డిస్కోరాజా రివ్యూప్రేక్ష‌కుల‌కు మినిమం గ్యారంటీ ఎంటర్‌టైన్మెంట్ ఖాయం చేస్తూ, సినిమా అంతటినీ తన భుజస్కందాలపై మోస్తూ… వ‌చ్చిన మాస్ మహారాజా రవితేజ కి కాలం క‌ల‌సి రాలేదు. వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నా అన్నీ నేల చూపులు చూడ‌టంతో సినీ కెరీర్ బెంబేలెత్తించాయి.  ‘బలుపు’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజా ది గ్రేట్’  త‌న స్థామినా చూపినా… చెప్పుకోద‌గ్గ ఫ‌లితం అందుకోలేక పోయాడు.  ఎవ్వరూ ఊహించిన రీతిలో ఈ మూడు సినిమాలు డిజాస్టర్లు రావటంతో పాలుపోని ర‌వితేజ‌,  ప్రతీ సినిమాకు ఏదో ఒక భిన్న‌మైన‌ పాయింట్‌ను ఎంచుకునిత‌న‌దైన శైలిలో తెర‌కెక్కించిన వీఐ ఆనంద్ తో జ‌త‌క‌ట్టి త‌న మార్కుతో కూడిన న‌ట‌న‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేసాడు.  ఆనంద్ ఈ సారి మ‌రో డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న విష‌యం  టీజర్, పాటలు, ట్రైలర్‌తోనే స్ప‌ష్ట‌మైంది.  జ‌న‌వ‌రి 24న విడుద‌లైత‌న ఈ చిత్రం మ‌రి ర‌వితేజ‌కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

కథలోకి వెళితే…
1980 కాలంలో మద్రాస్ లో పెద్ద గ్యాంగ్ స్టర్  డిస్కో రాజా (రవితేజ) నిత్యం అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ కాలం గ‌డుపుతూ  హెలెన్ (పాయల్ రాజ్ పుత్)తో  ప్రేమలో పడతాడు.   తనకు అడ్డు వచ్చిన బర్మా సేతు (బాబీ సింగ్) ను జైలుకి పంపి అడ్డు తొలిగించుకుంటాడు. ఆపై హెలెన్‌ని సొంత చేసుకున్న డిస్కో రాజా  లడఖ్ ప్రాంతానికి వచ్చేస్తాడు.  అయితే అనూహ్యంగా జ‌రిగిన దాడిలో డిస్కో రాజా చనిపోతాడు. లడ‌క్‌లో ఐస్‌లో కూరుకుపోయిన డిస్కోరాజా శ‌వాన్ని ముప్పై సంవత్సరాల తరువాత ఒక ఐస్ ట్రెక్కింగ్ చేస్తున్న స‌మయంలో ఓగ్రూప్ చూస్తుంది.   చనిపోయిన మనుషిని తిరిగి  బతికించడంపై   రీసెర్చ్ చేస్తోన్న టీమ్ (తాన్యా హోప్ బ్యాచ్)లోని కొంద‌రు మెడికల్ స్టూడెంట్స్   ఆ శవంపై  ప్రయోగాలు చేసి బ‌తికించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. వ‌ద్దంటూ  ప్రభుత్వం ఆదేశాలిచ్చినా… అనాథ శవం కాదా త‌మ‌కు ఎలాంటి సమస్య రాదని ప్రయోగం ఫ‌ల‌వంతం కావ‌టంతో  డిస్కో రాజా మళ్ళీ బతుకుతాడు. కానీ త‌న‌ గతాన్ని గుర్తు తీసుకు రాలేక పోతారు. ఈ స‌మ‌యంలోనే     వాసు (రవితేజ) తో నభా (నభా నటేష్) ప్రేమ కథ , అర్ధంతరంగా క‌నిపించ‌ని వాసుని   వెతుకుతూ కొంద‌రు అక్క‌డికి చేరుకుంటారు.  ఇంతకీ వాసుకి డిస్కో రాజాకి ఉన్న సంబంధం ఏమిటి ? డిస్కో రాజా’ను చంపింది ఎవరు ?  డిస్కోరాజాకి గ‌తం గుర్తొచ్చిందా? త‌న‌ని హ‌త్య చేసిన వారిపై డిస్కో రాజా ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు ?   చివరకు ఏం జరిగిందనేది చిత్ర‌ కథ.  


