యాత్ర డాక్యుమెంటరీ డ్రామా

దివగంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో చేపట్టిన పాదయాత్రకు దేశంలోనే అప్పట్లో చర్చనీయాంశమైంది. వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న నాయకుడు వైఎస్సార్. ఆయన చేసిన పాదయాత్ర ఇతివృత్తంగా యాత్ర చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈరోజు శుక్రవారం 8న ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్లలో విడుదలైంది. చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అదరగొట్టారనే చెప్పాలి. వైఎస్సార్ పాత్రలో రాజన్న తిరిగి వచ్చినట్లు అనిపించింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేశారనే అనిపిస్తుంది ఆపాత్ర చూస్తే. మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా వంటి డైలాగులకు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. మొత్తంమ్మీద ఈ చిత్రంలో వైఎస్సార్ లా మమ్ముట్టి అదరగొట్టారనే అంటున్నారు.
మహి వి రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురించి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి.. అధికారపక్ష నాయకుడిగా ఎదిగిన క్రమాన్ని యాత్ర సినిమాలో చూపించారు. కొత్తగా చెప్పిన కథేం కాదు.. వై.ఎస్.ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్రకు ఉన్న ప్రాముఖ్యతను.. అందుకు దారి తీసిన పరిస్థితులను ప్రధానంగా చేసుకుని సినిమాను తెరకెక్కించారు. మమ్ముట్టి తనదైన నటనను ప్రదర్శించడమే కాదు.. తెలుగులో కూడా తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. గ్రేస్ ఫుల్గా కనపడ్డారు మమ్ముట్టి. సినిమా అంతా ఈయన పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. సినిమాలో ముఖ్య పాత్రధారులైన కె.వి.పి పాత్రలో నటించిన రావు రమేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. అయితే వై.ఎస్ పాత్ర కె.వి.పికి ఇచ్చిన ప్రాముఖ్యతను సినిమాలో చూపించారు. వై.ఎస్. పాదయాత్ర సమయంలో కె.వి.పి ఆయన వెన్నంటే ఉన్నా ఆ పాత్రను అంత పెద్దగా ఎలివేట్ చేయలేదు. వై.ఎస్ అనుచరుడిగా నటించిన రమేష్ కంటే రావు రమేష్ పాత్ర ఎఫెక్టివ్ కాస్త తక్కువగానే కనపడింది. ఇక వై.ఎస్.రాజారెడ్డి పాత్రలో నటించిన జగపతిబాబు, క్యారెక్టర్ని కూడా అంత బాగా చూపించలేకపోయారు. అంత పెద్ద హీరోను పెట్టినప్పుడు దానికి తగ్గ ప్రాధాన్యతను ఇవ్వలేకపోయారు డైరెక్టర్. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటించిన సుహాసిని, సుచరిత పాత్రలో నటించిన అనసూయ, వెంకట్రావుగా పోసాని కృష్ణమురళి, కేశవరెడ్డిగా వినోద్ కుమార్, హనుమంతరావు పాత్రలో తోటపల్లి మధు తదితరులు వారి పాత్రల్లో చక్కగా నటించారు. అందరికికంటే హనుమంతరావు పాత్రలో నటించిన తోటపల్లి మధు చాలా బాగా సూట్ అయ్యారనే చెప్పాలి.
ఆలాగే రైతుల కష్టాలు, పేదవాళ్ళ ఆవేదనలకు సంబంధించిన సన్నివేశాలు మరియి వైఎస్సార్ కేవీపీల స్నేహం ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు, క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. సంగీత దర్శకుడు ‘కె’ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. దర్శకుడు మహి.వి.రాఘవ్ రాసిన కథతో పాటు బలమైన పాత్రలతో మరియు పెయిన్ ఫుల్ ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. దీనికి తోడు మమ్ముట్టి కూడా తన నటనతో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మొత్తం మీద ఈ చిత్రం వైఎస్సార్ అభిమానులకు మాత్రం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. అలాగే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని కూడా ఈ చిత్రం అలరిస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఈ చిత్రం నిలబడుతుందో చూడాలి.