ఆర్టీసీ మాటున యూనియన్లకు కేసీఆర్ ఎసరు?

ప్రజలకు మెరుగైన రవాణా ఇవ్వాల్సిన మాపై బాధ్యత ఉంది. ప్రైవేట్ పర్మిట్లను పెట్టుబడిదారులకు ఇవ్వదలచుకోలేదు. షావుకారులకు ఇవ్వదలచుకోలదు. ఒకవేళ ఉన్నపళంగా సంస్కరణలు తెస్తే ఆర్టీసీలో కొద్ది మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకుంటే నలుగురైదురికి కలిపి పర్మిట్లు ఇద్దామనుకున్నాం. అంత గొప్పగా వెళ్దామనుకున్నాం. కార్మికుల పట్ల దురుద్దేశపూర్వకంగా మేం ఆలోచన చేయలేదు. ఇదీ నిన్న ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తపరచిన మాటల సారాంశం.
దీంతో ఆర్టీసీ కార్మికులను బస్సు యజమానులుగా మార్చాలన్న భావన ఆయన వ్యక్తం చేయటం ఒక ఎత్తయితే, ఆర్టీసీకి భారంగా మారిన కార్మికులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించేలా బాణం ఎక్కుపెట్టినట్టే కనిపిస్తోంది. పైగా కార్మికులకు పెద్ద మొత్తంలో పదవీ విరమణ పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని స్పష్టమవుతోందని కార్మిక వర్గాలే హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా సమ్మె విషయంలో పదే పదే హైకోర్టుతో మొట్టికాయలు తినడంతో ప్రభుత్వ ప్రతిష్ట మసక బారిందని, అందునా కేంద్ర కార్మిక మంత్రిగా నూ పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వంలో లేబర్ కోర్టు నుంచి కూడా వాతలు వస్తే, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనటంతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా ఆందోళనకు సిద్దమ్యేలా పరిస్ధితి మారుతుండటం వల్లే సమ్మె విరమణ అనంతరం ఇంతవరకు చేర్చుకోమన్నకేసీఆర్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులపై దయ చూపినట్టు కనిపిస్తోందన్నది మరికొందరు చెపుతున్నారు.
యూనియన్ల మాయలో పడి కార్మికులు బంగారం లాంటి ఆర్టీసిని చెడగొట్టుకుంటున్నారని, క్రమశిక్షణగా పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్లు ఇస్తామని చెప్పడంతో పాటు భేషరతుగా విధుల్లో చేరాలంటూ కార్మికులకు చెప్పడం వెనుక యూనియన్లని తుంగలోకి తొక్కే ప్రక్రియలో భాగమేనని చెప్పకనే చెప్పినట్టయ్యింది. కాగా దాదాపు రెండు నెలల పాటు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్యికులకు ఈ సమ్మె కాలానికి జీతాల చెల్లింపులు ఉంటాయా? అన్నది ప్రశ్నార్ధకమే. యూనియన్ల పరిధిలో ఉంటే కార్మికులు నష్టపోతారని హెచ్చరికలు జారీ చేయటంతో రాష్ట్రంలో ఇతర యూనియన్లను కూడా నిర్వీరం చేసే ప్రక్రియ ఆరంభించినట్టేనని , యూనియన్ల పరంగా పేరొందిన నేతలు ప్రభుత్వంలో పదవులందుకుని మౌనమునులవ్వటం వెనుక ఆంతర్యమిదేనన్న భావన ఇప్పుడు అంతటా నెలకొందనటంలో సందేహమే లేదు.