రాజకీయాలతో స్పీకర్ కేం పని

సాధారణ పౌరులకు రాజధానులతో పని ఉండదని, విశాఖలో రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వం’’ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరి స్పీకర్ అమరావతిలో అడుగుపెట్టగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్పీకర్ రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆరోపించేవారు, ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను మాట్లాడుతున్నానన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తమ్మినేని అనటం చూస్తుంటే సామాన్య ప్రజలకు ఎన్నో హామీలిచ్చి ఓట్లు కొట్టేసిన విషయాన్ని ఆయన మరిచిపోతున్నట్టున్నారని సామాజిక మీడియాలో ట్రోలింగ్ అవుతోంది.
ఇన్నాళ్లు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ టీడీపీ నాయకులు చేసారని చెపుతున్న నేతలు ఇప్పుడు విశాఖలో తమపై ఆరోపణలు వస్తుంటే…. విశాఖలో ఇన్సైడర్ ట్రేడింగ్ టీడీపీ నాయకులు చేసి అడ్డు తగులుతున్నారని మాట్లాడుతున్నారని, నిస్పక్షపాతంగా వ్యవహరిస్తాననుకునే తమ్మినేని విశాఖలో భూముల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఎందుకు సూచించరని నిలదీస్తున్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ మూడు రాజధానులను ప్రతిపాదిస్తే, విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి విశాఖ రాజధాని దోహదపడుతుందని చెపుతున్నారు కదా? ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖ కన్నా…. ఎంతో వెనుక బడ్డ శ్రీకాకుళంలో రాజధాని పెట్టాలన్న డిమాండ్‌కు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోతున్నారని, సొంత జిల్లాలలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన తమ్మినేని ఆస్తులు సంపాదించుకోవటం తప్ప చేసిందేంలేదని, దశాబ్దాలుగా మూల పడిన సుగర్ ఫ్యాక్టరీని నిత్యం తన ఎన్నికల అవసరాలకు వాడుకున్నారే మినహా దానిని పునఃర్ ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు చాలానే ఉన్నాయి.