అమలులేని చట్టానికి ఫిర్యాదు ఎలా స్వీకరిస్తామంటున్న పోలీసులు

జగన్ మిడిమిడి జ్ఞానంతో అతితెలివి ప్రదర్శించి కక్షసాధింపే లక్ష్యంగా పాలన చేస్తున్నారని, వైకాపా సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని కానూరులో నిర్వహించిన తెదేపా రాష్ట్రస్థాయి విస్తృత సమావేశానికి ఆయన హాజరై నేతలనుద్దేశించి ప్రసంగించారు.
తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులో వేసిన పిటిషన్ను జగన్ ఎందుకు ఉపసంహరించుకున్నారని . దీనిని అస్త్రంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలని మానసికంగా హింసించాలని చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
దిశ’ చట్టానికి కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాకపోయినా రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్ ప్రారంభించారని, ఈ విషయంలో కేసు నమోదు చేయాలంటే అమలులేని చట్టానికి ఫిర్యాదు ఎలా స్వీకరిస్తామని పోలీసులంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికే చాలా పరిశ్రమలను వెనక్కి పంపేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచేసిందని అలాంటప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
ఎవరు ఏ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసినా ఎదురుదాడులు చేయటమే లక్ష్యంగా, ఓ ప్రత్యేక మైన భాషని అందరికీ శిక్షణ ఇచ్చి మరీ మాట్లాడిస్తున్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేసారు. ఎన్ని బెదిరింపులొచ్చినా ప్రజలకోసం నిలబడాలని కార్యక్రతలకు చంద్రబాబు ఉద్బోధించారు. ఆరోపణలు తామే చేసి, వాటిపై ఆధారాలుంటే చర్యలు తీసుకోవాల్సింది పోయి విచారణల పేరుతో అధికారులను వేధిస్తున్నారని, నెల తరబడి ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా జీతాలు చెల్లించకుండా నోటికొచ్చింది మాట్లాడి జనాన్ని మభ్యపెడుతున్న ఘనత ఈ సర్కారుదేనని అన్నారు.