ఇన్సైడ్ ట్రేడింగ్ పై కేసులు నిలబడతాయా..! వైసీపీ మల్లగుల్లాలు

రాజధాని అమరావతిలో గత ప్రభుత్వంలోని పెద్దలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కు పాల్పడినట్లు  ప్రతిపక్ష నేత‌గా  ఆరోపణలు చేస్తు వ‌చ్చిన జ‌గ‌న్‌, అధికారంలోకి రాగానే ఈ విష‌యంపై   మంత్రుల ఉపసంఘంతో ఒక నివేదికను సిద్ధం చేసుకుని తెలుగుదేశంపై దాడిసి సిద్ద‌మైనా  ఎట్లా ముందుకు వెళ్ళాలో నిర్ణయించుకోలేక తికమక పడుతున్నట్లు క‌నిపిస్తోంది. ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిన‌ట్టు కేసులు వేసినా  న్యాయస్థానాల్లో ఈ కేసులు నిలబడని నిపుణులు చెబుతూ ఉండడంతో దిక్కుతోచడం లేదని  వైసిపి నేత‌లే చెపుతున్నారు. ముఖ్యంగా వీటిపై ద‌ర్యాప్తులు చేయిస్తామంటూ బీరాలు ప‌లికిన వారంతా ఆరోప‌ణ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతున్నారు మిన‌హా ఏ సంస్థతో విచారణ చేయించాలనుకుంటున్నారో, ఎప్ప‌టికి చేయిస్తారో అనే విషయమై వారిలోనే క్లారిటీ క‌నిపించ‌డంలేద‌న్న‌ది విజ్ఞుల మాట‌. 

రాజధానిలో మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రులు, వారి బంధువులతోపాటు చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్‌ తరఫున భూములు కొనుగోలు చేశారని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి ప్రకటించి చాలా పెద్ద లిస్టే చ‌దివారు. అయితే అప్ప‌టి వ‌ర‌కు నాలుగువేల పైచిలుకు ఎక‌రాలంటూ గ‌గ్గోలు చేసిన వారు ఆర్ధిక మంత్రి ప్ర‌క‌టించిన లిస్టులో 500 ఎక‌రాల‌కు లోబ‌డే ఉండ‌టంతో అవాక్క‌వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. పైగా ఈ భూముల కుంభకోణానికి సంబంధించి సిబిఐ లేదా సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించాలని డిసెంబర్‌ 27న రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానించినా…. అస‌లు కేసులు ఎలా న‌మోదు చేయాలి…  ఎలా ముందుకెళ్లాలా అని ముఖ్యమంత్రి న్యాయనిపుణులతో చర్చిస్తున్నా ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో   సిబిసిఐడికి అప్పగిస్తే విమర్శలు వస్తాయా? సిబిఐకి అప్పగిస్తే కేసు నిలబడుతుందా ? అన్న ప్ర‌శ్న‌లు ఉద్భ‌విస్తున్నాయి.
ఇప్పటికే క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఒక విడత న్యాయనిపుణులతో చర్చించింది. భూ యజమానులు నేరుగా కోర్టుకెళితేనే కేసులు నిలబడటం లేదని, అలాంటప్పుడు బినామీ ఆస్తులపై విచారణ ప్రక్రియ న్యాయపరంగా ఎలా నిలబడుతుందని నిపుణుల మాట‌. 
కేవలం విమర్శ చేయడానికి మాత్ర‌మే బినామీలు అనే ప‌దం స‌రిపోతుంది మిన‌హా ఫలానా వ్యక్తులు ఫ‌లానా వ్య‌క్తుల కోసమే  ఈ భూమిని కొన్నారని నిరూపించడం   సాధ్యం కాదని, ఉన్న‌త స్ధానాల‌లో ఉన్న‌వారితో బంధుత్వాలు ఉన్నంత మాత్రాన ఆస్తులు వ్య‌క్తిగ‌తంగా కొనుగోళ్లు చేయ‌టం నేరంగా  కోర్టులో ఎలా నిరూపిస్తార‌ని అడిగితే స‌మాధానం ఇచ్చేందుకు వైసిపి నేత‌లు సిద్ధంగా లేర‌ని కొంద‌రి మాట‌. 
ముందు కేసువేయండి ఆధారాలు తరువాత చూద్దాం… ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన క్లిప్పింగులే మ‌న ఆధారాలు… ఏదైనా ఉంటే ఆ యా ప‌త్రిక‌ల మీద‌కు నెట్టేద్దాం…. కేసు వీగిపోతే అది ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్ప‌డితే… కొత్త ప‌థ‌కంతో జ‌నం దృష్టి మ‌ళ్లించేయ‌వ‌చ్చ‌ని ఓ సినియ‌ర్ నేత స‌ల‌హా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే కేసులు ప్ర‌భుత్వానికి మ‌చ్చ‌గా మారే ప్ర‌మాదంఉంద‌ని నిపుణులు  కొంద‌రు హెచ్చరించినట్లు తెలిసింది. 
ఇప్ప‌టికే మాజీ మంత్రి నారాయణ 60 ఎకరాలకు పైబడి కొనుగోలు చేశారని వైసిపి నేతలు విమర్శలు చేసిన నేపథ్యంలో దాన్ని నిరూపిస్తే భూములు వెనక్కు ఇచ్చేస్తానని నారాయణ  ప్రతిసవాల్ విస‌రినా నేటికీ క‌నీస స్పంద‌న అధికార పార్టీలో క‌నిపించ‌క పోవ‌టాన్నే పెద్ద ఉదాహ‌ర‌ణ‌గా చెపుతున్నారు.  అయితే చంద్ర‌బాబు  ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాజధాని ప్రకటనకు   ముందుగానే త‌న  హెరిటేజ్‌ పేరు మీద భూములు కొనుగోలు చేయడం, దానికి ఆనుకుని ఇన్నర్‌రింగురోడ్డు వెళ్లే విధంగా ప్లాను మార్చడం  న్యాయపరంగా కోర్టులో నిలబడవచ్చునని ప‌లు కేసుల‌ను చంద్ర‌బాబుపై వేసిన రాజ‌ధాని ప‌రిధిలోని ఎమ్మెల్యే ఒక‌రు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈ కేసుకూడా తానే వేస్తాన‌ని ఆయ‌న స‌న్నిహితులుకు చెప్పిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. అయినా అంశాన్ని నిరూపించడం అంత తేలికైన వ్యవహారం కాదన్న‌ది న్యాయ‌ప‌రిశీల‌కులు వాద‌న‌. మ‌రేం జ‌ర‌గ‌నుందో చూడాలి.  

Leave a Reply

Your email address will not be published.