హాలీవుడ్ తెరపై అశోకుని కళింగ చరిత్ర

కళింగ రాజ వంశీకుడు, హాలీవుడ్ దర్శకుడు జగదీష్ దానేటి ఇప్పుడు కళింగ వార్–ఎంపరర్ అశోకాస్ లాస్ట్ బ్యాటిల్ పేరిట ఓ భారీ హాలీవుడ్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన విశాఖపట్నంలోని మేఘాలయ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధైర్యానికి పురిటిగడ్డ అయిన కళింగ రాజ్య విస్తరణకు అశోకుడు చేసిన అనేక యుధ్ధాలు, అనంతరం రక్తపాతం చూసి బౌధ్ధాన్ని స్వీకరించి శాంతి మార్గం పట్టాడం తదితర అంశాలతో ఈ చిత్ర నిర్మాణం సాగుతుందని చెప్పారు.
తన ఇండియా పర్యటనలో భాగంగా హాలీవుడ్ నిర్మాత, దర్శకుడు జానీ మార్టిన్, పింక్ జాగ్వార్ ఎంటర్టైన్మెంట్ టీమ్‌తో కలిసి 5 సినిమాలను నిర్మిస్తున్నామని ప్రకటించారు జగదీష్ దానేటి . తమ పూర్వీకుల, కళింగ ప్రజల త్యాగం ఈ స్క్రిప్ట్‌కు స్ఫూర్తిగా నిలచిందని, ఈ చిత్రంలో భారతీయ సూపర్ స్టార్లతో పాటుగా హాలీవుడ్‌కి సంబంధించిన పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించనున్నారన్నారు. ఇది హాలీవుడ్లో సూపర్‌హిట్‌గా నిలచిన గ్లాడియేటర్ లాంటి అద్భుత చిత్రాల సరసన నిలబడే చిత్రం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో కనిపిస్తున్న ఉద్రిక్తలు, యుద్ధవాతావరణాలు చూస్తుంటే శాంతి చాలా అవసరమని స్పష్టంగా కనిపిస్తోందని, దీనిని విశ్వవ్యాప్తం తెలియచేసేందుకు సినీ మాద్యమాన్ని ఎంచుకున్నట్టు వివరించారు. చారిత్రక యుద్ధం సంభవించిన కళింగ సీమ ప్రాంతం కాబట్టే విశాఖపట్టణంలో కళింగ వార్ ప్రాజెక్టు ప్రకటించినట్టు ఆయన వెల్లడించారు.
హాలీవుడ్ నిర్మాత, దర్శకుడైన జానీ మార్టిన్ మీడియాతో మాట్లాడుతూ జగదీష్ దానేటితో కలసి సమ్రాట్ అశోక్ జీవన పయనాన్ని తెరకెక్కించే ప్రోజక్టులో భాగం కావటం ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకుల మనసులకు హత్తుకునే సినిమాలను రూపొందిచాలన్నదే తన కోరికని, జగదీష్ దానేటి రూపొందించిన అద్భుతమైన స్క్రిప్ట్ తన కల సాకారం చేస్తున్నారన్నారు. ఈ ప్రోజక్టు కోసం భారత ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఫింక్ జాగ్వార్స్ ఎంటర్టైన్మెంట్ ఎండి సువర్ణ పప్పు మాట్లాడుతూ కళింగ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ ప్రాజెక్టుల కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు మన దేశానికి వస్తున్నట్టు వెల్లడించారు. సినిమా స్టూడియోలు, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఎఆర్), వర్చువల్ రియాలిటీ (విఆర్) సెంటర్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ మీడియా పవర్ హౌజ్‌లని విశాఖ, ఉత్తరాంధ్రాలలో కళింగరాజ్యం విస్తరించిన ప్రాంతాలలో ఏర్పాటు చేసే ప్రయత్నంలో తామున్నట్టు ఆమె చెప్పారు.
లాస్ ఏంజెల్స్ కు చెందిన హాలీవుడ్ నటి లిలియన్ రావ్ మాట్లాడుతూ అమెరికా లో తను చాలా చిత్రాలు చేసానని, అయినా తనకు నటనలో సంతృప్తి ఇవ్వలేదని, ఈ క్రమంలోనే జగదీష్ దానేటి తన మూలాలు వెతుక్కుంటూ భారత్‌కు రావటం జరిగింది. మూల కథ విన్నాక నేనూ ఈ పింక్ జాగ్వార్స్ ఎంటర్టైన్మెంట్లో భాగం కావాలనిపించింది అన్నారు.
టీమ్ గ్లోబల్ ఈవెంట్స్ చైర్మన్ వీరుమామా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కళింగ వంశస్తులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రాని భాగం చేస్తున్నందుకు గర్వపడుతున్నామని, తమ పూర్వీకుల ధైర్య సాహసాల హాలీవుడ్ స్థాయిలో తీస్తున్న జగదీష్‌కి అభినందనలు చెప్పారు. భారతదేశపు చరిత్రను ప్రపంచ వేదికపై ప్రదర్శించే విధమైన అశోకుని కథ ఎందచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈకార్యక్రమంలో శ్రీశారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీజీ పాల్గొని యువ రాజ వంశీకుడైన జగదీష్‌ని అభినందిస్తూ, విజయ చిహ్నమైన రాజరికపు ఖడ్గాన్ని బహుకరించి, చిత్రం పెద్ద ఎత్తున విజయం సాధించాలని ఆశీస్సులందించారు.