చంద్రబాబు యాత్ర ను అడ్డుకొనేందుకు రోడ్డు సైతం తవ్వేసారుగా..!తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విశాఖ లో చేట్టిన జ‌న‌చైత‌న్య యాత్ర‌ని  భగ్నం చేసేందుకు పాలక వైసీపీ ప్ర‌భుత్వం ఆ పార్టీ పెద్ద‌లు విశ్వ ప్రయత్నాలు చేసారు. చంద్రబాబు గురు, శుక్రవారాల్లో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించడానికి రావ‌టంతో  విశాఖ విమానాశ్రయంలోనే నిరసన వ్యక్తంచేసేందుకు కార్యకర్తలను భారీగా సమీకరించే క్ర‌మంలొ  పలువురు వైకాపా నాయకులు కార్యకర్తలకు సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు. దీంతో  వైకాపా శ్రేణులు ఎయిర్‌పోర్టుకు వెళ్లే రహదారిపై బైఠాయించి నినాదాలు చేశాయి. వీరికి ప్ర‌తిగా  మ‌రో వైపు తెదేపా కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని జ‌గ‌న్‌కి, పోలీసుల‌కి నినాదాలు చేస్తుండ‌టంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపారు. 


ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గం మొత్తం పోలీసు వలయంలో ఉంది.   పెందుర్తి మండలంలో భూసమీకరణ బాధితులైన రైతులను పరామర్శించ‌డంతో పాటు అక్కడికి సమీపంలోనే ఉన్న రాంపురం గ్రామానికి వెళ్లి…అధికార పార్టీ నాయకుడి కుటుంబం ఆక్రమించినట్లు ప్రచారం జరుగుతున్న వీర్రాజు చెరువును కూడా సందర్శించనున్నార‌ని తెలియ‌టంతో   చంద్రబాబు అక్కడకు వెళ్లకుండా అర కిలోమీటరు ముందు రోడ్డును రాత్రికి రాత్రి అడ్డంగా తవ్వేశారు. ఇది త‌మ ప‌నికాద‌ని వైసిపి నేత ఒక్క ప్ర‌త్యేకంగా మీడియాని పిలిచి చెప్ప‌డం విశేషం. 
మ‌రోవైపు తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం విశాఖపట్నంలో నిర్వహించనున్న ర్యాలీకి  త‌మ అనుమతి లేద‌ని, ఈ ర్యాలీకి ఎవ‌రు వ‌చ్చినా అరెస్టులు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌టం  గ‌మ‌నార్హం. పోలీసులు టిడిపి ర్యాలీకి అనుమతి నిరాకరించడం ప‌ట్ల  తెదేపా నేతలు  ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.  వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు చేర‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోవాల‌ని చూస్తోంద‌ని, ఈ క్ర‌మంలోనే త‌మ అక్ర‌మాలు బైట‌ప‌డ‌కుండా రోడ్ల‌ను సైతం త‌వ్వేసార‌ని ఆరోపించారు. 

Leave a Reply

Your email address will not be published.