ఆ వెన్నుపోటు పాపంతోనే అధికారానికి దూరం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ వెన్నుపోటు వ్యవహారంలో తను కూడా పాలు పంచుకోవటం వల్లే 15 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందంటూ ఏపి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేసారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలలో ఇటీవల టిడిపిని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మాట్లాడే అవకాశం ఇచ్చిన సందర్భంలో స్పీకర్ అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి సభ్యులు వాకౌట్ చేసారు.
అంతకు ముందు వంశీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాల కారణం గానే ఆ పార్టీలో ఇమడలేకపోతున్నానని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి బైటకు వచ్చి నందున తనని ప్రత్యేక సభ్యునిగా గుర్తించాలని స్పీకర్‌ని కోరారు. తను ముఖ్యమంత్రిని కలవటాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుపడుతుండటం దారుణమని, ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రజా ప్రతినిధిగా మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నది తన అభిప్రాయం అని చెప్పారు. సభలో నా హక్కులను కాపాడాలని కోరుకుంటున్నానని వంశీ ఈ సందర్భంగా స్పీకర్‌ని కోరారు.
ఈ క్రమంలో టిడిపి తీవ్ర అభ్యంతరాలను చెపుతుండటంతో ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్న వ్యవహారాన్ని ప్రస్ధావించారు స్పీకర్ తమ్మినేని. ఆ సమయంలో తను కూడా చంద్రబాబుతో ఉన్నాను. ఎన్టీఆర్‌ని అధికారంలాక్కోవటంతో తను కూడా భాగస్వామిని అయిన పాపానికి 15 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, ఇప్పటికీ ఈ విషయంలో తను బాధపడుతుంటానని చెప్పారు. వంశీ వ్యవహారంలో నా విచక్షనాధికారం తోనే అవకాశం ఇవ్వడం సక్రమమైన చర్యేనని స్పష్టం చేసారు. అసెంబ్లీని వైసీపీ కార్యాలయం గా చంద్రబాబు వ్యాఖ్యానించటం సరికాదని, అసెంబ్లీ ఎవరి జాగీరు కాదు ప్రజల జాగీరు అని ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకోవాలని సూచించారు.