హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ షురూ..

ఎప్పటి లాగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్‌లో పుస్తక ప్రదర్శనశాల ప్రారంభమైంది. ఈ సారి 33వసారి జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన వారం రోజుల
పాటు జరుగుతుంది. ఈ జాతరలో ఎంతోమంది ఔత్సాహికులు పాల్గొని దీన్ని కనువిందు చేస్తుంటారు. తెలంగాణ కళా భారతి ప్రాంగణంలో (ఎన్టీఆర్ స్టేడియం) డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగుతుంది. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం (డిసెంబర్ 23) మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై ఈ పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ ప్రదర్శనలో ఎంతో మంది తెలుగు సాహితీ వేత్తలు పాల్గొంటారు. మాజీ ప్రధాని డాక్టర్ పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ అనువాదకుడు ఉర్దూ – తెలుగు సాహిత్యంలో పండితుడు, కథ, నవల, గజల్స్ లాంటి ప్రక్రియల్లో నిష్ణాతుడైన ఆచార్య డాక్టర్ నోముల సత్యనారాయణ పేరిట వేదికను ఏర్పాటు చేశారు.
దీంతో పాటు మాదిరెడ్డి సులోచన, అబ్బూరి ఛాయాదేవి పేర్లతో ఏర్పాటు చేసిన ద్వారాల నుంచి సందర్శకులు ప్రదర్శనలోకి వెళ్లివచ్చేలా ఏర్పాట్లు చేశారు.
ఈ ప్రదర్శనలో మొత్తం 33ం స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 2019లో 9 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పబ్లిషర్స్ ఎక్కువగా కనిపిస్తారు. ప్రదర్శనలో 5 భాషలకు చెందిన పుస్తకాలు కొలువుదీరాయి.