“ఈచ్‌వ‌న్ టీచ్ వ‌న్” అనే నినాదంతో కేసీఆర్

తెలంగాణ‌ను శ‌ర‌వేగంగా అభివృద్ధి ప‌ధంలో తీసుకువెళ్లే క్ర‌మంలో  కొత్త సంవత్సరంలోముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈచ్‌ వన్‌ – టీచ్‌ వన్‌’ అనే నినాదంతో కొత్త సంకల్పానికి శ్రీ‌కారం చుట్టారు. ప్రతి విద్యావంతుడూ ఒక నిరక్షరాస్యుడిని అక్షరాస్యుడిగా మార్చాలి. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధించే సవాల్‌ను స్వీకరించి, తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రజలు  ప్రతిన బూనాల‌న్న‌ది కేసీఆర్ సంక‌ల్పం.  ఈ స‌రికొత్త నినాదం ఇవ్వ‌టానికి ముఖ్య కార‌ణం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నతెలంగాణ రాష్ట్రం అక్షరాస్యతలో జాతీయ సగటు కంటే బాగా వెనుకబడి ఉండట‌మే అన్న‌ది వాస్త‌వం.
ఒక్క రోజులో సమగ్రసర్వే జరిపిన స్ఫూర్తితో అందరూ ఈచ్ వన్ టీచ్ వన్‌కు నడుం బిగించాల‌ని పిలుపునిచ్చారు.
  రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించే దిశగా త్వరలో కార్యాచరణ ప్రకటించేందుకు ప్ర‌భుత్వంసిద్ద‌మ‌వుతోంది.  
నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మాన్ని ఒంటిచేతితో న‌డిపిన కేసీఆర్  రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణలో అక్షరాస్యతలో పెద్దగా మార్పేమీ తీసుకు రాలేక పోయార‌న్న‌ది చేదు నిజం. ఇది అధికార పార్టీ అంగీక‌రించాల్సిన అక్ష‌ర స‌త్యం.  తెలంగాణ వ‌చ్చి ఆరేళ్లు గ‌డుస్తున్నా ఇప్పటికీ జాతీయ సగటు అక్షరాస్యతాశాతం కంటే రాష్ట్రం వెనుకబడే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించేదే. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ శివార్ల‌తో స‌హా వ‌రంగ‌ల్ , ఖ‌మ్మం లాంటి ముఖ్య ప‌ట్ట‌ణాలు తెలంగాణ‌లో ఎడ్యుకేష‌న్ హ‌బ్‌లుగా విరాజిల్లుతున్నాయి. ఇక ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌లు, క‌ళాశాలు బోలెడు ద‌ర్శ‌న‌మిస్తున్నాఅక్ష‌రాస్య‌త శాతం క‌నీసం పెర‌గ‌క‌పోవ‌టం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే.
 ఈ విషయంపై ఓ సారి దృష్టి సారిస్తే…
 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో అక్షరాస్యత 66.54శాతంగా ఉంటే అప్పట్లో జాతీయ సగటు 74.04గా ఉంది. ఇది సమైక్య రాష్ట్రంలోని తెలంగాణ 10 జిల్లాల పరిస్థితి. ఇక 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ 4 సంవత్సరాల తర్వాత 2018నాటికీ అదే పరిస్థితి ఉంది. 2018 జాతీయ శాంపుల్ సర్వే(ఎన్.ఎస్.ఎస్) ప్రకారం.. దేశ సగటు అక్షరాస్యత 77 శాతానికి పెరిగితే తెలంగాణలో సగటు అక్షరాస్యత 72.8 శాతంగా ఉంది. అంటే రాష్ట్రం ఏర్పడి 4 సంవత్సరాలయ్యాక కూడా తెలంగాణ అక్షరాస్యత శాతం పెరిగినప్పటికీ జాతీయ సగటు కంటే ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… రాజధాని లేకుండా చిన్న రాష్ట్రాలుగా ఏర్పడ్డ జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరఖండ్ లతో పోలిస్తే కూడా అక్షరాస్యతలో తెలంగాణ వెనుక బడింది. ఈ రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతాలు వరుసగా 74.3,77.3,87.6గా ఉన్నాయి.


