‘జనం సంతోషంగా ఇస్తే తీసుకోండి’ …ఓ మంత్రి గారి సలహా.! ఇక మీ సంతోషం అంటూ ఓ నినాదమే..

అవినీతికి ఎవరు పాల్పడినా సహించను అని ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చేసిన ప్రసంగాల ప్రభావం కొంత కాలం పనిచేసినా, ఆ తరువాత ఎవరికి అందింది వారు అందుకుంటునే ఉన్నారు. దీనికి తోడు ఓ మంత్రిగారు … జనం సంతోషంగా ఇస్తే తీసుకోండి అని ఓ ఉచిత సలహా ఇవ్వటంతో … ఇక మీ సంతోషం అంటూ ఓ నినాదమే ఇప్పుడు అన్నింటా కనిపిస్తోంది. చివరికి జగన్ ప్రభుత్వానికి మద్దతిచ్చే పత్రిక కూడా పలానా శాఖలో అవినీతి జరుగుతోంది, పలానా మంత్రి బదిలీలో అవినీతి పరులకు కీలక ప్రాధాన్యత పోస్టు కట్టబెట్టారు అని కధనాలు ప్రచురించే పరిస్థితి ఉందంటే.. అది ఏ స్థాయికి చేరిందో అర్ధం చేసుకోవచ్చు. ఎవరేం చెప్పినా ప్రభుత్వాధినేతలే జై కొడుతుండటంతో ఈ మీ సంతోషం… విశాలమై తిష్టవేస్తోంది.
వాస్తవానికి జనానికి తాయిలాలు ఇవ్వడం దేశంలో కొత్తకాదు… పార్టీలు డబ్బుల పంపిణీ అంతకన్నా కొత్తగాదు. కానీ అధికారంలోకి వచ్చాక తాము పంపిణీ చేసిన మొత్తాలకు తోడుగా రానున్న ఎన్నికలలో నిధులు అందుకునేలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పార్టీలకు ఆనవాయితీగా మారిపోయింది. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా, ఎంత దోపిడీ జరుగుతున్నా చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
అంతెందుకు ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లో ఎంతమంది అవినీతికి పాల్పడ్డారన్న లెక్క ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉంటుంది కదా? మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని ప్రశ్నిస్తే మాత్రం చూసీ చూడనట్టు పోయిన శాతమే ఎక్కువ.. ఓ వేళ చర్యలు తీసుకున్నామని చెప్పుకున్నా అది కాగితాలకే పరిమితమైపోతున్నాయన్న విమర్శలూ లేకపోలేదు. పారదర్శకత కోసమే గ్రామ వాలంటీర్లు, సచివాలయ వ్యవస్ధలు పెట్టినట్టు చెప్పుకొస్తున్నా… చాలీ చాలని జీతాలతో పని చేయటం సాధ్యమైన విషయమా? అన్ని కొందరు పంకా పార్టీ నేతలే చెపుతుండటం, దీనికి తోడు దాదాపు వీరంతా మా పార్టీకి చెందిన వారేనని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు నొక్కి వక్కాణిస్తే, అవును ఎన్నికల సమయంలో మా పార్టీకి సహకరించి, అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలకు భరోసా కల్పించామని, ఇది తప్పేంటని ఓ మంత్రిగారు చెప్పుకొచ్చారు.
ఇది క్షేత్ర స్థాయికే పరిమితం కాలేదు. చంద్రబాబు హయాంలో ఒక కార్పోరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఐఎఎస్ అదికారి, ఐదేళ్లు అత్యంత ప్రాదాన్యత గల శాఖకు హెచ్వోడీగా పనిచేసిన ఐఎఎస్ అధికారిని మళ్లీ జగన్ ప్రభుత్వం కూడా పెద్ద పీట వేస్తూ కీలక ప్రాధాన్యత పోస్టును కట్టబెట్టింది. అవినీతి ఆరోపణలు వచ్చిన ఐఎఎస్ అధికారులు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కాకపోవటమే దానికి కారణమంటూ… ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులు అవినీతిపై ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న పత్రిక కూడా ఆధారాలతో గతంలో కధనాలు ప్రచురించిన విషయాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో సలహాదారులుగా ఉంటున్నవారికి తెలియదని మనం అనుకోవాలేమో. .
చంద్రబాబు అవినీతి పరుడని పదే పదే విమర్శిస్తున్న కొందరు మంత్రులు తమ శాఖలో వివిధ హోదాలలో పని చేస్తున్న అధికారులు గతంలో అవినీతికి పాల్పడినవారిపై, తాజాగా అవకాశం ఉన్నప్పుడు భారీగా ఖరీదైన కానుకలు తీసుకుంటున్నారని తెలిసినా ఇంత వరకు ఏ మంత్రి, ఏ అధికారిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయలేదంటే..లంచాలు అందుతున్నాయా.. లేదా మన పనులు చక్కపెడితే.. చాలులే అనుకుంటున్నారా అనే విషయం బయట పడటం లేదు.
