వైభవంగా సాగుతున్న ఇఫీ స్వర్ణోత్సవ వేడుకలు

భారత ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవ వేడుకలు గోవాలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకూ కొనసాగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంపిక చేసిన ఆణిముత్యా ల్లాంటి సినిమాలను, అలనాటి క్లాసిక్ చిత్రాలను వీక్షించే అవకాశం ‘ఇఫి’ అందిస్తుండటంతో సినీ ప్రేమికులతో ఈ వేడుక సందడిగా మారిపోయింది. అలాగే సినీరంగంలో సేవలందించిన, అనేక మంది లబ్ధప్రతిష్ఠులకు ఈ వేడుకలలో సన్మాన సత్కారాలందిస్తోంది ఇఫీ.
ప్రతిష్ఠాత్మక చిత్రోత్సవాల్లో ఒకటిగా ఆసియా ఖండంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘ఇఫి’ని భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 1952 లో ఆరంభించింది. అయితే 1975 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తుండగా 2004 నుంచి గోవాను శాశ్వత వేదికగా మారింది. ఈ ఏడాదితో ‘ఇఫి’కి 50 వసంతాలు పూర్తవుతుండటంతో భారీగా స్వర్ణోత్సవ సంబరాలను నిర్వహించాలని నిర్ణయించిన విషయంవిదితమే .
ఇంటర్నేషనల్ కాంపిటీషన్, వరల్డ్ పనోరమ, ఇండియన్ పనోరమ, ఇండియన్ న్యూ వేవ్ సినిమా, సోల్ ఆఫ్ ఆసియా, ఆస్కార్ రెట్రోస్పెక్టివ్ ఇలా 20కి పైగా విభాగాల్లో చిత్రాలను ఈ చిత్రోత్సవంలో ప్రదర్శిస్తారు. ఇందుకు 76 దేశాల నుంచి 250కి పైగా చిత్రాలు ఎంపిక చేసారు. వీటిలో పలు డాక్యుమెంటరీ చిత్రాలు, షార్ట్ ఫిలింలు కూడా ఉన్నాయి.
ఈ చిత్రోత్సవంలో గల్లీబాయ్, ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్, సూపర్ 30, బదాయి హో లాంటి బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగు చిత్రం ‘ఎఫ్2’ కూడా ఎంపిక కావటం విశేషంగా చెప్పుకోవాలి. ది గోల్డెన్ లైనింగ్ విభాగంలో ప్రదర్శించే చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన ‘వరకట్నం’ చిత్రాన్ని ప్రదర్శిస్తారు