డేంజ‌ర్ నెల‌లో సినిమానా…

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌ ఆరంభించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. కాని ఇప్పటి వరకు దశాబ్దంకు ఒక్కటి అన్నట్లుగా రెండు సక్సెస్‌లు మాత్రమే దక్కించుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్‌ రామ్‌ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ గుహన్‌ దర్శకత్వంలో ‘118’ అనే విభిన్నమైన సినిమాను చేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉండటంతో పాటు, ఆకట్టుకునే మేకోవర్‌తో సినిమాలో కనిపించబోతున్నారు.

ఈ చిత్రంలో కళ్యాణ్‌ రామ్‌కు జోడీగా ముద్దుగుమ్మలు నివేదా థామస్‌ మరియు షాలిని పాండేలు నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 1న ‘118’ చిత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ నెల మొత్తం చిన్నా చితకా చిత్రాలు చాలానే విడుదల కాబోతున్నాయి. వెంటనే ఏప్రిల్‌లో పెద్ద సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. అందుకే మిగిలి ఉన్న మార్చిని కొన్ని సినిమాలు క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

టాలీవుడ్‌లో మార్చిలో ఎప్పుడు కూడా పెద్ద సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు. ఒక వేళ విడుదలైనా కూడా భారీగా ఓపెనింగ్స్‌ దక్కించుకుని సక్సెస్‌ అయిన దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మార్చి 1వ తేదీన 118 చిత్రం ఎలా విడుదల చేయాలని కళ్యాణ్‌ రామ్‌ కమిట్‌ అయ్యారో అర్థం కావడం లేదు. విడుదల తేదీ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త అజాగ్ర‌త్త వ‌హించార‌నిపిస్తుంది. సినిమా విషయంలో నమ్మకం లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే సినిమాపై ఉన్న అతి నమ్మకం వల్ల కూడా ఇలా డేంజర్‌ నెలలో సినిమాను విడుదల చేస్తున్నారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదా ఏమైనా ఈసారైనా క‌ళ్యాణ్‌కి మంచి హిట్ రావాల‌ని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published.