కేంద్రం దృష్టికి తీసుకువెళతా..పార్లమెంట్ లో పోరాడతా..! ఎంపికి గల్లా జయదేవ్

అభివృద్ధి అంటే రాజధానిని విభజించడమే అన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, వైసిపి నేతలు మాట్లాడటంపై మండి పడ్డారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. సోమవారం ఆయన అమరావతి రాజధాని తరలించొద్దంటూ మందడంలో రైతులు గత 19 రోజులుగా చేస్తున్న నిరసనలపై ఆయన మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమరావతిని మూడు ముక్కలు చేస్తే రాజధాని ఏదని చెప్పాలని, రాష్ట్రంలోకి పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీసారు. రాష్ట్రాన్ని ఇష్టను సారంగా విభజించుకు పోవటం వల్ల మిగిలేది ఖర్చు తప్ప ఆదాయం ఎట్టి పరిస్థితిలోనూ రాదన్నారు.
పెయిడ్ ఆర్టిస్టులని వారంతా తనతో పాటు నటించారంటూ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ ఆడి కార్లు, గోల్డ్ చెయిన్లు, ఖద్దరు షర్టులో కనిపిస్తున్నారు, వీళ్లంతా నిజంగానే రైతులేనా అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకుని రైతుల వద్ద సెల్ ఫోన్లు ఉండటం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. తమకు వచ్చిన పంటలను అమ్ముకుని రైతులు కార్లు, బంగారం కొనుకున్నారే తప్ప ఎవ్వరిదగ్గరా వైసిపి నేతల్లా దొచుకుని కొనుక్కోలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. రైతులంటే గోచీలు పెట్టుకు తిరగాలన్న భావన లో పృద్ధీ ఉంటే అందులోంచి బైటకు రావాలని అన్నారు.
రైతులు లాభార్జనకోసమే భూములు ఇచ్చారంటూ మంగళగిరి శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడని, ఆ మాట రైతులు, మహిళలను కించపరిచడమేనని అన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న రైతులను చులకన చేసి మాట్లాడడం సరికాదని హితవు పలికారు.శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఈ సందర్భంగా ఎంపికి గల్లా జయదేవ్ కు మహిళలు ఫిర్యాదు చేశారు. రాజధాని తరలింపుతో పాటు ఈ అంశాలన్నింటిని కేంద్రం దృష్టికి తీసుకువెళతానని, పార్లమెంట్ లో గట్టిగా పోరాడతామని అన్నారు.