మళ్లీ కేబినెట్ భేటీ తేదీ మారింది
అమరావతి: అనేక గందరగోళాల మధ్య ఏపీ కేబినెట్ ఎల్లుండికి వాయిదా పడింది. తొలుత ఈనెల 20న ఏపీ కేబినెట్ సమావేశం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇంతలో శుక్రవారం సడన్‌గా.. శనివారమే కేబినెట్ భేటీ అంటూ మంత్రులకు సమాచారం చేరవేశారు. మళ్లీ అంతలోనే నివేదికలు ఇంకా సిద్ధం కాలేదంటూ యథాతథంగా ఈనెల 20నే మంత్రివర్గ సమావేశం ఉంటుందని మళ్లీ ప్రభుత్వం సమాచారం అందించింది. అనేక ఊగిసలాట తర్వాత కేబినెట్ సమావేశం 20కి వాయిదా వేశారు.
సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9 గంటలకు సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 13 జిల్లాల సమగ్రాభివృద్ధిపైన, పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపైన హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక మీద చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మూడ్రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు.
రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు, బీసీజీ నివేదికలతోపాటు గతంలో శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ తన నివేదికను సోమవారం కేబినెట్‌కు సమర్పించనుంది. అనంతరం దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు, అలాగే పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్, లెజిస్లేచర్ వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.