జ‌గ‌న్ “మంచి సీఎం కాదు ముంచే సీఎం”

ఆరునెల‌ల్లో మంచి సిఎం అనిపించుకుంటాన‌ని, పాల‌న‌లో పెను మార్పులు తీసుకువ‌స్తాన‌న్న జ‌గ‌న్ రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడంటూ విప‌క్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేర‌కు శ‌నివారం  జగన్ ఆరు నెలల పాలనపై టీడీపీ ఒక బుక్‌ను రిలీజ్ చేసింది. “మంచి సీఎం కాదు ముంచే సీఎం” అనే టైటిల్‌తో ఓ పుస్త‌కాన్ని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను వేడుకున్న జ‌గ‌న్ తీరా అవ‌కాశం రాగానే   ప్రజలనే మోసం చేసేందుకు తెగ‌బ‌డ్డాడని ఆరోపించారు.   అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పాల‌న పై కాకుండా ప్రతిపక్షాలను టార్గెట్ చేశారని,  ఆరు నెలలలో రాష్ట్రంలో ఒక్క కొత్త ప‌రిశ్ర‌మ రాలేద‌ని, కొత్త‌గా డ‌బ్బులు స‌మీక‌ర‌ణ‌ల కోసం  ఇప్పుడు భూమ‌లు అమ్మేద్దామ‌ని ప్ర‌తిపాద‌న‌లు తీసుకువ‌స్తున్నార‌ని, దీంతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత‌గా చిన్నాభిన్నమయ్యిందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని మండిపడ్డారు. జగన్ చెప్పిన పథకాలు ప్రకటనలకు తప్ప అమలుకు మాత్రం నోచుకోవడం లేదని అన్నారు.

 తెలుగుదేశం ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనేక ప‌థ‌కాలు ర‌ద్దు చేసిన వైసిపి ప్ర‌భుత్వం  త‌ను చేప‌ట్టిన ఏ ప‌థ‌కాన్ని స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి నెల‌కొల్పార‌ని, మంత్రులు ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించ‌కుండా ఉండేందుకు అయోమ‌య ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు.

Leave a Reply

Your email address will not be published.