ఖాకీ కులంలో కులాల కుంపట్లు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గ‌జ్జి నానాటికీ విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే  55 మంది డిఎస్ పి ఆ పై స్థాయి పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వక పోవ‌టంతో వారంతా  ఆరు నెలలుగా  ఖాళీగానే ఉండాల్సిన ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల‌లో అఖండ విజ‌యం సాధించిన‌ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి  మొత్తం 90 మంది పోలీసులు ఉన్నతాధికారులకు పోస్టింగులు నిలిపేయ‌గా కొంద‌రు వ‌త్తిడి ఫ‌లించి  35 మంది వరకూ పోస్టింగులు ఇచ్చేశారు. ఇలా  పోస్టింగులు తెచ్చుకున్న వారంతా  అప్రధానమైన పోస్టులలో కొన‌సాగేందుకు మౌనంగానే రోదిస్తూ, మన సమర్థతను వాడుకోకపోతే సమాజానికే నష్టం మనకేంటి అని అనుకుంటూనే చేరిపోయారు. 
ఇక మిగిలిన  మరో 55 మంది డిఎస్ పి లు, అదనపు ఎస్ పిలు, నాన్ క్యాడర్ ఎస్ పిలు ఇప్పటికీ ఎలాంటి పోస్టింగ్ లేకుండా గాలిలోనే తేలియాడుతున్నారు. భారీ ఎత్తున వీరంద‌రికీ జీత భత్యాలు చెల్లిస్తూ వీరిని ఊర‌క‌నే ఎందుకు కూర్చోబెడుతోందీ ప్ర‌భుత్వం లో  జ‌వాబు చెప్పే నాధుడే లేడు . సమర్ధత ఉన్నా, సర్వీసు రికార్డులో ఎలాంటి మచ్చ లేకున్నా వీరిని ప‌క్క‌కు నెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణం  కులంగా క‌నిపిస్తోంద‌ని అధికారిక వ‌ర్గాలే చెపుతున్న మాట‌. ఎవరో కంప్లయింట్ చేశారనో, అవినీతి చేసి దొరికారనో కాదు. కేవ‌లం తమ కులం చూసి పోస్టింగులు ఆపారని ఈ పోలీసు ఉన్నతాధికారుల మాట‌. 
వీరంతా కమ్మ, కాపు కులాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు. అకస్మాత్తుగా డిపార్టుమెంటులోకి వచ్చిన వారు కూడా కాదు. వీరిలో 20, 25 ఏళ్లు సర్వీసు నిండిన వారు.  25 మంది కమ్మ కులానికి చెందిన వారు కాగా, 14 మంది కాపు కులానికి చెందిన వారు. మిగిలిన వారు వేరే అగ్రకులాల వారు. తమకు పోస్టింగులు ఇవ్వకపోవడానికి  వీరికి కులం అడ్డ‌యింద‌ని,  ఇప్పుడు కులం ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు వీరంతా.  
అస‌లే ఆర్ధికంగా దివాలా తీసిన రాష్ట్రంలో రివ‌ర్స్‌లో కోట్లు మిగిల్చేసామ‌ని చెపుతున్న అధికార పెద్ద‌లు ఇలా ఉన్న‌తోధ్యోగుల‌ను గాలిలో ఉంచి భారీగా జీత‌భ‌త్యాలు చెల్లించ‌డం ఏమేర‌కు స‌మంజ‌స‌మో చెప్పాలి.  కుల‌భ‌జ‌న ఆరంభించిన అధికార పెద్ద‌లు వీరిని ఎప్ప‌టికి తిరిగి విధుల‌లోకి తీసుకుంటారో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.