*నేడు బాలకృష్ణ నటించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’విడుదల*


ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారీ అంచనాల నడుమ ఈ బయోపిక్ మొదటిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఈరోజు (జనవరి 9న) విడుదలకానుంది. దీంతో కొత్త పోస్టర్స్, సాంగ్ ప్రోమోలతో సినిమాపై ఇప్పటికే ఉన్న ఆసక్తికి రెక్కలు కడుతోంది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటులు తమ పాత్రల గురించి.. ఆ పాత్ర పోషించినప్పుడు తమకు కలిగిన అనుభవాలను పంచుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోలనూ చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజాగా దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి సంబంధించి.. ఎన్‌టీఆర్‌కు సంబంధించి తనకు తెలిసిన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

‘‘ఎన్‌టీఆర్ ముక్కుసూటిగా ఉండే వ్యక్తి. బాగా చదువుకొని.. పాల వ్యాపారం చేసుకొని  రిజిస్టార్‌ అయిన వ్యక్తి. ఆయనది అందమైన, నిష్కల్మశమైన మనస్సు. అందమైన కుటుంబం. అలాంటి వ్యక్తి భారతదేశంలోనే మొట్టమొదటి సూపర్‌స్టార్‌గా ఎదిగారు. తెలుగు జనానికి దేవుడు అయ్యారు. ఢిల్లీని వణికిచ్చిన వ్యక్తి. అయితే ఆయనలో ఎవరికీ తెలియని అమాయకత్వం ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. అయితే ఎన్‌టీఆర్‌లో ఉన్న ఆ అమాయకత్వాన్ని చూపించాలనేదే నా తపన. ముందుగా ఈ కథ రాసుకున్నప్పుడు నాలుగున్నర గంటలు వచ్చింది. బాలకృష్ణ గారితో రెండు ఇంటర్వెల్స్ ఇద్దామని చెప్పాను. రామారావుగారు మనం బయట చూసిన వ్యక్తి కాదు. ఆయనలో ఉన్న ఆమాయకమైన మనిషిని ఈ సినిమాలో చూడొచ్చు. ఆయనకి కుటుంబంతో ఉన్న భావోద్వేగాన్ని ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు’’ అని క్రిష్ తెలిపారు.
                                     

Leave a Reply

Your email address will not be published.