 డిస్కోరాజాపై సేతు (బాబీ సింహా) పగను ఎందుకు పెంచుకుంటాడు? డెబ్బై యేళ్లైనా డిస్కోరాజా యవ్వనంలోనే ఎందుకు ఉంటాడు? ఈ కథలో ఆంటోనీ దాస్ (సునీల్) క్యారెక్టర్, హెలెన్ (పాయల్ రాజ్‌పుత్)కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే డిస్కోరాజా.

క‌థ‌నం
 లఢఖ్‌లో  ఓ గ్యాంగ్ దాడి చేసి డిస్కోరాజాని కిరాతకంగా చంపేయడం, కొన్నేళ్లు పోయాక‌  మెడికల్ స్టూడెంట్స్‌కు  దొరప్ర‌యోగాలు చేయ‌టం, ఇలా వ‌రుస‌గా వ‌చ్చే సీన్స్‌తో ప్ర‌ధ‌మార్ధం ఆస‌క్తిని పెంచేలా సాగింది.  వాసు కుటుంబ కష్టాలు, నభా నటేష్ ఎంట్రీ చిత్ర వేగాన్ని పెంచేలా ఉంటుంది.  డిస్కోరాజా , మళ్లీ బతిక‌డం, అతనికి గతం గుర్తుకు రావడానికి ప్రయత్నాలు,  వాసును వెతుక్కుంటూ  ఓ గ్యాంగ్ రంగ ప్ర‌వేశం  వ‌రుస సీన్లు కొంత‌ గజిబిజీని సృష్టించి ప్రేక్ష‌కుల‌ని   గందరగోళం లో ప‌డేస్తాయి.  వ‌రుస  ట్విస్ట్ లు ప్రేక్ష‌కుల‌కిచ్చి అందర్నీ థ్రిల్ చేసేలా ఉండాల‌న్న‌ట్టు ఈ సీన్లు క్రియేట్ చేసినా…   ఎందుకో న‌డుస్తున్న క‌థ‌కి స్పీడ్ బ్రేకుల్లా  అనిపించాయి.  ఇక ద్వితీయార్థంలో  డిస్కోరాజా ఫ్లాష్‌బ్యాక్‌,  దొంగతనాలు, గ్యాంగ్ స్టర్‌గా ఎదిగే దృశ్యాలు చూస్తే… రొటీన్ సీన్లు చూస్తున్న‌ట్ట‌నిపించ‌క మాన‌దు.  మ‌ధ్య మ‌ధ్య‌లో  సత్య, సునీల్ ల హాస్య స‌న్నివేశాలు,  రవితేజ మ‌ర్కు సెటైరిక‌ల్ కామెడిల‌లో ఇవ‌న్నీ కొట్టుకుపోతాయి.
 సేతు ఎంట్రీ , డిస్కోరాజాతో గ్యాంగ్‌వార్‌,  సెకండాఫ్ని పీక్‌కి తీసుకువెళ్లాయ‌నిపిస్తుంది.  హెలెన్ (పాయల్ రాజ్‌పుత్) తో డిస్కోరాజా ఉండే లవ్ సీన్స్ చిత్రీక‌ర‌ణ ఆహ్లాదంగా ఉంది.  అయితే ఓ కొత్త‌ద‌నం క‌థ‌ని అటు తిప్పి ఇటుతిప్పి ప‌గ ప్ర‌తీకారం అనే రొటీన్ క‌థ‌నం జోడించ‌డంతో సాధార‌ణ సినిమాలా మారిపోయింది. అయితే   క్లైమాక్స్ ప్రేక్షకులకు  థ్రిల్ ఇచ్చేలా ఏంది.  ప్ర‌స్తుతం ఈ చిత్రంతోపాటు చిన్న సినిమాలే విడుద‌లైనా   రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించి, నిర్మాత‌ల‌కు కాసులు కురిపించే ఛాన్సు క‌నిపిస్తోంది.  

ర‌వితేజ న‌ట‌న‌
డిస్కోరాజాగా రవితేజ డైలాగ్ డెలివరీ స్టైల్ అన్నీ డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తాయి. ర‌వితేజ   ఫుల్ ఎనర్జీగా నటించి సినిమాని ఓ స్థాయికి తీస‌కెళ్లాడ‌నే చెప్పాలి. త‌న మార్కు న‌ట‌న‌తో అభిమానులనే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడిని సైతం అలరించాడ‌నే చెప్పాలి.

