కరోనా కాకినాడను తాకిందా ?అనుమానంతో…

శరవేగంగా విస్తరిస్తున్న కరోనాపై ఆందోళన లేదని కొందరు భరోసా ఇస్తూన్నా తెలుగురాష్ట్రాలలో ఎప్పుడు ఎవరికి సోకుంతుందో అనే భయాందోళన చాలా కనిపిస్తోంది. తాజాగా
కాకినాడలోనూ కరోనా ఉన్నట్టు అనుమానంతో ఓ వ్యక్తిని అక్కడి ఆసుప్రతికి తరలించారు. వివరాలలోకి వెళితే … హైదారాబాద్‌లో సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తు ఉద్యోగ రీత్యా ఇటీవల దక్షిణకొరియాకు వెళ్లిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి వారం కిందటే ఇండియాకు తిరిగొచ్చి, తన సొంత ఊరయిన తూర్పుగోదావరి జిల్లాలోని వాడపాలెం చేరుకుని, అక్కడే మూడు రోజులుగా ఉంటున్నాడు. అయితే ప్రధానంగా దక్షిణ కొరియాలోనూ కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న క్రమంలో హైదరాబాద్ లోని అధికారులు శంషాబాద్ విమానాశ్రయం లో వివిధ దేశాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలను సేకరించిన క్రమంలో తూర్పుగోదావరి జిల్లా వ్యక్తి గురించి తెలిసింది. దీంతో అతడికి తక్షణమే పరీక్షలు నిర్వహించి కోవిడ్ సోకింది లేనిది నిర్ధారించుకోవాలంటూ తూర్పుగోదావరి కలెక్టర్‌కు సమాచారం పంపారు.
ఈ సమాచారంతో అప్రమత్తమైన కలెక్టర్ వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలివ్వటంతో హుటాహుటిన అర్థరాత్రి వాడపాలెం చేరుకున్న వైద్య అధికారులు, ఆరా తీస్తే ఆతను ముమ్మిడివరం లోని తన అత్తవారి ఇంటికి వెళ్లినట్టు అతని కుటుంబీకులు తెలిపారు. వెంటనే గోదశవారిపాలెంకు వెళ్లి సదరు అనుమానితుడిని పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అతనితో పాటు ఆతని భార్య సహ అత్త ఇంట్లోని వ్యక్తులను కూడా ఆసుప్రతికి తీసుకెళ్లి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లా వచ్చాక ఏఏ రోజులు ఎక్కడెక్కడికి వెళ్లింది ఆరాలు ఆరంభించి, అతను కలసిన వ్యక్తులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు.
మరోవైపు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా అనుమానిత వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్న వ్యక్తిని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి , జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ని కలసి నేరుగా మాట్లాడారు. అనంతరం జిజిహెచ్ లో కరోనా వ్యాధి చికిత్స కోసం చేపడుతున్న చర్యలను డాక్టర్లను అడిగి తెలుసుకుని, అనుమానుతుడిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.