టిఆర్ ఎస్ టిక్కెట్లకోసం వైసిపి నేతల ఒత్తిడి

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావటంతో అధికార టిఆర్ ఎస్ పార్టీకే ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకునే ఆస్కారం ఉందంటూ నివదికలు అందుతున్న క్రమంలో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు చాలా మంది ఆశావహులు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వీరి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుండటంతో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో అర్ధం కాక టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు. దీనికి తోడు అధినేత కేసీఆర్ ఇచ్చిన టార్గెట్లతో ఓటమి చవిచూస్తే తమ పదవులకు ఎక్కడ ముప్పువస్తుందోనన్న ఆందోళనలో ఉన్నారు.
అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ల కోసం ఏపీలో అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి తెలంగాణాలో ఉంటున్న తమ వారికి టిక్కెట్లు ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలకు ఫోన్లు చేస్తుంటంతో ఏం చేయాలో పాలుపోవటం లేదు.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిసరాలలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 17 నగర పంచాయితీలు ఏర్పడ్డాయి. వీటిలో ముఖ్యంగా నిజాంపేట, మణికొండ, తెల్లాపూర్, అమీన్పూర్, నార్సింగ్, పెద్ద అంబర్ పేట, బడంగ్ పేట, మీర్ పేట తదితర ప్రాంతాలలో ఏపీకి చెందినవాళ్లే ఎక్కువుగా ఉన్నారు. వీరిలో చాలా మంది ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఇక్కడ స్థిర నివాసమేర్పరచుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా , ఇతరత్రా వ్యాపారులుగా పైకి ఎదిగిన వారూ ఉన్నారు. జగన్ పార్టీ పెట్టాక కొందరు వైసిపి లీడర్లుగా చలామణి కాగా మరికొందరు టీఆర్ఎస్లో చేరి స్థానిక లీడర్లుగా ఎదిగారు కూడా.
రాయలసీమ జిల్లాలకు చెందిన ఓ మంత్రితో పాటు ఆంధ్రా ఏరియాకు చెందిన మరో మంత్రి కొందరు ఎమ్మెల్యేల అనుచరులు తాము చెప్పిన వాళ్లకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిపిస్తామని, ఇందు ఎంత డబ్బు ఖర్చయినా తాము భరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఆఫర్లు ఇస్తున్నట్టు టిఆర్ ఎస్ టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రా ప్రభావం పలు వార్డులలో ఎక్కువగా కనిపిస్తుండటంతో తమ వారికి టిక్కెట్లు ఇవ్వాలని ఏపీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు కొంత ప్రభావం చూపే ఆస్కారం కనిపిస్తోంది. ఏపీకి చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అనుచర, సామాజికవర్గానికి చెందిన నేతలుగా ఓ వర్గం ఇప్పటికే రంగంలోకి దిగి టిక్కెట్ల కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లుఆరంభించిందని తెలుస్తోంది. మరేం జరగనుందో చూడాలి.