ఇక దక్షిణాది రాష్ట్రాల విషయానికొస్తే జాతీయ సగటు కంటే అక్షరాస్యత తక్కువున్న రాష్ట్రాలు కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లే కావడం గమనార్హం. మిగిలిన కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు జాతీయ సగటుతో పోలిస్తే ముందున్నాయి. వీటిలో కేరళ 96.2 శాతంతో దేశంలోనే అక్షరాస్యతలో అగ్రగామిగా ఉంది. విభజిత ఆంధ్ర ప్రదేశ్ కూడా తెలంగాణలాగే 2018 నాటికి జాతీయ సగటు కంటే వెనుకబడి 66.4 శాతం దగ్గరే ఆగిపోయింది. తెలంగాణ 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్షరాస్యత పెంచడానికి చాలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో నిర్భంధ విద్య చట్టాన్ని అమలు చేస్తున్నామని పలు నివేదికల్లో వెల్లడించింది. దీనిలో భాగంగా స్కూళ్ల‌లో మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టళ్ల సంఖ్య పెంచడం, మోడల్ స్కూళ్లు ప్రారంభించడం, ఉన్నస్కూళ్లలో మౌలిక సదుపాయాలు పెంచడం వంటి చర్యలు చేపడుతున్నామని పేర్కొంటోంది. దీని వల్లే ఒకప్పుడు తెలంగాణ 10 జిల్లాల్లో అక్షరాస్యత 66.54గా ఉంటే ఇప్పుడది 72.8కి పెరిగిందని అంటోంది.


తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి  కేజీ టు పీజీ పథకాన్ని అమ‌లు చేస్తామ‌ని అధికార టిఆర్ ఎస్ హామీని తెగ ఊద‌ర‌గొట్టింది. తీరా అమ‌లులో మాత్రం చేతులు ఎత్తేసింది. ఈచ్‌వ‌న్ టీచ్ వ‌న్ నినాదాన్ని తీసుకువ‌చ్చిన క్ర‌మంలో  రాష్ట్రం అక్షరాస్యతలో వెనుక వరుసలో ఉండటం ఒక మచ్చగా మిగిలింది. అందర్నీ అక్షరాస్యులను చేయడంలో గత పాలకులు విఫలం కావడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ విప‌క్ష పార్టీల‌పై నెపాన్ని నెట్టివేసే ధోర‌ణి చూపిన కేసీఆర్ త‌ను ఇచ్చిన హామీని ఏమేర‌కు అమ‌లు ప‌రుస్తున్నార‌న్న‌ది విశ‌దీక‌రించేందుకు కూడా న‌చ్చ‌క పోవ‌టం గ‌మ‌నార్హం.


రాష్ట్రాన్ని అన్నింటిలో ముఖ్యంగా ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతున్నామని చెప్పే టీఆర్ఎస్ అక్షరాస్యతను జాతీయ సగటు కంటే పెంచే విషయంలో విఫలం చెందిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటికీ కేజీ టు పీజీ పథకాన్ని హామీ ఇచ్చిన రీతిలో ఆ పార్టీ అమలు చేసి ఉంటే అక్షరాస్యత పెరిగేదని ప్రతిపక్షాలంటున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్ అంతా కేవలం కొన్ని రంగాలకే ఏకపక్షంగా మళ్లించి విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితని అవి విమర్శిస్తున్నాయి. విద్యకు తగినంత బడ్జెట్ కేటాయించి ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప ఈచ్ వన్ టీచ్ వన్ లాంటి నినాదాలతో అక్షరాస్యత పెరిగి రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.


అయితే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరుకుంటున్న‌ట్టు ఈచ్‌వ‌న్ టీచ్ వ‌న్ కార్య‌క్ర‌మంలో అందరూ భాగస్వాములు కావటం ఎంత ముఖ్య‌మో…  అందుకు త‌గిన విధంగా నిధులు, ఉపాధ్యాయ నియామ‌కాల‌పై ప్ర‌భుత్వం దృష్టి సారించాల్సిన అవ‌స‌రం కూడా అంతే ముఖ్యం. రానున్న విద్యా సంవ‌త్స‌రంలో అయినా ఈ  అప్రదిష్టను రూపుమాపేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటేనే క‌నీసం జాతీయ అక్ష‌రాస్య‌తా స‌గ‌టుని  అందుకోగ‌లుగుతుంది.   గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా నే కాదు అక్ష‌రాస్య‌త‌లోనూ భాసిల్లాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని ఇప్ప‌టికైనా పాల‌కులు గుర్తించ‌డం హ‌ర్ష‌ణీయ ప‌రిణామ‌మే.


Leave a Reply

Your email address will not be published.