కూడా ఆకట్టుకొంటాయి. దర్శకుడు వెంకీ కుడుముల రాసిన ఫీల్ గుడ్, ద‌ర్శ‌కుడు రాసుకున్న‌ పంచ్ డైలాగ్స్‌లకు నటీనటులందరూ పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.  

సాంకేతిక విభాగాలు
 మ్యూజిక్ విషయానికి వస్తే.. సంగీత దర్శకుడు అందించిన  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పలు సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది.   చివర్లో వచ్చిన మాస్ పాట తప్ప మిగితా పాటలు అంతగా అలరించలేకపోయాయి. పాటలు కూడా బాగా క్లిక్ అయితే సినిమా మరో రేంజ్‌లో ఉండేది,  భీష్మ సినిమాకు సినిమాటోగ్రఫి మరో ఎట్రాక్షన్. సాయి శ్రీరాం అందించిన విజువల్స్ బాగున్నాయి. పచ్చని పంట పొలాలు, స్టైలిష్ ఆఫీస్, ఇతర అంశాలను చాలా చక్కగా తెరకెక్కించాడు. అలాగే యాక్షన్, ఎమోషనల్ సీన్లలో ఫర్‌‌ఫెక్షన్ చూపించాడు.
అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ కూడా ఫర్‌ఫెక్ట్‌గా ఉన్నా, సెకండ్ హాఫ్ లోని కొన్ని చోట్ల ఉన్న స్లో సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.  ఆర్ట్ విభాగం పనితీరు కూడా బాగుంది. 

ప్రొడక్షన్ వ్యాల్యూస్
 సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. సినిమాపై నమ్మకంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. సేంద్రియ వ్యవసాయం అనే క్లిష్టమైన సబ్జెక్ట్‌కు అత్యంత సాదాసీదా ప్రేమ కథను జోడించి  అందించడంలో సఫలమైంది. సినిమా కథకు అవసరమైన లొకేషన్లు, పాత్రలకు ఎంచుకొన్న నటీనటుల అంశాలు వారి సినిమా నిర్మాణ విలువలకు అద్దం పట్టేలా ఉంది. క్లాస్,మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా భీష్మను రూపొందించడంలో మెరుగైన నిర్మాణ విలువలను జోడించారు. 

 ఫైనల్‌గా 
అంతర్లీనంగా సామాజిక సందేశంతోపాటు వినోదం, ప్రేమకథను జోడించి రూపొందించిన చిత్రం భీష్మ.   కథ, కథనం కొత్తగా ఉండాలి లాంటి ఆలోచనలు లేకుండా వెళితే రెండున్నర గంటలపాటు ఆస్వాదించే వినోదంతో హాయిగా నవ్వించి పంపించే పైసా వసూల్ ఎంటర్‌టైనర్ ‘భీష్మ’. బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల చేరవేయగలిగితే సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని రాబట్టే సత్తా భీష్మలో ఉంది

బలం, బలహీనతలు
ప్లస్ పాయింట్స్ : నితిన్, రష్మిక కెమిస్ట్రీ ,అనంత్ నాగ్, జిషు సేన్ గుప్తా ఫెర్ఫార్మెన్స్ ,వెంకీ కుడుముల స్క్రీన్ ప్లే, డైరక్షన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫి, ఆర్గానిక్ ఫార్మింగ్ త‌దిత‌ర అంశాలు
మైనస్ పాయింట్స్ : రొటీన్ లవ్ స్టోరి ,ఊహించే విధంగా క్లైమాక్స్

Leave a Reply

Your email address will not be published.