టిడిపి నేతలను ఇళ్ల నుంచి బైటకు రాకుండా చూస్తున్నారా…..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చూపాలని వైసిపి భావిస్తోంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. జగన్ తీసుకున్న నిర్ణయం సమంజసమైందని, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండటం వల్ల ఉపయోగం ఎంతుందో చంద్రబాబుకు తెలిసేలా నారావారిపల్లె నుంచే తెలియజేస్తామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.
ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాలో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజక వర్గంలోని వైసీపీ సభ నిర్వహించి తీరుతామని, తెలుగుదేశం శ్రేణులు అడ్డుకుంటే వారిని ఎలా అణనగదొక్కగలమో మాకు తెలుసన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశ్యం తమ పార్టీదని, అధికారాన్ని కేంద్రీకరణ చేయటం వల్లే ఇన్నాళ్లు రాష్ట్ర అభివృద్ధి చెందకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు చెవిరెడ్డి.
కాగా నారావారి పల్లెలో వైసిపి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు పార్టీ వర్గాలను భారీగా మోహరించింది. ఈ సభకు రాష్ట్రంలోని మంత్రులంలతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలను రప్పించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇప్పటికే పలువురు టిడిపి నేతలను ఇళ్ల నుంచి బైటకు రాకుండా చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.