హీరోయిన్లు ఎలా చేసారంటే
 నభా నటేష్ కి  స్క్రీన్ టైం త‌క్కువే అయినా ఉన్నంతలో   అందంతో పాటు తమ అభినయంతో  మెప్పించింది. హెలెన్ పాత్రలో పాయల్ రాజ్ పుత్ చెవిటి, మూగ పాత్రను పోషించి, కొత్తగా క‌నిపించ‌డంతో పాటు లుక్స్‌తోనే ఆకట్టుకునే న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. ముఖ్యంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో పాయల్ పలికించిన హావభావాలు బాగున్నాయి. తాన్యా హోప్  కనిపించింది కొద్ది సేపే అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

ఆంటోనీ దాస్ పాత్రలో సునీల్ తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.  సేతు పాత్రలో విలనిజం పండించడంలో బాబీ సింహా త‌న మార్కు చూపాడు.   సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో మ్యానరిజమ్స్ తో  న‌డిచిన హాస్యం బాగుంది.  సత్యం రాజేశ్, జబర్దస్త్ మహేష్ , అన్నపూర్ణ  అంతా తమ పరిధి మేరకు నటించారు.
 
దర్శకుడి పనితీరు..
ఎక్కడికి పోతావు చిన్నివాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌లో మంచి పేరందుకున్న వీఐ ఆనంద్ ర‌వితేజ‌లాంటి ఎన‌ర్జ‌టిక్ హీరోతో వ‌స్తుంటే ఆ అంచ‌నాలే వేరుగా ఉంటాయి. అందునా   ఏదో ఒక కొత్త పాయింట్, కొత్త దనం ఉంటుందని భావించ‌డం క‌ద్దు అయితే  చనిపోయిన వ్య‌క్తికి జీవం పోయ‌టం  అన్న‌దే కొత్త‌ పాయింట్  మిన‌హా  సినిమా తెర‌పై అరిగిపోయిన గ్యాంగ్ స్టర్ రివేంజ్ స్టోరీవైపు మ‌లుపు తిప్పాడు.  అయితే   సైంటిఫిక్‌ టర్మినాలజీ ఉపయోగించి క‌థ‌ను చెప్పాడ‌నినిపిస్తుంది.  ఈ రివేంజ్‌ కథకు ఇది  అవసరమా అనిపిస్తుంది.  మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథనాన్ని రాసుకోలేదనిపిస్తుంది. ఆసక్తికరంగా నడిపే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం తన శైలిలోనే సినిమాని మలిచాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ల్యాగ్ సీన్స్ ను తగ్గిస్తే  మ‌రింత ట్రిమ్ అయ్యేది. టీజర్, ట్రైలర్ కట్ చేయడంతో ఇదేదో సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా అనుకునేలా రూపొందించ‌డంతో ధియేట‌ర్‌కి వ‌చ్చిన‌ ప్రేక్షకుడికి నిరాశ కలిగ‌క మాన‌దు. అయితే  విభిన్నంగా రవితేజను చూపించడంలో మాత్రం వీఐ ఆనంద్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే..   సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు కూడా బాగున్నాయి.   డిస్కో రాజా సాంగ్ అదిర‌గొట్టేలా ఉంది.  నేపధ్య సంగీతం కూడా త‌మ‌న్ త‌న మార్కు ప్ర‌ద‌ర్శించి ఆకట్టుకున్నాడు. పాటలు ఎంత వినసొంపుగా అనిపిస్తాయో.. వాటిని అంతే అందంగా చూపించడంలో   సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని స‌క్స‌స్ అయ్యాడు, ప్ర‌తి దృశ్యం అద్భుతంగా తెర‌కెక్కించాడు.
ఇక ఎడిటర్ నవీన్ నూలీ  ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. మ‌రింత క‌త్తెర వేసి  ట్రీమ్ చేసి ఉంటే మ‌రింత బాగుండేది. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు.

చివ‌రిగా…
వరుస ప‌రాజయాలతో అత‌లాకుత‌ల‌మ‌వుతున్న  రవితేజకు.. ఈ డిస్కోరాజా ఉపశమనం కలిగించేదే.   ముందెన్నడూ కనిపించని ఎనర్జీ ఈ సినిమాలో క‌నిపించింది. ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్ ను ప‌క్కాగా రాసుకోకపోవడంతో డిస్కో రాజా క్యారెక్టరైజేషన్, రెండు పాత్రల మధ్య ఎమోషన్ బలంగా ఎలివేట్ చేయ‌లేక పోయినా రవితేజ  మాస్ మాహారాజా గా అభిమానులకు కన్నులపండుగ చేసాడ‌నే చెప్పాలి.   కమర్షియల్‌గా డిస్కోరాజా ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.