ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నంఉపాధి కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ పాలసీల వలన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయని ఆయన వివరించారు.


 టియస్ ఐపాస్ ద్వారా ఇప్పటిదాకా 11569 కంపెనీలు అనుమతులు ఇచ్చామని, ఇందులో సూమారు 80 శాతం కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని ఆయన తెలిపారు. దీని ద్వారా సూమారు 6 లక్షల మందికి ఉపాధి లభించిందని మంత్రి కేటీఆర్ అన్నారు.


భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంగా,  ఉపాధి కల్పనకు అధిక అవకాశాలున్న టెక్స్టైల్ రంగం, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ప్రగతి భవన్ లో పరిశ్రమలు, ఐటి శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.


రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమకి అనుకూలమైన పరిస్థితులున్న నేపథ్యంలో ఈ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత రంగ పరిశ్రమ గుర్తింపు ఇచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే దేశంలోని అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్కుని వరంగల్ లో ప్రారంభించిందని, కొరియా దిగ్గజ కంపెనీ యంగ్వాన్ ఇక్కడ భారీ యూనిట్ ఎర్పాటు చేస్తున్నదని తెలిపారు.


దీంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం గురించి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈమధ్యనే బెంగళూరులో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించినట్లు, అవసరమైతే మరిన్ని సమావేశాలను వివిధ నగరాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.


ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇప్పటికే వన్ ప్లస్, స్కైవర్త్ వంటి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, దీంతోపాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్  వాహన తయారీ  సంస్థలు, బ్యాటరీ తయారీ వంటి వాటి పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.


దీంతోపాటు తెలంగాణలో ప్రస్తుతం పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఇస్తున్నందున రాష్ర్టంలో వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.


ఈ నేపథ్యంలో ఈ మూడు రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మూడు రంగాల్లో నూతనంగా దేశంలోకి వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకొని పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని పరిశ్రమల శాఖ, ఐటి శాఖ డైరెక్టర్లకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 

Leave a Reply

Your email address will not be published.