గతంలో వైఎస్ హయాంలో చంద్రబాబు అవినీతిపై కమిటీలు వేసి నానా హడావిడి చేసారు. మరి ఆ కమిటీల నివేదికల ఆధారంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఉన్నాపదే పదే కమిటీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్టే కనిపిస్తోంది. రాజకీయంగా ఆధార రహిత ఆరోపణలు పరస్పరం చేయటం కద్దు. సింగపూర్‌లో హోటల్ ఉందని చెప్పుకొచ్చిన మంత్రులు , ఓ విదేశీ కార్లకంపెనీ ఏర్పాటుకు మధ్యవర్తులకే ప్రభుత్వ పరంగా 10 కోట్లు ఇచ్చి, అది నకిలీ అని తెలిసాక పోనాయి… ఏటి సేత్తాం… అని చెప్పుకొచ్చారు మినహా ఆ కంపెనీ ని రాష్ట్రంలో పెట్టేందుకు ఎందుకు యత్నించలేదో… సదరు మంత్రిగారికే తెలియాలి.
స్థానిక సంస్ధలలో 75% ఉద్యోగాలు చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం కనీసం అమలు దిశగా ప్రయత్నాలు చేసిందా? అని ప్రశ్నించుకుంటే ఏకోశానా కనిపించదు. నిరుద్యోగులలో స్థానిక కర్మాగారాలు, సంస్ధలకు కావాల్సిన ఉద్యోగాలకు సంబంధించి వారిలో నైపుణ్యత పెంచేలా చర్యలు తీసుకున్న దాఖలాలు దాదాపు శూన్యం. ఈ క్రమంలో ఈ చట్టం అమలు చేయాల్సిందే… తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే…అంటూ కంపెనీలను బెదిస్తున్న ఎంపీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నది నిజం. దీనివెనుక కంపెనీల నుంచి మీ సంతోషంతో… అని భారీగా వసూళ్లు చేసుకోవాలని అధికారగణాలు భావిస్తున్నాయని, ఎన్నికలలో అయిన ఖర్చు రాబట్టుకునేందుకు జులూం ప్రదర్శించడం కళ్లకు కట్టినట్టు పత్రికలలో వస్తున్నా…. ఈ క్రమంలోనే కంపెనీలు తరలించేసుకోవాలని సదరు సంస్ధలు అనుకోవటంలో ఆశ్చర్యమేముంది. ఓ మంత్రి గారి సలహా
మనింట్లో పెళ్లి చేసే ముందే అటు ఏడు తరాలు చూడాలన్నది పెద్దల మాట. కానీ అధికారంలోకి వచ్చేందుకు యత్నించే పార్టీల స్థితి గతులను, దాన్ని నడిపించే నేతల అవినీతి పురాణాలను జనం ఏనాడో పక్కన పెట్టేశారు. ఇందుకు ప్రధాన కారణం వారికి ఆయా పార్టీలు అందిస్తున్న ధన పంపిణీ……. ఇది మా సంతోషం కొద్ది..ఇచ్చే పారేయటంతో జనం కూడా వాటికి బాగా అలవాటు పడిపోయారు. ఓట్లకోసం వెళితే…. మాకేంటట? అన్న ప్రశ్న వేసే పరిస్థితి. దానికి సంతృప్తికర సమాధానం ఇలా పరుస్తున్నారు నేతలు.
మరి రాజు ప్రతివారం న్యాయస్థానం ముందు కుట్రలు, అవినీతి, మోసం కేసులతో చేతులు కట్టుకుని నిలబడుతుంటే… పరివారం మాత్రం గట్టున నడుస్తుందా? అన్నది ప్రశ్న. ఈ కేసులలో పలువురు ఐఎఎస్ అధికారులు ఇరుక్కున్న వైనం విదితమే. వీరికి తిరిగి ఏపిలో అందలాలెక్కించేందుకు సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన నేతలే ఢిల్లీకి వెళ్లి, వారిని రాష్ట్రానికి కేటాయించేలా చేయమంటూ లాబీయింగ్‌లు చేస్తున్న వైనం కళ్లముందు కనిపిస్తోంది. ఇది ముఖ్యమంత్రిగారు చెపుతున్న దానికి చేష్టలకి బోలెడంత వ్యత్యాసం ఉంది. దీంతో అందరి అవినీతి జగన్‌కు తెలుసు. కానీ ఆయన కొందరినే టార్గెట్‌గా నిర్ణయించుకున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కేవలం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిపై కక్షబూరిత ధోరణికి ప్రభుత్వం దిగుతోందన్న అపవాదు తొలినాటి నుంచే రాజుకుంది. అమరావతి నుంచి రాజధాని మార్పు అందుకేనన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సామాజిక వర్గానికి చెందిన అధికారులపై పాలకులు వేటు వేస్తున్నారని ఉద్యోగులు, అదికారుల మాట. అవినీతిపై చర్యలు తీసుకోవాలంటే.. ఆదారాలు ముఖ్యం కానీ ‘కుల’ ప్రాతిపదికన కాదని కొందరు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
మరి క్షేత్ర స్ధాయి నుంచి పై స్థాయి వరకు మీ సంతోషం అంటూ ప్రోత్సహించే మంత్రుల వ్యవహారంపై ఎలానూ చర్యలు ఉండవు కనుక తాము ఆడింది ఆట అని భావిస్తున్నారంతా… మరి తను చెప్పిన మాటపై నిలచేందుకు జగన్ ఏచర్యలు తీసుకుంటారో చూడాలి.