హెరిటేజ్ పై ఆరోపణలు రుజువు చెయ్యండి లేదా క్షమాపణ చెప్పండి

ఎన్నిక‌ల ముందు నుంచి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌నే అధికారంలోకి వచ్చి 8 నెలలయినా  వైసీపీ చేస్తోంద‌ని, .తాము  అవినీతికి పాల్పడినట్టుగా ఏవైనా ఆధారాలుంటే బైట పెట్టేందుకు ఎందుకు భ‌య‌ప‌డుతున్నార‌ని తెలుగుదేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు వైసిపి నేత‌ల‌ని నిలదీశారు. గురువారం ఆయ‌న అమ‌రావ‌తిలో జాతీయ మీడియాతో రాజ‌ధాని అంశం, మండ‌లి స‌మావేశంలో మంత్రుల తీరుతెన్నుల‌పై మాట్లాడారు. అమ‌రావ‌తిలో అన్ని తాత్కాలిక రాజ‌ధానులు అంటుండ‌టం విడ్డూరంగా ఉంద‌ని, త‌త్కాలిక‌మంటే షెడ్లు వేసి నిర్మించ‌లేద‌ని, మ‌రో అధునాతన భ‌వ‌న నిర్మాణం జ‌రిగాక వాటిని త‌ర‌లించి, ప్ర‌స్తుత భ‌వ‌నాల‌ను మ‌రో సంస్ధ‌కు వినియోగించుకోవ‌టం అన్న విష‌యం గ‌మ‌నించాల‌ని సూచించారు. ఇప్ప‌టికే శాస‌న‌స‌భ్యులు, మంత్రులు, అధికారుల క్వార్ట‌ర్లు పూర్తి చేసుకున్నాయ‌ని, వీటిని తాత్కాలికం అంటారా? అని ప్ర‌శ్నించారు.

త‌మ హ‌యాంలో అమ‌రావ‌తి నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రిగింద‌ని, మూడున్న‌రేళ్ల పాటు విప‌క్ష భూములపై, ప‌ర్యావ‌ర‌ణంపై వివిధ కేసులు వేసింద‌ని వాటిని అధిగ‌మించి నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్టు వివ‌రించారు చంద్ర‌బాబు.  త‌మ ప్ర‌భుత్వంలో అవినీతి జరిగితే విమ‌ర్శ‌ల‌కు త‌ప్ప వైసిపి నిరూపించే దిశ‌గా ఎందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌టంలేద‌ని నిల‌దీసారు.  పదేపదే హెరిటేజ్‌ గురించి ముఖ్య‌మంత్రి, మంత్రులు మాట్లాడుతున్నార‌ని,  వ్యాపార సంస్ధ‌గా దాని ప‌రిధిని విస్తరించుకునేందుకు ఏ కంపెనీ అయిన ఆస్తులు కొనుగోలు చేస్తుంద‌ని, ఈ క్ర‌మంలోనే  హెరిటేజ్ సంస్థ వ్యాపార విస్తరణ నిమిత్తం దేశంలోని పలు ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేసిందని, ఇందులో వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన సమస్యేంటని ఆయన ప్రశ్నించారు. ఏపిలో త‌మ ప‌రిధిని విస్త‌రించుకునేందుకే హెరిటేజ్‌  నాగార్జున యూనివర్సిటీకి సమీపంలో  భూమి  కొనుగోలు చేయ‌టం  తప్పేలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.  

అమ‌రావ‌తి ప‌రిధిలో హెరిటేజ్ కంపెనీ కొన్న భూమి రాజ‌ధాని ప‌రిధిలో ఉన్న‌ట్టు అస‌త్య ప్ర‌చారం చేస్తున్న వైసిపి నేత‌లకు  క్యాపిటల్ రీజియన్ పరిధి ఏమిటో తెలియ‌ద‌న్న‌ది స్పష్టం  అవుతోంద‌ని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సరస్వతి సిమెంట్స్,  సొంత మైనింగ్ కంపెనీలకు మేలు చేకూర్చే విధంగా  నిర్ణయాలు తీసుకున్న విష‌యం వాస్త‌వం కాదా? అని నిల‌దీసారు.  తాను అధికారంలో ఉన్న‌ప్పుడు హెరిటేజ్‌కు లాభం చేకూర్చేలా ప్రభుత్వపరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, 
 హెరిటేజ్ విష‌యంలో తాము అక్రమాలకు పాల్పడినట్టు రుజువు చేయాలని లేదంటే త‌ప్పు చెప్పాన‌ని బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్పాల‌ని జగన్‌కు చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published.