ఏపీ స్పీకర్‌ తమ్మినేనికి ఘోర అవమానం


 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అవమానం జరిగింది. గౌరవపదమైన హోదాలో ఉన్న స్పీకర్ తమ్మినేనిని అవమానించే రీతిలో ఏపీ భవన్ సిబ్బంది వ్యవహరించారు. భోజనపు బిల్లు కట్టమనడంతో ఆయన తీవ్ర అసహానికి గురయ్యారు. ప్రొటోకాల్ నిబంధనలను పట్టించుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం కలిగించడంతో స్పీకర్ ఫ్యామిలీ మనస్తాపానికి గురైంది.
డెహ్రాడూన్‌ పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం తమ్మినేని ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సతీసమేతంగా చేరుకున్నారు. ఆయనకు స్వర్ణముఖి బ్లాకులోని 320 గెస్ట్‌ రూమ్‌ను కేటాయించారు. ఆయన తిరిగి ఏపీకి వెళ్లే హడావుడిలో ఉండగా.. ఏపీ భవన్‌‌కు చెందిన ఓ ఉద్యోగి వచ్చి.. ‘సార్‌.. భోజన, వసతి బిల్లు కట్టమన్నారు’ అంటూ పుస్తకంపై సంతకం చేయాలని కోరాడు. ఈ పరిణామంతో స్పీకర్ ఖంగుతిన్నారు. రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లు అడగడమేంటని సీతారాం విస్తుపోయారు.
ఏపీ భవన్ సిబ్బంది కోరినట్టుగానే ‘ముందు బిల్లు కట్టేయండి.. తర్వాత సంగతి నేను చూసుకుంటా’ అని సీతారాం తన ఆంతరంగిక సిబ్బందిని ఆదేశించారు. దీంతో భోజన, వసతి బిల్లును స్పీకర్ సిబ్బంది చెల్లించేశారు. ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని సతీమణి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘డబ్బు ఎంతైనా ముందు ఇచ్చేద్దాం. మనకు అవమానం జరిగింది. స్పీకర్‌గా ఈ అధికారులు గౌరవించలేదు’ అని అసహనం వ్యక్తంచేశారు.

క్షమాపణ…
స్పీకర్ తమ్మినేనికి జరిగిన అవమానంపై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనా వివరణ ఇచ్చారు. స్పీకర్‌ తమకు స్టేట్‌ గెస్ట్‌ అని, ఆయన విడిది ఉన్నందుకు బిల్లు వసూలు చేయాలనుకోవడం తప్పేనని స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామన్నారు.


Leave a Reply

Your email address will not be published.